ప్రత్యేక యంత్రాంగంతో సమస్యల పరిష్కారానికి లోకేష్ కృషి
అమరావతి: వైసీపీ పాలనలో అన్ని విధాల నష్టపోయి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలు యువనేత లోకేష్ ప్రారంభించిన “ప్రజాదర్బార్” కు జనం పోటెత్తుతున్నారు. ఉండవల్లి నివాసంలో మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించుకునేందుకు వేకువజాము నుంచే ప్రజలు పెద్దఎత్తున బారులు తీరుతున్నారు. లోకేష్ వద్దకు వెళితే తమకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకంతో మంగళగిరి ప్రజలు ఆయనను కలిసి సమస్యలు విన్నవిస్తున్నారు.
బుధవారం నాడు నిర్వహించిన ప్రజాదర్బార్ కు నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతిఒక్కరి సమస్యను ఓపిగ్గా వింటున్న లోకేష్ యంత్రాంగం ద్వారా ఆయాశాఖలకు రిఫర్ చేసి పరిష్కారం చూపుతున్నారు. తన కుమార్తెకు వికలాంగ పెన్షన్ మంజూరుచేయాలని మంగళగిరికి చెందిన కే.శ్రీలక్ష్మీ కోరారు. భర్త చనిపోయిన నలుగురు పిల్లలు ఉన్న తనకు జీవనాధారం కల్పించడంతో పాటు ఇంటిని మంజూరు చేయాలని సీతానగరానికి చెందిన కే.కనకదుర్గ లోకేష్ ను కలిసి విజ్ఞుప్తి చేశారు. మానసిక వికలాంగురాలైన తన కుమార్తెకు గత వైసీపీ ప్రభుత్వం ఫించను నిలిపివేసిందని, తిరిగి పునరుద్ధరించాలని తాడేపల్లికి చెందిన షేక్ సుల్తాన్ వలి విన్నవించారు.
రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్ ను గత ప్రభుత్వం నిలిపివేసిందని, తిరిగి మంజూరు చేయాలని నవులూరుకు చెందిన రైతు వేమూరి విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. డిగ్రీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని మంగళగిరికి చెందిన షేక్ రెహ్మాన్ కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్యసాయం అందించాలని దుగ్గిరాలకు చెందిన బి.శాంతరాజు, ఎలాంటి ఆధారం లేని తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎన్.మాధవి వినతిపత్రం అందజేశారు.
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ డబ్ల్యూఆర్ స్కూల్, కాలేజీల్లో పనిచేస్తున్న పార్ట్ టైం సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని సిబ్బంది కోరారు. వైసీపీ ప్రభుత్వం తొలగించిన 1800 మంది బీమా మిత్రలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని ఏపీఏసీటీపీఎల్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని ఏపీఎన్ఎస్ కమిటీ విజ్ఞప్తి చేసింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కరిస్తానని యువనేత హామీ ఇచ్చారు.