-ప్రజలను నేరుగా కలవనీయండి
-సెక్యూరిటీకి సీఎం ఆదేశం
-పార్టీ ఆఫీసు సిబ్బందితో భేటీ
-పనితీరుకు అభినందన
-సీఎం హోదాలో తొలిసారి పార్టీ ఆఫీసుకు బాబు
విజయవాడ: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి సిఎం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబు నాయుడుకి నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికారు. తనను కలవడానికి వచ్చిన సామాన్యులతో చంద్రబాబు నాయుడు ఫోటోలు దిగి ఆప్యాయంగా పలకరించారు. సమస్యలపై పలువురు వినతిపత్రాలు తీసుకురాగా వాటిని స్వయంగా తానే స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజలు నేరుగా తనను కలిసే అవకాశం ఇవ్వాలని….బారికేడ్లు కట్టవద్దని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు.
అనంతరం అందుబాటులో ఉన్న నేతలతో సీఎం సమావేశం అయ్యారు. 5 హామీలపై సంతకాలు పెట్టిన అంశంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని నేతలు సిఎంకు వివరించారు. తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బందితో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ కార్యాలయంలో విభాగాల వారీగా వారి పనితీరును తెలుసుకుని 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బాగా పనిచేశారని అభినందించారు.
నాటి ప్రభుత్వ అరాచకాలను, అక్రమాలను వెలికితీయడంలో…వాటిని ఎక్స్ పోజ్ చేయడంలో, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో పార్టీ కార్యాలయంలో ఉన్న వివిధ విభాగాల పనితీరు మంచి ఫలితాన్ని ఇచ్చిందని ప్రశంసించారు. అయితే విజయంతో పని అయిపోయినట్లు కాదని….మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. పార్టీ పరంగా అందరికీ న్యాయం చేస్తానని….తాను అందుబాటులో ఉంటానని చందబాబు నాయుడు తెలిపారు