-
ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు దువ్వాడ!
-
చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ
-
సొంత భార్యను పట్టించుకోని దువ్వాడ
-
మరో మహిళతో సహజీవనం
-
న్యాయం కోసం రోడ్డెక్కిన కూతుళ్లు
-
దువ్వాడ ఇంటి ముందు మెరుపు ధర్నా
-
ఇప్పటికే విజయసాయిరెడ్డి వివాదంతో అ‘శాంతి’
-
ఇప్పుడు కొత్తగా తెరపైకి దువ్వాడ అనైతిక అంశం
-
వైసీపీకి ఇదో కొత్త మహిళా సంకటం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇదో దువ్వాడ హీరో-నిర్మాత కమ్ దర్శకుడిగా తీసిన వైసీపీ ప్రొడక్షన్స్ ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా. ఆయన గత ఐదేళ్ల జగనన్న పాలనలో చక్రం తప్పిన వైసీపీ నేత. నాటి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పోటీగా జగనన్న ఆ నేతను రంగంలోకి దింపారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అచ్చెన్నపైకొదిలారు. అంతే.. ఆ నేత చెలరేగిపోయారు. అంత హవా సాగించిన సదరు వైసీపీ ఎమ్మెల్సీ, ఇప్పుడు ఆడవారి పంచాయితీలో చిక్కుకున్నారు.
కట్టుకున్న భార్య వాణిని వదిలేసి, మరొక మహిళలతో కలసి చేస్తున్న సహజీవనాన్ని చివరాఖరకు సొంత కూతుళ్లే బట్టబయలు చేశారు. అంతేనా?.. ‘‘ మా సంగతేమిటి? మీ పార్టీ అధినేత జగన్ మహిళలకు ఇచ్చే సందేశం ఇదేనా? భార్యాబిడ్డలను వదిలి, మరొక ఆడదానితో సహజీవనం చేయమని మీ జగనన్న చెప్పారా? ఇదేనా మీ పార్టీ సిద్ధాంతం? ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం? మాకు న్యాయం కావాలి’ అంటూ తండ్రి ఇంటిముందు ధర్నాకు దిగారు. ఇది మొన్నటి వరకూ ఒక్క శ్రీకాకుళం జిల్లాకే పరిమితమైన సిటీకేబుల్ సినిమా. ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూస్తున్న శాటిలైట్ చానెల్ సినిమా!
శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన పార్టీ పరువుతీశారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి అ‘శాంతి’ని భరిస్తున్న వైసీపీకి ఇది మరో అనైతిక వ్యవహారం. భార్య, పిల్లలు ఉండగనే మరొక మహిళతో కలసి ఉంటున్న వైనాన్ని సొంత కూతుళ్లే బయటపెట్టడంతో, ఎమ్మెల్సీ అడ్డంగా ఇరుక్కుపోయారు.
దువ్వాడ కూతుళ్లు.. హటాత్తుగా వేరొక మహిళతో కలసి ఉంటున్న తన తండ్రి ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు. తమకు న్యాయం చేసేవరకూ అక్కడినుంచీ కదిలేది లేదని భీష్మించుకున్న వైనం
గుప్పుమనడంతో, మీడియా అక్కడికి చేరింది. విషయేమిటని ఆరా తీస్తే.. తండ్రి తమ కుటుంబాన్ని వదిలేసి, వేరొక మహిళతో ఉంటూ తమకు అన్యాయం చేస్తున్నారని, కనీసం ఫోన్లు చేసినా తీయడం లేదని, ఇంట్లోకి రానీయడం లేదని కూతుళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.
‘మహిళలకు జగనన్న ఏం సందేశం ఇస్తున్నారు? పెళ్లైన మహిళల కుటుంబాన్ని వదిలేసి వేరొకరితో ఉండాలని జగన్ చెబుతున్నారా? మీ పార్టీ సిద్ధాంతం ఇదేనా? మహిళలకు మీరిచ్చే గౌరవం, వివాహ వ్యవస్థపై మీకున్న నమ్మకం ఇదేనా? మా తండ్రి లాంటి వారు మీ పార్టీలో ఇంకా ఎంతమంది ఉన్నారు? జగనన్నా. మాకు న్యాయం చేయండి. మా తండ్రిని మా వద్దకు చేర్చండి’’ అని కన్నీరుమున్నీరయ్యారు.
అటు దువ్వాడ భార్య, వైసీపీ జడ్పీటీసీ వాణి కూడా తన భర్త దువ్వాడ అనైతిక వ్యవహారాన్ని దుయ్యబట్టారు.‘‘ ఒక క్యారక్టర్ లేని వైసీపీ మహిళా నేతతో తన భర్త కలసి ఉంటున్న వైనం నా బిడ్డల జీవితంపై ప్రభావం చూపకూడద్నదే నా బాధ. ఆయన చేసిన పనితో మా బిడ్డల జీవితం అంధకారమయింది. పలాసలో దువ్వాడ బ్రదర్స్ మా పిల్లలపై ఇబ్బందికరంగా వ్యవహరించారు. మేం దువ్వాడను బయటకు పంపించలేదు. గతంలో మా ఇద్దరికీ అభిప్రాయబేధాలున్నప్పటికీ ఎన్నికల్లో ఆయన గెలవాలనే నేను పోటీకి దూరంగా ఉన్నా’’ నని వాణి మీడియాకు చెప్పారు.
కాగా దివ్యల మాధురి అనే మహిళా నేతకు, గతంలో వైసీపీ మహిళా అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాతనే వారిద్దరి అక్రమ సంబంధం బయటపడిందని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆ విషయం తెలిసిన వాణి, కుటుంబంలో రచ్చ చేసిన తర్వాత మాధురి తన పదవికి రాజీనామా చేశారని చెబుతున్నారు.
ఇప్పటికే పార్టీ ఎంపి విజయసాయిరెడ్డి సృష్టించిన అ‘శాంతి’ తలనొప్పులే కొనసాగుతున్న నేపథ్యంలో.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరొక మహిళతో సహజీవనం సాగిస్తున్న వైనాన్ని, సొంత కూతుళ్లే బట్టబయలు చేయడం వైసీపీకి మహిళా సెంటి‘మంట’గా మారింది. నా అక్కచెల్లెమ్మలని దీర్ఘాలు తీస్తూ మాట్లాడి, నెత్తిన చెయ్యి పెట్టే వైసీపీ అధినేత జగనన్న, తన పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబానికి ఏం న్యాయం చేస్తారో చూడాలి.