- తణుకు,విశాఖ,గుంటూరు,తిరుపతిలో భారీగా అక్రమాలు
- అధికారులతో పాటు నేతల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవు
- సీఎంతో చర్చించి విచారణ కమిటీలు వేస్తామన్నమంత్రి నారాయణ
- అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి పొంగూరు నారాయణ సమాధానం
అమరావతి: రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. బాండ్ల జారీ వెనుక అధికారులున్నా, రాజకీయ నాయకులున్నప్పటికీ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు..గత ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీఆర్ బాండ్ల జారీ చేసిన పట్టణాల వివరాలు, జరిగిన అక్రమాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై టీడీపీ సభయులు అరిమిల్లి రాధాకృష్ణ,మద్దులూరి మాలకొండయ్య ప్రశ్నలు అడిగారు..శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పురపాలక శాఖ మంత్రి ఆయా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు…2019 నుంచి 2024 వరకూ రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణాల్లో 3వేల301 టీడీఆర్ బాండ్లు జారీ చేసారని చెప్పారు.
తణుకు,విశాఖపట్నం,గుంటూరు,తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీలో ఆరోపణలు వచ్చాయన్న మంత్రి…అక్కడ.టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన అక్రమాలపై శాఖా పరమైన విచారణ తో పాటు ఏసీబీ విచారణ కూడా జరుగుతుందన్నారు. ఇప్పటికే తణుకులో శాఖాపరమైన విచారణ పూర్తయిందని…ఏసీబీ విచారణ జరుగుతుందన్నారు.
విచారణ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ…తణుకులో చదరపు గజం విలువ 4వేల500 రూపాయిలు ఉంటే స్థలం కోల్పోయిన ప్రాంతానికి బదులు దానికి 1.4 కిమీ దూరంలో ఉండే మరొక ఇంటి నెంబర్ వేసి 22000 ధరతో బాండ్లు జారీ చేసినట్లు మంత్రి చెప్పారు. తణుకులో 29 బాండ్ల జారీ ద్వారా 27.96 ఎకరాలు 63 కోట్ల24 లక్షలు ఇవ్వాల్సి ఉండగా 754 కోట్ల 67 లక్షలకు బాండ్లు జారీ చేసారని చెప్పారు….అంటే ఒక్క తణుకులోనే 691 కోట్ల 43 లక్షల స్కాం జరిగినట్లు శాఖా పరమైన నివేదిక ఇచ్చినట్లు మంత్రి వివరించారు.తణుకులో ఇప్పటికే ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్లు సభలో వెల్లడించారు మంత్రి.
ఇక తిరుపతిలో జరిగిన భారీ స్కాంపై నాలుగు సార్లు విచారణ వేసినా కమిషనర్ సరిగా స్పందించలేదన్నారు…మరోసారి తిరుపతిలో జరిగిన టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణ కమిటీ వేస్తామని చెప్పారు…రాబోయే 15 రోజుల్లో బాండ్ల జారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు..రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేస్తామని…ఎలాంటి విచారణ జరపాలనేది సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఎవరున్నా చర్యలు తీసుకుంటామని….ఎక్కడా రాజీ పడేది లేదని…రాబోయే రోజుల్లో పగడ్బందీగా ముందుకెళ్తామని చెప్పారు.
భవిష్యత్తులో కూడా అక్రమాలు జరగకుండా ల్యాండ్ వాల్యూ ఇష్టానుసారం కాకుండా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం లింక్ చేసేలా ముందుకెళ్తున్నట్లు మంత్రి సభ్యులకు తెలిపారు. మంత్రి నారాయణ సమాధానం తర్వాత సభలో మాట్లాడిన తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ టీడీఆర్ బాండ్ల జారీ వెనుక సూత్తధారిగా ఉన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.