• పిఠాపురంలో క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
• ప్రతి గ్రామంలో పర్యటిస్తా.. ప్రతి సమస్య పరిష్కరిస్తానని హామీ
పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటనలకు బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రత్యక్షంగా నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉప్పాడ తీర ప్రాంత సమస్యను తెలుసుకునేందుకు అధికారులతో కలిసి వెళ్తూ మార్గమధ్యంలో గ్రామ గ్రామాన ప్రజలతో మమేకం అయ్యారు. వారు చెప్పిన సమస్యలు విన్నారు. వినతులు స్వీకరించారు.
త్వరలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు తనకు కేటాయించిన శాఖల పని తీరుపై ఉన్నత స్థాయి అధికారులతో వరుస సమీక్షల్లో అధ్యయనం చేసిన పవన్ కళ్యాణ్ , ఇప్పుడు క్షేత్ర స్థాయి పరిశీలన మొదలుపెట్టారు. తనకు కేటాయించిన గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరాశాఖ పరిధిలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, తాగు నీటి శుద్ధి ప్లాంటుల పని తీరుని స్వయంగా పరిశీంచారు.
ఉప్పాడ తీరానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారన్న వార్త తెలియడంతో పిఠాపురం ఉప్పాడ మధ్య ఆయన్ని కలిసేందుకు, తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రజలు రహదారుల వెంట బారులు తీరారు. పవన్ కళ్యాణ్ మార్గమధ్యంలో తన కోసం వేచి ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లి మరీ పలకరించారు. ప్రజలు తమ గ్రామాల్లో సమస్యలు చెప్పుకోగా వాటిని ఆసాంతం విని, వాటి పరిష్కరానికి భరోసా ఇచ్చారు.
త్వరలో పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పిఠాపురం, నవకండ్రవాడ, వాకతిప్ప, యు.కొత్తపల్లి తదితర గ్రామాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
శాసనసభ్యుడిగా గెలిచిన పవన్ కళ్యాణ్ ని అభినందించేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ధన్యవాదాలు తెలిపారు.
వాకతిప్ప ఎస్సీ కాలనీ వాసులు తమ కాలనీ సందర్శించాలని కోరగా కాలనీలోనికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. తమ కాలనీకి తాగునీటి సమస్య ఉందని, నీరు కొనుక్కుని తాగాల్సి వస్తుందని అక్కడ నివసిస్తున్న ప్రజలు పవన్ కళ్యాణ్ ఎదుట వాపోయారు.
నాగులాపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పరిశీలన
ఇక తన పరిధిలోని శాఖల క్షేత్ర స్థాయి పనితీరుపై అధ్యయనంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం, నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 100 శాతం ప్రతి ఇంటికీ తాగునీరు అందించే లక్ష్యం దిశగా కార్యచరణలో భాగంగా ఆ స్టోరేజ్ ట్యాంకును సందర్శించారు.
నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో ఉన్న ఈ ట్యాంకు, తాగునీటి శుద్ధి ప్లాంటు ద్వారా యు.కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు శుద్ధి చేసిన నీరు అందిస్తున్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, తాగు నీటిని శుభ్రపరిచే విధానం, శుద్ది చేసిన నీటిని నిల్వ ఉంచే ట్యాంకు, నీటి స్వచ్ఛత పరీక్షలు జరిపే పరిశోధనా కేంద్రాలను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంఛార్జ్ ఎస్.ఈ. ఎన్.వి.వి. సత్యనారాయణ ట్యాంకు విస్తరణ అవసరాన్ని పవన్ కళ్యాణ్ కి తెలిపారు.
పెరిగిన నీటి అవసరాలకు తగ్గట్టు ట్యాంకు విస్తరణకు రూ. 12 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయని, సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. జల్ జీవన్ మిషన్ నిధుల గురించి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కొండెవరం గ్రామ పరిసరాల్లో ఓ బాలుడు జనసేన జెండా ఊపుతూ అభివాదం చేస్తుంటే – కాన్వాయ్ నిలిపి ఆ బాలుడిని పలకరించారు. కాన్వాయ్ నిలిపి చిన్నారిని పలకరించడం గ్రామస్తులను అబ్బురపరచింది.