Suryaa.co.in

National

దాల్ సరస్సు ఒడ్డున మోదీ అంతర్జాతీయ యోగా

(వెంకట్)

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి 2 రోజుల పాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు.. మూడోసారి ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోదీ.. జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. కాగా, శుక్రవారం జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జమ్మూ కాశ్మీర్‌లో జరుపుకోనున్నారు. శ్రీనగర్‌ లోని దాల్‌ సరస్సు ఒడ్డున ఆయన యోగా దినోత్సవాన్ని జరుపు కోనున్నారు.

యోగా దినోత్సవానికి ముందు ప్రధాని మోదీ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు యువతతో ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీనగర్‌ లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఇటీవలి కాలంలో కొన్ని ఉగ్రవాద ఘటనలు కూడా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దృష్ట్యా, మొత్తం శ్రీనగర్‌ను రెడ్ జోన్‌గా మార్చారు.. షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్, దాల్ సరస్సు చుట్టూ పక్షులు కూడా తిరగ లేనంతగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

కాగా, ప్రధాని తన పర్యటనలో జమ్మూ కాశ్మీర్‌కు 1500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు లను బహుమతిగా ఇవ్వనున్నారు. అనంతరం జూన్ 21న ఉదయం 6:30 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.

2015 నుంచి ప్రతి ఏటా యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్నారు.

ఢిల్లీ, చండీగఢ్, డెహ్రాడూన్, రాంచీ, లక్నో, మైసూర్, న్యూయార్క్‌ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంతో సహా పలు ప్రతిష్టాత్మక ప్రదేశాలలో యోగా దినోత్సవ వేడుకలకు ఆయన నాయకత్వం వహించారు.

ఈ ఏడాది యోగా దినోత్సవం థీమ్ ‘యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ’, వ్యక్తిగత, సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించడంలో దాని ద్వంద్వ పాత్రను హైలైట్ చేస్తుంది.. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు స్థాయి భాగస్వామ్యాన్ని, యోగా వ్యాప్తిని ప్రోత్సహిస్తుందని పీఎంఓ తెలిపింది.

LEAVE A RESPONSE