Suryaa.co.in

Telangana

తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన సుష్మా స్వరాజ్‌

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.

దివంగత సుష్మా స్వరాజ్ వర్థంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించి, అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సుష్మాస్వరాజ్ పార్లమెంట్ లో ప్రత్యేక తెలంగాణ కోసం అనేక పోరాటాలతో కీలక పాత్ర పోషించారు.

ఆ రోజుల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేశాను. నాడు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యమకారులకు మద్దతుగా రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన అనేక సభల్లో సుష్మాస్వరాజ్ మాట్లాడి, చైతన్యం నింపారు. సకలజనుల సమ్మె జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులపై, ప్రజలపై పోలీసు నిర్భంధం పెట్టి అనేక రకాల వేధింపులకు గురిచేసింది. సంపన్న వర్గాల ప్రజలు, విద్యార్థులు రాష్ట్ర సాధన కోసం నినదించిన గొంతులు, రబ్బరు బుల్లెట్లు, లాఠీ దెబ్బలను లెక్కచేయకుండా పోరాడారు.

సుష్మాస్వరాజ్ నాడు ఉద్యమకారులకు అండగా నిలబడ్డారు. ధైర్యం కల్పించారు. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలిగా సుష్మాస్వరాజ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టే సమయంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ ప్రజలకు బాసటగా నిలిచారు. లోక్ సభలో ఉద్యమకారులకు, ఓయూ విద్యార్థులకు మద్దతుగా గొంతెత్తి, తెలంగాణ వాణి వినిపించిన గొప్ప నాయకురాలు.

లోక్‌సభలో ఓటింగ్ కోసం తెలంగాణ బిల్లు పెట్టాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రతిపక్ష పార్టీ నాయకురాలిగా విభజన చట్టం గురించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పాస్ కాకుండా కారంనీళ్లు చల్లినా, కత్తులతో లోక్ సభలోకి వచ్చినప్పుడు.. వారందరినీ ఎదిరించి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, 160 మంది పార్లమెంటు సభ్యులతో తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయించిన ఘనత ఆమెకే దక్కుతుంది.

తెలంగాణ అమరవీరులు, స్వర్గీయ సుష్మాస్వరాజ్ ఆశయసాధనలో బిజెపి కార్యకర్తలందరు పునరంకితమై, వారి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. సుష్మాస్వరాజ్ స్ఫూర్తి, అమరవీరుల స్ఫూర్తితో ప్రజాస్వామ్య తెలంగాణను సాధించుకునేలా కృతనిశ్చయంతో పనిచేస్తాం.

LEAVE A RESPONSE