-మీరూ అరకు కాఫీని ఆస్వాదించండి
-మోదీ ‘మన్‌కీ బాత్’లో చంద్రబాబు ప్రస్తావన
వికసిత భారత దేశం కోసం ప్రయత్నాలు
మనందరి జీవితాల్లో ‘అమ్మ’కు అత్యున్నత స్థానం
‘అమ్మ పేరుపై ఒక చెట్టు
భూమాత మనందరి జీవితాలకు ఆధారం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
2024 వ సంవత్సరం జూన్ 30 వ తేదీన జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 111 వ భాగం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం..
నా ప్రియమైన దేశ ప్రజలారా..!
నమస్కారం..
ఇప్పుడు రుతు పవనాలు కూడా వచ్చాయి. రుతు పవనాలు వస్తే మనసు కూడా ఆనందంగా ఉంటుంది. తమ పని ద్వారా సమాజంలో, దేశంలో మార్పు తీసుకు వస్తున్న దేశ ప్రజల గురించి ఈ రోజు నుండి మరోసారి ‘మన్ కీ బాత్’ లో మనం చర్చిస్తాం. మన సుసంపన్న సంస్కృతి గురించి, మహి మాన్విత చరిత్ర గురించి మాట్లాడుకుంటాం. వికసిత భారత దేశం కోసం ప్రయత్నాలను చర్చిస్తాం.. ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను.
ఈ రోజు జూన్ 30వ తేదీ చాలా ముఖ్యమైన రోజు. మన ఆదివాసీ సోదర సోదరీమణులు ఈ రోజును ‘హూల్ దినోత్సవం’గా జరుపుకుంటారు. ఈ రోజు పరాయి పాలకుల దౌర్జన్యాలను తీవ్రంగా వ్యతిరేకించిన పరాక్రమ శాలులు సిద్ధో-కాన్హుల తిరుగులేని ధైర్యంతో ముడిపడి ఉంది. ధైర్యవంతులైన సిద్ధో- కాన్హు వేలాది మంది సంథాలీ సహచరులను ఏకం చేసి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఇది ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా..? ఇది 1855లో జరిగింది. అంటే 1857లో జరిగిన భారత దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి రెండేళ్ల ముందన్నమాట.
జార్ఖండ్ లోని సంథాల్ పరగణాలో మన ఆదివాసీ సోదర సోదరీమణులు విదేశీ పాలకులకు వ్యతిరేకంగా అప్పుడు ఆయుధాలు చేపట్టారు. ఆ కాలంలో బ్రిటిష్ వారు మన సంథాలీ సోదర సోదరీమణులపై అనేక అఘాయిత్యాలకు పాల్పడ్డారు. వారిపై అనేక ఆంక్షలు కూడా విధించారు. ఈ పోరాటంలో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీరులు సిద్ధో, కన్హూ వీర మరణం పొందారు. జార్ఖండ్ నేల లోని ఈ అమర పుత్రుల త్యాగం ఇప్పటికీ దేశప్రజలకు స్ఫూర్తినిస్తుంది..
ప్రపంచంలో అత్యంత విలువైన సంబంధం ఏది అని నేను మిమ్మల్ని అడిగితే మీరు ఖచ్చితంగా ‘అమ్మ’ అని చెప్తారు. మనందరి జీవితాల్లో ‘అమ్మ’కు అత్యున్నత స్థానం ఉంది. దుఃఖాన్ని భరించి కూడా తల్లి తన బిడ్డను పోషిస్తుంది. ప్రతి తల్లి తన బిడ్డపై ప్రేమను చూపిస్తుంది. జన్మనిచ్చిన తల్లి ప్రేమ రుణం లాంటిది. దీన్ని ఎవరూ తీర్చుకోలేరు. అమ్మకి మనం ఏమీ ఇవ్వలేం. కానీ ఇంకేమైనా చేయగలమా అని ఆలోచించాను.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం పేరు – ‘ఏక్ పేడ్ మా కే నామ్’- ‘అమ్మ పేరుపై ఒక చెట్టు’. మా అమ్మ పేరు మీద నేను కూడా ఒక చెట్టు నాటాను. దేశ ప్రజలందరికీ- ప్రపంచం లోని అన్ని దేశాల ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వారి తల్లితో కలిసి లేదా ఆమె పేరు మీద ఒక చెట్టు నాటాలనేది ఆ విజ్ఞప్తి.
తల్లి జ్ఞాపకార్థం లేదా ఆమె గౌరవార్థం మొక్కలు నాటాలనే ప్రచారం వేగంగా జరగడం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రజలు తమ తల్లితో కలిసి లేదా ఆమె ఫోటోతో చెట్లను నాటుతున్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి కోసం మొక్కలు నాటుతున్నారు. వారు ధనికులు కావచ్చు. పేద వారు కావచ్చు. ఉద్యోగం చేసే మహిళ కావచ్చు. లేదా గృహిణి కావచ్చు. ఈ ఉద్యమం ప్రతి ఒక్కరికీ తమ తల్లి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తీకరించడానికి సమాన అవకాశాన్ని కల్పించింది. అమృత మహోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా 60 వేలకు పైగా అమృత సరోవరాలను కూడా నిర్మించారు. ఇకపై కూడా అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి.
దేశంలోని వివిధ ప్రాంతాలకు రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ వర్షాకాలంలో అందరూ తమ ఇంట్లో వెతుకులాట ప్రారంభించిన వస్తువు ‘గొడుగు’.. ఈ రోజు ‘మన్ కీ బాత్’ లో నేను మీకు ప్రత్యేకమైన గొడుగుల గురించి చెప్పాలను కుంటున్నాను. ఈ గొడుగులు మన కేరళలో తయారు చేస్తారు. నిజానికి కేరళ సంస్కృతిలో గొడుగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కేరళ లోని ఒక చిన్న గ్రామం నుండి బహుళ జాతి కంపెనీల వరకు కార్థుంబీ గొడుగులు తమ ప్రయాణాన్ని పూర్తి చేస్తున్నాయి. స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది?
వచ్చే నెలలో ఈ సమయానికి ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభమవుతాయి. ఒలింపిక్ క్రీడల్లో భారత ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు మీరందరూ కూడా ఎదురు చూస్తారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టోక్యో ఒలింపిక్స్ జ్ఞాపకాలు ఇప్పటికీ మనందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి.
ఈ రేడియో కార్యక్రమం విని మీరు కూడా ఆశ్చర్యపోయారు కదా..!? రండి.. దీని వెనుక ఉన్న మొత్తం కథను మీకు చెప్తాను. ఇప్పుడు మనం కువైట్ గురించి మాట్లాడు కుంటున్నామని మీరు అనుకుంటారు. అక్కడికి హిందీ ఎలా వచ్చింది..? వాస్తవానికి కువైట్ ప్రభుత్వం తన జాతీయ రేడియోలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అది కూడా హిందీలో. ‘కువైట్ రేడియో’ లో ప్రతి ఆదివారం అరగంట పాటు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
ఇందులో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న అంశాలు ఉన్నాయి. కళా ప్రపంచానికి సంబంధించిన మన సినిమాలు, చర్చలు అక్కడి భారతీయ సమాజంలో బాగా ప్రాచుర్యం పొందాయి. కువైట్ స్థానిక ప్రజలు కూడా దీనిపై చాలా ఆసక్తి చూపు తున్నారని నాకు తెలిసింది. ఈ అద్భుతమైన చొరవ ప్రదర్శించినందుకు కువైట్ ప్రభుత్వానికి, ప్రజలకు నేను హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..
నేడు ప్రపంచ వ్యాప్తంగా మన సంస్కృతిని కీర్తిస్తున్న తీరు పట్ల ఏ భారతీయుడు సంతోషించకుండా ఉండగలడు..? ఉదాహరణకు తుర్క్‌మెనిస్తాన్‌లో ఈ సంవత్సరం మే లో అక్కడి జాతీయ కవి 300వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రపంచం లోని 24 మంది ప్రముఖ కవుల విగ్రహాలను తుర్క్ మెనిస్తాన్ అధ్యక్షుడు ఆవిష్కరించారు.
ఈ విగ్రహాలలో ఒకటి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ది కావడం విశేషం. ఇది గురు దేవుడికి గౌరవం. భారత దేశానికి గౌరవం. అదే విధంగా జూన్ నెలలో రెండు కరేబియన్ దేశాలు సూరినామ్, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్ తమ భారతీయ వారసత్వాన్ని పూర్తి ఉత్సాహంతో, ఉల్లాసంతో జరుపుకున్నాయి.
సూరినామ్ లోని భారతీయ సమాజం ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని ఇండియన్ అరైవల్ డే గా, ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకుంటుంది. అక్కడ హిందీతో పాటు భోజ్‌పురి కూడా ఎక్కువగా మాట్లాడతారు. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన మన సోదర సోదరీమణులు దాదాపు ఆరు వేల మంది ఉంటారు. వారందరూ తమ వారసత్వం గురించి చాలా గర్వపడుతున్నారు.
జూన్ 1వ తేదీన వారందరూ ఇండియన్ అరైవల్ డే ని ఘనంగా జరుపుకున్న విధానంలో ఈ భావన స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. భారతీయ వారసత్వం, సంస్కృతులకు సంబంధించిన అటువంటి విస్తరణ ప్రపంచ వ్యాప్తంగా కనిపించినప్పుడు ప్రతి భారతీయుడూ గర్వ పడుతున్నాడు.
ఈ నెల యావత్ ప్రపంచం 10వ యోగా దినోత్సవాన్ని ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంది. జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను.
సౌదీ అరేబియాలో మొదటిసారిగా ఒక మహిళ అల్ హనౌఫ్ సాద్ గారు ఉమ్మడి యోగా సాధన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఒక సౌదీ మహిళ ప్రధాన యోగా సెషన్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి..
ఈసారి యోగా దినోత్సవం సందర్భంగా ఈజిప్టులో ఫొటోల పోటీ నిర్వహించారు. నైలు నది తీరం వెంబడి, ఎర్ర సముద్రం బీచ్ లలో, పిరమిడ్‌ల ముందు లక్షలాది మంది యోగా సాధన చేస్తున్న చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి.
యోగా దినోత్సవంలో పాల్గొన్న మిత్రులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. గతం నుండి నేను మిమ్మల్ని కోరుకుంటున్న విషయం ఒకటుంది. మనం యోగాను ఒక్కరోజు మాత్రమే సాధన చేసి ఆపేయ కూడదు. క్రమం తప్పకుండా యోగా చేయాలి. ఫలితంగా మీరు ఖచ్చితంగా మీ జీవితంలో సానుకూల మార్పులను అనుభవిస్తారు..
భారత దేశానికి చెందిన అనేక ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. భారత దేశ స్థానిక ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తం కావడం చూసినప్పుడు గర్వంతో నిండి పోవడం సహజం. అటువంటి ఒక ఉత్పత్తి అరకు కాఫీ..
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతా రామరాజు జిల్లాలో అరకు కాఫీ భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. ఇది గొప్ప రుచికి, సువాసనకు ప్రసిద్ధి చెందింది. అరకు కాఫీ సాగులో దాదాపు ఒకటిన్నర లక్షల ఆదివాసీ కుటుంబాలు నిమగ్నమై ఉన్నాయి.
అరకు కాఫీ ఖ్యాతి కొత్త శిఖరాలకు చేరడంలో గిరిజన సహకార సంఘం ప్రధాన పాత్ర పోషించింది. అక్కడి రైతు సోదర సోదరీ మణులను ఏకతాటి పైకి తీసుకొచ్చి, అరకు కాఫీ సాగు చేసేలా ప్రోత్సహించింది. దీంతో ఈ రైతుల ఆదాయం కూడా బాగా పెరిగింది. కొండ దొర ఆదివాసీ సమాజం కూడా దీని వల్ల ఎంతో లబ్ధి పొందింది. సంపాదనతో పాటు గౌరవ ప్రదమైన జీవితాన్ని కూడా వారు పొందుతున్నారు.
ఒకసారి విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ కాఫీని రుచి చూసే అవకాశం నాకు లభించిందని గుర్తుంది. దాని రుచి గురించి అడగవలసిన అవసరమే లేదు..! ఈ కాఫీ అద్భుతమైంది..! అరకు కాఫీకి అనేక అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ఢిల్లీలో జరిగిన జి-20 శిఖరాగ్ర సమ్మేళనం లోనూ కాఫీ మాధుర్యాన్ని అతిథులు రుచి చూశారు. మీకు అవకాశం దొరికినప్పుడల్లా అరకు కాఫీని కూడా ఆస్వాదించండి..
మన జమ్మూ కశ్మీర్ ప్రజలు కూడా స్థానిక ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తం చేయడంలో వెనుకబడి లేరు. జమ్మూ కశ్మీర్‌లో గత నెలలో చేసిన పనులు దేశ వ్యాప్తంగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
అక్కడి పుల్వామా నుంచి లండన్‌కు మంచు బఠానీల మొదటి సరుకును పంపారు. కాశ్మీర్‌లో పండే విలక్షణమైన కూరగాయలను ప్రపంచ పటం లోకి ఎందుకు తీసుకు రాకూడదనే ఆలోచన కొంత మందికి వచ్చింది. అప్పుడు చకూరా గ్రామానికి చెందిన అబ్దుల్ రషీద్ మీర్ గారు ఇందుకు ముందుగా ముందుకు వచ్చారు. గ్రామం లోని ఇతర రైతుల భూమితో సమష్టిగా మంచు బఠానీ లను పండించే పనిని ప్రారంభించారు. త్వరలో కశ్మీర్ నుండి మంచు బఠానీలు లండన్ కు పంపడం మొదలుపెట్టారు. ఈ విజయం జమ్మూ కాశ్మీర్ ప్రజల సమృద్ధికి కొత్త ద్వారాలు తెరిచింది.
ఈ రోజు జూన్ 30వ తేదీన ఆకాశవాణి సంస్కృత బులెటిన్ ప్రసారం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ బులెటిన్ చాలా మందిని 50 సంవత్సరాలుగా సంస్కృతంతో నిరంతరం అనుసంధానించింది. నేను ఆకాశవాణి కుటుంబాన్ని అభినందిస్తున్నాను..
ప్రాచీన భారతీయ విజ్ఞానంలో, వైజ్ఞానిక పురోగతిలో సంస్కృతం ముఖ్య పాత్ర పోషించింది.. మనం సంస్కృతానికి గౌరవం ఇవ్వడం, సంస్కృతాన్ని మన దైనందిన జీవితంతో అనుసంధానించడం నేటి కాలానికి అవసరం..
ప్రస్తుతం బెంగళూరులో చాలా మంది ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరులో ‘కబ్బన్ పార్క్’ అనే పేరుతో ఒక పార్కు ఉంది. అక్కడి ప్రజలు ఆ పార్కులో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అక్కడ వారానికి ఒకసారి- ప్రతి ఆదివారం- పిల్లలు, యువకులు, పెద్దలు పరస్పరం సంస్కృతంలో మాట్లాడుకుంటారు. అంతే కాదు- అక్కడ అనేక చర్చా సమావేశాలను సంస్కృతంలో మాత్రమే నిర్వహిస్తారు.
వారి ఈ చొరవకు పెట్టుకున్న పేరు – సంస్కృత వారాంతం..! దీన్ని సమష్టి గుబ్బీ గారు వెబ్ సైట్ ద్వారా ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఈ ప్రయత్నం బెంగుళూరు ప్రజలలో చాలా త్వరగా ప్రాచుర్యం పొందింది. మనమందరం అలాంటి ప్రయత్నంలో పాలు పంచుకుంటే ప్రపంచం లోని ఈ పురాతన, శాస్త్రీయ భాష నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు.