-ఓటమి భయంతోనే జగన్ రెడ్డి పింఛన్ రాజకీయాలు
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు
తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్లతో వైసీపీ బలవంతపు రాజీనామాల రాజకీయం చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చిలకలూరిపేట 34వ వార్డులోని వర్ష అపార్ట్‌మెంట్, 35వ వార్డులోని సాయి అపార్ట్‌మెంట్ వాసులతో ప్రత్తిపాటి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పెద్దఎత్తున నమోదవుతున్న వాలంటీర్ల రాజీనామాలు వైసీపీ కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అందించడం, పింఛన్ల నగదు పంపిణీకి వారిని దూరంగా ఉంచాలని, ఫోన్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో కావాలనే ఈ రాజీనామాల డ్రామాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటమి భయంతోనే జగన్‌రెడ్డి గ్యాంగ్ మళ్లీ కనిపించిన అడ్డదారులు తొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. మంచి చేశామని నమ్మితేనే ఓటేయండని అడుగుతున్న వ్యక్తి వాలంటీర్ల విషయంలో ఇన్ని కుయుక్తులు ఎందుకు పన్నుతున్నారో చెప్పాలని నిలదీ శారు. ధైర్యం ఉంటే వాలంటీర్లు, వైసీపీ పోలీసుల ప్రమేయం లేని ఎన్నికలకు సిద్ధపడాలని ఆయన సవాల్ విసిరారు. అనంతరం నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావిస్తూ అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చి నిధులు తీసుకొస్తామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్య పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని వివరించారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.