Suryaa.co.in

Editorial

ఉత్తరాన ‘ఫ్యాను’ ఉక్కిరిబిక్కిరి!

– ప్రతిష్ఠగా మారిన ఎమ్మెల్సీ ఎన్నిక
– బొత్స గెలిస్తేనే పార్టీ పరువు నిలిచేది
– టీడీపీ అభ్యర్ధిగా పీలా గోవిందు
– ఇప్పటికే టీడీపీ, జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు
– దాదాపు 60 మంది జంపవుతున్న దయనీయం
– అమరావతిలో టీడీపీ శిబిరానికి వైసీపీ ప్రజాప్రతినిధులు
– వైసీపీ ప్రతినిధులకు టీడీపీ భరోసా
– సీటు దక్కని అమర్నాధ్ అసంతృప్తి
-బొత్స ఇమేజ్‌పైనే వైసీపీ విజయం
( మార్తి సుబ్రహ్మణ్యం)

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. ఏపీలో జరుగుతున్న తొలి శాసనమండలి ఎన్నిక వైసీపీ అధినేత-మాజీ సీఎం జగన్‌రెడ్డి ఇమేజ్‌కి సవాలుగా మారింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి జరగనున్న ఎన్నికలో వైసీపీ అభ్యర్ధిగా మాజీ మంంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణను ఆ పార్టీ రంగంలోకి దింపటంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది.

బొత్స మంత్రిగా ఉండగా, ఆయన పలుకుబడిని నిర్వీర్యం చేసి, మేనల్లుడు శ్రీనును ప్రోత్సహించిన జగన్‌కు ఇప్పుడు మళ్లీ సత్తిబాబే దిక్కయ్యారు. జగన్ సీఎంగా ఉండగా బొత్సను పక్కనపెట్టి ఆయన మేనల్లుడు శ్రీనును జగన్ ప్రోత్సహించారు. మంత్రి అమర్‌నాధ్, మేనల్లుడు శ్రీనుకు రెండురోజులకోసారి అపాయింట్‌మెంట్ ఇచ్చేవారంటే, బొత్సను ఏ స్థాయిలో అణచివేశారో అర్ధమవుతుంది.

చివరకు ఉత్తరాంధ్రలో పలుకుబడి -ప్రభావం ఉన్న బొత్సను రంగంలోకి దించితే తప్ప, గెలవలేమన్న అభిప్రాయానికి వచ్చిన జగన్.. చివరకు సత్తిబాబునే ఎమ్మెల్సీ ఎన్నిక బరిలోకి దింపటం అనివార్యమయింది. అయితే ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వం ఆశించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ తన పార్టీ అధినేత జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

విశాఖపట్నం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నగారా మోగింది. దీనికి సంబంధించి ఆగస్టు 6న నోటిఫిే షన్ వెలువడవనుండగా, ఆగ స్టు 30న ఎన్నిక జరగనుంది. మొత్తం ఓట్లు 841 ఉండగా, అందులో వైసీపీ 615, టీడీపీ-జనసేనకు 215 ఓట్లున్నాయి. ఆ ప్రకారంగా సాంకేతికంగా చూస్తే వైసీపీ విజయం న ల్లేరు నడకే.

కానీ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీని బలహీనపరిచేందుకు, కూటమి రంగంలోకి దిగింది. ఆ మేరకు వైసీపీ కార్పొరేటర్లు, భారీ స్థాయిలో టీడీపీ-జనసేనలో చేరుతున్నారు. తాజాగా ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన చీఫ్, మంత్రి పవన్ సమక్షంలో జనసేన తీర్థం తీసుకున్నారు. అదే సమయంలో 60 మంది ఎంపీటీసీ, జడ్పీటీసీలు టీడీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.టీడీపీ అభ్యర్ధిగా ఖరారు కానున్న పీలా గోవింద్ గెలవాలంటే మరో 250 మంది సభ్యుల ఓట్లు అవసరం.

టీడీపీలో చేరనున్న 60 మంది స్థానిక సంస్థల ప్రతినిధులను, అమరావతి క్యాంపునకు తరలించేందుకు రంగం సిద్ధమవుయింది. టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసయాదవ్‌పర్యవేక్షణలో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది.

ఇదిలాఉండగా, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీనియర్ నేతలు దాడి వీరభద్రరావు, గంటాశ్రీనివాసరావు తదితరులు ఇప్పటికే వైసీపీ ప్రజాప్రతినిధులతో మంతనాలు సాగిస్తున్నారు. టీడీపీలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇస్తున్నారు. ఎలాగైనా బొత్సను ఓడించడం ద్వారా, జగన్‌కు ఝలక్ ఇవ్వాలన్న గట్టి పట్టుదలతో టీడీపీ సీనియర్లు పనిచేస్తున్నారు.

మరోవైపు బొత్స సైతం తన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన ఇమేజ్‌ను ఉపయోగించుకుని, వైసీపీ ప్రజాప్రతినిధులు జారిపోకుండా వ్యూహాలు రచిస్తున్నారు. ఆ మేరకు ఆయన తన కుటుంబసభ్యులు, మద్దతుదారులను రంగంలోకి దించారు. ఆయన తన కులం కార్డు కూడా వాడేందుకు సిద్ధమవుతున్నారు.

తన పార్టీ సభ్యులను టీడీపీ ఎగరేసుకుపోకుండా ఉండేందుకు, తాను కూడా తన పార్టీ సభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలించి, క్యాంపు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ వైపే ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థిగా బొత్స కాకుండా మరొకరు ఉంటే, ఫలితం టీడీపీకి ఏకపక్షంగా ఉండేదని.. ఇప్పుడు ఆయన రంగంలోకి దిగడంతో ఎన్నిక ఉత్కంఠంగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇదిలాఉండగా.. అధికారం కోల్పోవడంతో కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు కూటమి వైపు చూస్తున్న పరిస్థితి. తాము టీడీపీలో చేరితే, మరో మూడేళ్లు తమకు రాజకీయంగా ఎలాంటి ఢోకా ఉండదన్న ముందుచూపు, వారిని టీడీపీ వైపు అడుగులు వేయిస్తున్నాయి.

కాగా.. ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వం ఆశించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్.. తన పార్టీ అధినేత జగన్ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో చేరగా మిగిలిన ఆయన వర్గానికి చెందిన వైసీపీ కార్పొరేటర్లు, ఎంపీటీసీ-జడ్పీటీసీ సభ్యులు వైసీపీ అభ్యర్ధి బొత్సకు ఏమేరకు సహకరిస్తారోనన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది.

LEAVE A RESPONSE