: నారా చంద్రబాబు నాయుడు
జనం కోసమే జర్నలిజం….ప్రజల కోసమే పత్రికా రంగం అని చాటిన 50 ఏళ్ల అక్షర శిఖరం ఈనాడు పత్రిక. 1974లో విశాఖలో ప్రస్థానాన్ని ప్రారంభించి తెలుగు ప్రజల జీవన విధానంలో భాగమైన అద్భుత ఆవిష్కరణ ఈనాడు.
సమాజాన్ని జాగృత పరచడానికి, ప్రజల గళం వినిపించడానికి ఆవిర్భవించి….దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్న ఈనాడు పత్రికకు స్వర్ణోత్సవ వేళ మనసారా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అక్షర యోధుడు రామోజీరావు తెలుగు జర్నలిజంపై వేసిన తిరుగులేని ముద్ర ఈనాడు తన 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి, పాత్రికేయులకు, పాఠకులకు, జర్నలిస్టులకు శుభాకాంక్షలు.
విలువలు, విశ్వసనీయత, ప్రజల తరపున పోరాటం, తలవంచని నైజం, నిత్య నూతనంతో అనునిత్యం ప్రజాహితంగా సాగుతున్న ఈనాడు దినపత్రిక తెలుగు జాతికి లభించిన ఆభరణం. పత్రిక అంటే వ్యాపారం కాదని, మీడియా అంటే సమాజహితం అని నమ్మి, ఆ సిద్ధాంతాన్ని 5 దశాబ్దాల పాటు ఆచరించింది కాబట్టే…నేడు ఈనాడు పత్రిక ఎవరూ అందుకోలేని స్థాయిని చేరుకుంది. కొన్ని లక్షల మందికి రోజువారీ దినచర్య ఈనాడు పఠనంతోనే ప్రారంభం అవుతుంది. వార్తల గురించి ఏ అంశంపై చర్చ వచ్చినా ఈనాడులో వచ్చిందా అని అడిగే పరిస్థితి మనం ఎప్పుడూ చూస్తాం. అదీ ఈనాడుకు ఉన్న విలువ, గౌరవం.
ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఈనాడు ఎప్పుడూ నిష్కర్షగా పనిచేసింది. ప్రభుత్వం ఎవరిది అన్నది చూడదు…ప్రజల కష్టనష్టాలే చూస్తుంది. పలుసందర్భాల్లో మా ప్రభుత్వంలో తప్పులను ఈనాడు రాస్తే…వాటిని మేం సరిదిద్దుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
1984 నాటి ప్రజాస్వామ్య ఉద్యమంలో ఈనాడు పోషించిన పాత్ర నాకెప్పటికీ గుర్తుంటుంది. విశ్వసనీయత ఉన్న ఒక పత్రిక న్యాయం వైపు నిలబడి వాస్తవాలను ప్రజలకు వివరిస్తే ఎంతటి ప్రజా చైతన్యం వస్తుంది అనే దానికి నాటి ప్రజాస్వామ్య ఉద్యమం ఒక మచ్చుతునక.
ఈనాడు అనేది పూర్తిగా ప్రజల పత్రిక. ప్రజల కోసం పనిచేసే ప్రజాస్వామ్య కరదీపిక. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం, ప్రజా చైతన్యం తేవడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో సామాన్యుడి అక్షర ఆయుధంగా పనిచేసిన ఈనాడు దినపత్రిక అర్ధ శతాబ్దపు ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న వేళ…అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
తెలుగు జాతికి ఆస్తి లాంటి ఈనాడును అందించిన దివంగత శ్రీ రామోజీ రావు గారికి నివాళులు అర్పిద్దాం. ఈనాడు వార్తా పత్రికను సమున్నతంగా తీర్చిదిద్దిన ఆయనను ఈ సందర్భంగా స్మరించుకుందాం. 10.08.1974 వ తేదీన పుట్టిన ఈనాడు పత్రిక తెలుగు నేల కీర్తి….దాని సృష్టికర్త శ్రీ రామోజీరావు ఎప్పటికీ స్ఫూర్తి.