తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోనున్న ఢిల్లీ సీఎం
లిక్కర్ కేసులో మార్చి 21న అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 49 రోజుల జైలు జీవితం తర్వాత మే 10న బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు.. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అయితే, బెయిల్ ఇచ్చిన రోజే జూన్ రెండున మళ్లీ సరెండర్ కావాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిశాయి. అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం ఇచ్చిన గడువూ ముగిసింది.. దాంతో, ఇవాళ తిరిగి జైలు అధికారుల ముందు లొంగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే, అనారోగ్య కారణాలతో బెయిల్ పొడిగించాలని కోరినా పిటిషన్‌ను కనీసం లిస్ట్ చేయడానికి కూడా నిరాకరించింది సుప్రీంకోర్టు.. దాంతో, ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు అరవింద్ కేజ్రీవాల్.. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు.. తీర్పును రిజర్వు చేయడంతో ఈరోజు లొంగిపోక తప్పని పరిస్థితి వచ్చింది.
కాగా, తీహార్ వెళ్లి లొంగి పోతానని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి బయలుదేరి రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తానని తెలిపారు. అక్కడి నుంచి కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ జీ ఆశీస్సులు తీసుకుంటారు.
ఆ తర్వాత అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, పార్టీ నేతలను కలుస్తారు. అక్కడి నుంచి మళ్లీ తీహార్‌కు బయలు దేరుతారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.