Suryaa.co.in

Andhra Pradesh

సమగ్ర రీసర్వేపై చంద్రబాబు యూ టర్న్‌

-మొన్న రద్దు.. నిన్న కొనసాగిస్తామని ప్రకటన
-చంద్రబాబుది నిత్యం అబద్ధాల పాలన
– మాజీ మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి: నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలో భూముల సమగ్ర రీసర్వేను, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీవ్రంగా తప్పు పట్టిన చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారని మాజీ మంత్రి రాంబాబు గుర్తు చేశారు.

భూములు, గనులు, సహజ వనరుల దోపిడి జరిగిందంటూ, ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు.. రాష్ట్రంలో భూముల రీసర్వేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. కొద్ది రోజుల్లోనే యూటర్న్‌ తీసుకున్నారని ఆయన ఆక్షేపించారు.

స్వప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకోవడం చంద్రబాబు నైజం అని ఆయన అన్నారు.ఎన్నికల ముందు గొప్పగా ప్రకటించిన హామీలు.. ముఖ్యంగా సూపర్‌సిక్స్‌ను అమలు చేయలేక.. శ్వేతపత్రాల పేరుతో కాలయాపన చేస్తూ.. గత తమ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని ఆయన ఆక్షేపించారు.

నాలుగు వేల పెన్షన్‌ ఇస్తామని చెప్పి, ఒక నెల మాత్రమే ఇచ్చారని.. ఇప్పుడు అనర్హులు చాలా మంది ఉన్నారని, కొందరిని తీసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు. ఏటా మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, తల్లికి వందనం సహాయం, మహిళలకు ఫ్రీ బస్, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500, ప్రతి ఇంట్లో నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి.. ఇవేవీ ఈ ఏడాది అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని వెల్లడించారు.

తాము సూపర్‌సిక్స్‌ ప్రకటించామని, ఇప్పుడు వాటిని అమలు చేయాలంటే భయమేస్తోందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పడం.. పథకాల అమలులో ఆయనకు చిత్తశుద్ధి లేదని చూపుతోందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో భూముల సమగ్ర రీసర్వేపై చంద్రబాబు దారుణంగా దుష్ప్రచారం చేశారన్న అంబటి రాంబాబు.. గత ఎన్నికల సమయంలో ఆ కార్యక్రమంపై చంద్రబాబు చేసిన ప్రసంగాల వీడియోలు ప్రదర్శించారు. ఆ తర్వాత, శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. రీసర్వే నిలిపేస్తామంటూ, ఈనెల 15న చంద్రబాబు చేసిన ప్రకటన వీడియో కూడా మాజీ మంత్రి ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించారు.

‘జగన్‌ చేపట్టిన భూముల సమగ్ర రీసర్వే లోపభూయిస్టమైందని, రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పిన నువ్వు ఎందుకు యూటర్న్‌ తీసుకున్నారు?. అలాంటప్పుడు వాస్తవాలు ఎందుకు గుర్తించలేదు?. అంటే మీకు కనీస అవగాహన లేదన్న విషమం అర్థమవుతోంది’..

ఇదీ సీనియర్‌ ఐఏఎస్‌ మాట:
దేశంలో నాడు బ్రిటిషర్ల పాలనలో 100 ఏళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని, ఆ తర్వాత 100 ఏళ్లు.. అవే రికార్డులు కొనసాగాయని.. ఆ పరిస్థితుల్లో జగన్‌గారు, భూముల సమగ్ర రీసర్వేకు శ్రీకారం చుడుతూ, ఒక మహాయజ్ఞం తలపెట్టారని మాజీ మంత్రి వెల్లడించారు.

భూముల రీసర్వేను తప్పు బట్టి, మళ్లీ యూటర్న్‌ తీసుకుని, ఇప్పుడు కొనసాగిస్తామంటున్న చంద్రబాబు వైఖరిపై తనతో ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి మాట్లాడారన్న అంబటి రాంబాబు.. ఆయన ఏమన్నాడన్నది చెప్పారు.

‘ఇతర దేశాల్లో భూవివాదాలు 3 శాతం మాత్రమే ఉంటాయి. అదే మన దేశంలో 60–70 శాతం ఉంటాయి. అవన్నీ క్లియర్‌ చేయడం కోసం రీసర్వే చేసి విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని సదుద్దేశంతో జగన్‌ గారు నాడు ప్రారంభిస్తే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇష్టారీతిగా మాట్లాడారు. పైగా ఎవరైనా కోరుకుంటే మాత్రమే చేస్తామన్నారు. ఇప్పుడు మళ్లీ మాట మార్చారు’.. అని ఆ ఐఏఎస్‌ అధికారి చెప్పారని అంబటి వివరించారు.

‘భూముల రీసర్వే కోసం ప్రభుత్వం 14,630 మంది సర్వేయర్లను నియమించింది. 17 వేల గ్రామాల్లో 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు, 13,371 గ్రామ కంఠాల్లోని 85 లక్షల ప్రభుత్వ, ప్రేవేట్‌ ఆస్తులు, 110 పట్టణ ప్రాంతాల్లోని 40 లక్షల ప్రభుత్వ, ప్రేవేట్‌ ఆస్తులు, 10 లక్షల ప్లాట్లలో సమగ్ర రీసర్వే ఈ కార్యక్రమ లక్ష్యం. మొత్తం మూడు దశల సర్వే కార్యక్రమంలో ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. ఇప్పుడు మాత్రం మళ్ళీ రీసర్వే మేం చేస్తామంటున్నారు’.. అని అంబటి రాంబాబు తెలిపారు.

రీసర్వే కోసం అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల ఎర్రర్‌ కేవలం 5 సెం.మీ మాత్రమే ఉంటుందన్న ఆయన, ఇందుకు 75 బేస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి రోవర్లతో కొలిచే ప్రక్రియను తీసుకువచ్చామని గుర్తు చేశారు. అదే చైన్‌ పద్దతిలో.. అంటే గొలుసుల పద్దతిలో కొలిస్తే ఒక మీటర్‌ తేడా ఉండేదని, కానీ ఇప్పుడు కేవలం 5 సెం.మీ.కే అది పరిమితం అయిందని చెప్పారు. రీసర్వేలో భాగంగా హెలికాఫ్టర్‌లు, డ్రోన్‌లు కూడా వినియోగించామని వివరించారు.

ఈ సమగ్ర భూసర్వే రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో 6 వేల గ్రామాల్లో పూర్తయిందని, అందులో 4 వేల గ్రామాల్లో పాసు పుస్తకాలు ఇవ్వడం పూర్తి కాగా, మరో 2 వేల గ్రామాల్లో ఆ పని చేయాల్సి ఉందని, ఇంకా మిగిలిన గ్రామాల్లో డ్రోన్‌ సర్వే కూడా పూర్తయిందని.. ఆ విధంగా అన్నీ సక్రమంగా పూర్తి చేసిన తమ ప్రభుత్వం.. వివాద రహితంగా డిజిటల్‌ రికార్డులను అందుబాటులోకి తీసుకొచ్చిందని అంబటి వెల్లడించారు.

భూ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు 50 ఏళ్ళపాటు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి ప్రతిపాదించారని గుర్తు చేసిన అంబటి.. భూముల రీసర్వేతో పాటు, ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా అమలు చేయాల్సి ఉంది కాబట్టి.. ఇక్కడా యూటర్న్‌కు అవకాశం లేకపోలేదని తేల్చి చెప్పారు. చివరకు ఈ భూసర్వే విషయంలో జగన్‌ చెప్పిందే కరెక్ట్‌ అనేది అర్ధమవుతుందని అంబటి అన్నారు.

మా పార్టీలో నెంబర్‌ టూ స్థానం కోసం అంతర్గత పోరు సాగుతోందని ఎల్లో మీడియా ఈనాడులో ఓ కట్టుకధ అల్లారన్న అంబటి రాంబాబు.. ‘మా పార్టీలో నెంబర్‌ టూ ఉండరు. మా ఏకైక నాయకుడు జగన్‌ . ఆయన ఎవరికి ఏ పని అప్పజెబితే వారు ఆ పని చేస్తారని’.. స్పష్టం చేశారు.

తమ పార్టీపై ఎన్ని కుట్రలు చేసినా, అన్నింటినీ చేధించుకుని ముందుకు వచ్చిన శక్తి సామర్థ్యాలు జగన్‌కి ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పుడు కూడా పార్టీలో అనేక మందిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్న అంబటి.. ప్రభుత్వం ఎంత కక్ష సాధింపు చర్యలకు దిగినా.. తమ పార్టీలో ఎవరూ భయపడబోరని తేల్చి చెప్పారు.

LEAVE A RESPONSE