Suryaa.co.in

Telangana

అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలి

ప్రతి మూడు నెలలకు ప్రజావాణిపై ప్రణాళిక శాఖ సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది
ప్రభుత్వ పాలసీల్లో మార్పులు చేయాల్సి ఉంటే రాతపూర్వకంగా నివేదిక ఇవ్వండి
ప్రజావాణి సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ప్రజావాణి ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజావాణి పనితీరుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ విధానాల్లో ఏవైనా మార్పులు చేయాలని ప్రజావాణి అధికారులు భావిస్తే వాటిని రాతపూర్వకంగా ప్రభుత్వానికి నివేదించాలని తెలిపారు. ఇందులో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులు, అవి పరిష్కరిస్తున్న తీరును డిప్యూటీ సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, వివిధ ప్రభుత్వ శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం సందర్భంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్పందిస్తున్న తీరును అధికారులను విచారించారు. ఫిర్యాదు గారు తన సమస్య పరిష్కారం ఎంతవరకు వచ్చిందో తెలుసుకునేందుకు ఏ రకమైన వ్యవస్థ ప్రజావాణి లో ఉన్న అంశంపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఫిర్యాదు మొదట దరఖాస్తు చేసుకున్న సందర్భంలో ఎస్ఎంఎస్ పంపిస్తామని, సమస్య పరిష్కారం అయిన తర్వాత చివరగా మరొక ఎస్ఎంఎస్ మొబైల్ కు పంపిస్తామని ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ సమావేశంలో వివరించారు.

ఫిర్యాదు పరిష్కారం ఏ దశకు చేరిందనే అంశం తెలుసుకునే వ్యవస్థ ప్రస్తుతం లేదని ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ధరణి కి సంబంధించిన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు నోడల్ అధికారి దివ్య దేవరాజన్ సమావేశంలో వివరించగా, రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.. త్వరలో నిర్ణయం తీసుకొని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.

రేషన్ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలు పొందేందుకు వేరువేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని త్వరలోనే నిర్ణయం జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. కొత్త పెన్షన్లను సైతం త్వరలో మంజూరు చేసే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తే ప్రయోజనం లేదు వారికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అందుకు అవసరమైతే ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.

అన్ని ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ డెస్క్ లను బలోపేతం చేసేలా చర్యలు చేపడితే సీఎంఆర్ఎఫ్ కు సంబంధించి ఫిర్యాదులు తగ్గిపోతాయని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. జీరో విద్యుత్ బిల్లు దరఖాస్తులు తీసుకునే మండల స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు. బీహార్ తో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పద్ధతులు ఆవ లంబిస్తున్నాయో అధికారులను అడిగి డిప్యూటీ సీఎం తెలుసుకున్నారు.

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు విజయవంతంగా పూర్తిచేసిన కొన్ని కేసుల గురించి సమావేశంలో నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వివరించారు. తన వ్యవసాయ భూమిలో విద్యుత్ వైర్లు వేలాడుతున్న విషయాన్ని మహబూబ్నగర్ కు చెందిన రైతు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా స్థానిక విద్యుత్ అధికారులు రెండు రోజుల్లోనే పరిష్కరించడం.. ఆనందంగా స్పందిస్తూ అధికారులను అభినందిస్తూ ఆ రైతు అధికారులకు లేఖ రాసిన విషయాన్ని సమావేశంలో వివరించారు.
ప్రజావాణి విభాగంలో పనిచేసేందుకు పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని నోడల్ అధికారి దివ్య కోరగా డిప్యూటీ సీఎం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు

 

LEAVE A RESPONSE