• 13.8 లక్షల ఇళ్ళను పూర్తి చేయలేకపోయారు,5లక్షల ఇళ్ళు పనులే మొదలుకాలేదు
• గృహ నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం పేదలకు తీరని నష్టం చేసింది
• 2014-19లో యూనిట్ విలువ రూ.2.5లక్షలుంటే దాన్నిరూ.1.80 ల.కు తగ్గించారు
• 2014-19లో రాష్ట్ర స్వంత నిధులతో 4.43 లక్షల ఇళ్ళు నిర్మిస్తే వాటికి 933 కోట్ల రూ.ల పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టింది
• గత ప్రభుత్వం గృహనిర్మాణానికి అనువుగాని స్థలాలను సేకరించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది.దానిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం
• దారితప్పిన గృహనిర్మాణ వ్యవస్థను గాడిలోపెట్టి సకాలంలో ఇళ్ళు నిర్మించి ఇస్తాం
• జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల ప్రక్రియను వేగవంతం చేస్తాం
– రాష్ట్ర గృహనిర్మాణ,సమచార శాఖ మంత్రి కె.పార్ధసారధి
గృహ నిర్మాణ పధకాల విషయంలో అస్తవ్యస్థ విధానాలతో గత ప్రభుత్వం పేదలకు తీరని నష్టం కలిగించిందని అంతేగాక 2019-2024 కాలంలో రాష్రానికి 20 లక్షల 60 వేల గృహాలు మంజూరైతే కేవలం 6.8లక్షల ఇళ్ళను మాత్రమే పూర్తి చేయగలిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు కె.పార్ధసారిది అన్నారు.
బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం 2019-204 కాలంలో రాష్ట్రానికి 20లక్షల 60వేల గృహాలు మంజూరైతే కేవలం 6.8లక్షల ఇళ్ళను మాత్రమే పూర్తి చేయగలిగిందని 13.8 లక్షల ఇళ్ళను పూర్తి చేయలేదని వాటిలో సుమారు 5లక్షల ఇళ్ళ నిర్మాణం అసలు మొదలే కాలేదని అన్నారు.పేదల గృహ నిర్మాణం విషయంలో అస్తవ్యస్థ విధానాలతో పేదలకు తీరని నష్టం కలిగించిందని చెప్పారు.
2014-19 కాలంలో గృహం యూనిట్ విలువ 2లక్షల 50వేల రూ.లుగా ఉండగా దానిని గత ప్రభుత్వం లక్షా 80వేల రూ.లకు తగ్గించిందని గుర్తు చేశారు. ఎస్సి,ఎస్టిలకు యూనిట్ విలువ 2లక్షల రూ.లకు అదనంగా మరో లక్ష రూ.లు సహాయం కలిపి 3లక్షల రూ.లు వరకూ సాయం అందేదని కాని గత ప్రభుత్వం యూనిట్ విలువను తగ్గించడంతో లబ్దిదారులు చాలా వరకూ నష్ట పోవడమేగాక గృహ నిర్మాణ పధకాలు కుంటుపడ్డాయని మంత్రి పార్ధసారధి స్పష్టం చేశారు.
దేశంలో గత ఐదేళ్ళ కాలంలో గృహ నిర్మాణం విషయంలో 45 లక్షల గృహాలను నిర్మించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా 37 లక్షల ఇళ్ళు నిర్మించి మధ్యప్రదేశ్ ద్వితీయ స్థానంలోను,33లక్షలతో బీహార్ తృతీయ స్థానంలోను,31 లక్షల ఇళ్ళు నిర్మించి ఉత్తరప్రదేశ్ నాల్గవ స్థానంలోను నిలిచిందని గృహ నిర్మాణ,సమాచారశాఖ మంత్రి కె.పార్ధసారధి పేర్కొన్నారు.
2014-19లో చంద్రబాబు సియంగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సుమారు 4.43 గృహాలను నిర్మిస్తే వాటికి చెల్లించాల్సిన 933 కోట్ల రూ.ల బిల్లులను గత ప్రభుత్వం చెల్లించ లేదని మంత్రి పార్ధసారధి పేర్కొన్నారు.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(అర్బన్)కింద కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఇప్పటి వరకూ 18వేల 173 కోట్ల రూ.లను ఇస్తే వాటిలో 2వేల 913 కోట్ల రూ.లను గత రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుందని అంతేగాక రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన 1306 కోట్లను ఇవ్వలేదని మొత్తం కలిపి 4వేల 219 కోట్ల రూ.లను గృహ నిర్మాణ సంస్థకు జమ చేయక పోవడంతో 7శాతం పెనాల్టీ కింద 28 కోట్ల రూ.లు కేంద్రానికి చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు.
అదే విధంగా పీఎం ఆవాస్ యోజన(గ్రామీణ్)కింద కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఇప్పటి వరకూ 1018 కోట్ల రూ.లు ఇవ్వగా వాటిలో రూ.270 కోట్లను గత ప్రభుత్వం వాడేసుకోవంతో పాటు రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన రూ.269 కోట్లను ఇవ్వలేదని వెరసి 539 కోట్ల రూ.లను గృహ నిర్మాణ సంస్థకు జమ చేయాల్సి ఉందన్నారు.గత ఐదేళ్ళ కాలంలో గృహ నిర్మాణ పధకాలకు కేంద్రం నుండే అధిక నిధులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం నిధులు చాలా నామ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణాలకు అనువుగాని స్థలాలను అనగా స్మశాన వాటికలు, చెరువులు,కొండవాలు వంటి ప్రదేశాలను సేకరించి కోట్లాది రూ.లను దుర్వినియోగం చేయడం జరిగిందని 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరణ చేశారా లేదా అనేది విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని మంత్రి పార్ధసారధి స్పష్టం చేశారు.గత ప్రభుత్వం 11వేల 782 లే అవుట్లలో గృహ నిర్మాణాలు చేపట్టగా వాటికి ప్రాధమికంగా కావాల్సిన కనీస సౌకర్యాలైన లెవెలింగ్,గ్రావెల్ రోడ్లు,నీటి సరఫరాకు కేవలం 7500 లే అవుట్లలో 897 కోట్లతో పనులు చేపట్టగా రూ.246 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించారని మిగతా పనులు పూర్తి కాలేదని అన్నారు.
ఇలాంటి లోపభూయిష్ట ప్రణాళిక వల్ల 11వేల 782 లేఅవుట్లలో చేపట్టిన 12లక్షల ఇళ్ళకు గాను కేవలం 2.07 లక్షల ఇళ్ళను మాత్రమే పూర్తి చేయగలిగారని మంత్రి పార్ధసారధి చెప్పారు.అంతేగాక ఇళ్ళు పూర్తయిన ఒక్క లేఅవుట్లోను సిమ్మెంట్ కాంక్రీట్ రోడ్లు, మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయలేదని దానివల్ల కష్టపడి ఇళ్ళు నిర్మించుకున్న లబ్దిదారులకు ఆయా ఇళ్ళలో నివసించే భాగ్యం కలగలేదని పేర్కొన్నారు.గృహ నిర్మాణ కాలనీలు,లేఅవుట్లలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఉపాధిహామీ,అమృత్ పధకాల నిధుల అనుసంధానంతో పనులు పూర్తి చేస్తామని మంత్రి పార్ధసారధి తెలిపారు.
పట్టణ ప్రాంత లబ్దిదారులకు 2014-19 కాలంలో నిర్మించిన 90శాతం పైగా పనులు పూర్తయిన టిడ్కో గృహాలను గత ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మంత్రి పార్ధసారధి ఎద్దేవా చేశారు.అయితే ఆగృహాలను షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మించడంతో అవి ఐదేళ్ళయిన చెక్కు చెదరకుండా ఉన్నాయని మిగతా పనులు పూర్తి చేసి వాటిని త్వరిత గతిన లబ్దిదారులకు అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
జర్నలిస్టుల ఇళ్ళ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తాం
రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు అందించే ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో ఇళ్ళ స్థలాలు అందించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ,సమచార శాఖామాత్యులు కె.పార్ధసారధి హామీ ఇచ్చారు