Suryaa.co.in

Telangana

రుణమాఫీ పథకం నిబంధనలు సవరించాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

రైతులకు రుణమాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో నెం.567లోని నిబంధనలను అమలుచేస్తే పెద్ద సంఖ్యలో పేదరైతులకు రుణమాఫీ వర్తించదు. అత్యధికమంది రైతులకు రుణమాఫీ అమలు జరిగేలా జీవోను సవరించాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.

రుణమాఫీ ప్రధానంగా రేషన్కార్డు ఆధారంగా అమలుచేయాలని నిర్ణయించారు. ఉమ్మడి కుటుంబం నుండి విడిపడిన 10లక్షల కుటుంబాలు ఇప్పటికే రేషన్కార్డుల కోసం గత 10సం॥లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వీరందరూ రుణమాఫీకి అర్హులు కాలేరు. ఆధార్, పాస్బుక్, రేషన్కార్డుల డేటా సమన్వయం మేరకు రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించారు.

పాస్ బుక్ లేనివారు లక్షలలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ధరణి లోపాల వల్ల పాస్బుక్స్ ఇవ్వలేదు. ఇలాంటి నిబంధనలు పెట్టినట్టయితే చాలామంది పేదరైతులు రుణమాఫీ నుండి మినహాయించబడతారు.

సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, రైతుమిత్ర, కౌలు గుర్తింపు కార్డులు ఉన్నవారికి రుణమాఫీ వర్తించదని నిబంధనలలో పేర్కొన్నారు. దీనివల్ల కౌలు రైతులు, పేదరైతులు నష్టపోతారు. గ్రామీణ ప్రాంతాలలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో ఉన్న మహిళలు తమ రుణాలను వ్యవసాయానికే ఖర్చు చేస్తారు. ఈ గ్రూపులలో దళిత, గిరిజన, బిసి రైతులు ఎక్కువగా ఉంటారు.

ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా రీషెడ్యూల్డ్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదని జీవోలో పేర్కొనడం సరైందికాదు. దీంతోపాటుగా రెన్యువల్ చేసిన రుణాలు లేదా వసూలు చేసిన రుణాలకు రుణమాఫీ వర్తింపజేయాలి. రు.2లక్షలకు పైగా రుణం ఉన్నట్టయితే ఆ అప్పు చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుందని విధించిన నిబంధనవల్ల మధ్యతరగతి రైతులు నష్టపోతారు.

జీఓను యధాతథంగా అమలుచేస్తే లక్షలమంది రైతులు రుణమాఫీ అర్హతను కోల్పోతారు. ప్రభుత్వం పునరాలోచించి జీవో 567ను సవరించి రు.2లక్షల వరకు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని సీపీఐ(ఎం) కోరుతున్నది.

LEAVE A RESPONSE