Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ ప్రోద్బలంతోనే అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి

– మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ ధ్వజం

తాడేపల్లి: విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి అత్యంత హేయమని, ప్రభుత్వ ప్రోద్భలంతోనే ఈ ఘటన జరిగిందని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ధ్వజమెత్తారు. అంబేడ్కర్‌ అంటే సీఎం చంద్రబాబుకు గౌరవం లేదని, అందుకే ఆయన ఇప్పటి వరకు విజయవాడలో ఆ స్మృతివనాన్ని సందర్శించలేదని గుర్తు చేశారు.

విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి చేసిన దుండగులను తక్షణమే శిక్షించాలని డిమాండ్‌ చేసిన ఆయన, ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం దారుణమని అన్నారు. చివరకు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికే రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని, ఇది రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన లా అండ్‌ ఆర్డర్‌ను చూపుతోందని కైలే అనిల్‌కుమార్‌ స్పష్టం చేశారు.

నిజానికి విజయవాడ, స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయడం చంద్రబాబుకు ఏనాడూ ఇష్టం లేదని, ఆ స్థలాన్ని ఎవరికో కట్టబెట్టి లబ్ధి పొందాలన్నదే ఆయన ఆలోచన అని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. అందుకే రాష్ట్ర విభజన తరవాత 5 ఏళ్లు అధికారంలో ఉన్నా, అంబేడ్కర్‌ విగ్రహం ప్రతిష్టించలేదని గుర్తు చేశారు.

అంబేడ్కర్‌ స్మృతివనంలో దాడిపై ప్రభుత్వం గంటకో మాట చెబుతోందన్న కైలే అనిల్‌కుమార్, అది ఎవరు చేశారో తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. విజయవాడ నడిబొడ్డున అటు రాజ్‌భవన్, ఇటు పోలీస్‌ కమిషనరేట్‌ ఆఫీస్‌కు అత్యంత చేరువలో ఉన్న అంబేడ్కర్‌ స్మృతివనంపై దాడి.. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. దేశం సమున్నతంగా గౌరవించే వ్యక్తుల జోలికి వస్తే.. ఆ పార్టీలకు పుట్టగతులు ఉండవని కైలే అనిల్‌కుమార్‌ తేల్చి చెప్పారు.

పామర్రు ఎమ్మెల్యే వసూల్‌రాజా:
పామర్రు ప్రస్తుత ఎమ్మెల్యే కుమార్‌ రాజా కాదు.. వసూల్‌ రాజా
అని కైలే అనిల్‌కుమార్‌ ఆరోపించారు. ఆయనను ఇప్పటికే అందరూ కలెక్షన్‌ రాజా అని పిలుస్తున్నారని చెప్పారు. పామర్రులో తన ఇంటిపై నిరాధార ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారన్న కైలే అనిల్‌కుమార్, అక్కడ తాను ఇల్లు కట్టుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. మరోవైపు ఎమ్మెల్యే కుమార్‌ రాజా పేకాట, అవినీతి, మట్టి, ఇసుక దందాను పామర్రు ప్రజలు ఇప్పటికే గుర్తించారని చెప్పారు

LEAVE A RESPONSE