Suryaa.co.in

Telangana

అప్పుడు కలెక్షన్ సెంటర్లు .. ఇప్పుడు కాల్ సెంటర్లు

– కాలమైతే మీ ఖాతాలో .. కరువు వస్తె పక్కోడి ఖాతాలో వేసే నైజం మీది
– మీరు బస్సు లు ఆర్డర్ చేస్తే .. మేము రిబ్బన్ కట్ చేశామా?
మీ హయంలో ఒక్క బస్సు అయినా కొనుగోలు చేశారా?
-రుణమాఫీ పై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదురుదాడి

హైదరాబాద్ : హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అరకొరగా చేసిన పంట రుణమాఫీ కూడా 3 లక్షల మంది అర్హులైన రైతులకు అమలు కాలేదు. సాంకేతిక సమస్యలు చూయించి ఆ రైతులకు రుణాలను మాఫీ చేయలేదు. ఆ విషయం హరీష్ రావుకు కూడా తెలుసు. త్వరలో ఆ రైతులకు రుణమాఫీ చేస్తామని స్వయంగా పత్రికా ప్రకటన హరీష్ రావు విడుదల చేశారు. కానీ చేయలేదు.

రుణమాఫీ కాక, బ్యాంకులు వేల మంది రైతులను బ్లాక్ లిస్టులో పెట్టి కొత్త రుణాలు పుట్టకుండా చేశాయి. అప్పుడు హరీష్ రావు ఎక్కడున్నారు? ఏ కలుగులో దాచుకున్నారు? అవమానాలు భరించలేక మహబూబాబాద్ లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కనీసం హరీష్ రావు పరామర్శించాడా..?

అప్పుడే హరీష్ రావు కాల్ సెంటర్ పెట్టుకొని ఈ పని చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు మా ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది. ఇప్పటికే లక్ష రూపాయలు, లక్షా 50 వేల రూపాయల వరకు రుణమాఫీ పూర్తి చేశాం. సాంకేతిక లేక ఇతర సమస్యలతో రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్నదాతలకు హామీ ఇచ్చింది.

ఒక్క నెల రోజుల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రేషన్ కార్డు లేని వాళ్ళకి, సాంకేతిక సమస్య ఉన్నవాళ్లకి రుణమాఫీ చేస్తామని చెప్పాము. అందుకే రైతులు నిశ్చింతగా ఉన్నారు. వాళ్ళకి లేని తొందర హరీష్ రావుకి ఎందుకు..? సకాలంలో రైతులకు రుణమాఫీ చేసి తీరుతాం.

మీ హయాంలో పంటల బీమా లేదు దీనివల్ల రైతులకు పంట నష్టపరిహారం అందలేదు. దీంతో చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. హైదరాబాద్ వంటి నగరాలకు వచ్చి అడ్డా మీద కూలీలుగా మారారు. అప్పుడే కాల్ సెంటర్ పెట్టి ఉంటే రైతులకు ఎంతో కొంత లబ్ధి జరిగేది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు కాల్ సెంటర్ పెడితే ఏం లాభం.

మేము ఆరు చందమామలు పెట్టాం మూడు సూర్యులను పెట్టాం. కాంగ్రెస్ ఆగం చేస్తున్నట్లు మీరు మాట్లాడుతున్నారు. మీరు బస్ లు ఆర్డర్ లు చేస్తే.. మేము రిబ్బన్ కట్ చేశామా?మీ హయంలో ఒక్క బస్సు అయినా కొనుగోలు చేశారా?ఒకవేళ అదే నిజమైతే మీకే క్రెడిట్ ఇస్తాం. కానీ మీరు తెచ్చిన ఆరు లక్షల కోట్ల అప్పులకు ఎవరు వడ్డీలు చెల్లిస్తున్నారు? అది కూడా మీరే చెల్లించండి ఆ క్రెడిట్ కూడా మీరే తీసుకోండి.

కాలమైతే మీ ఖాతాలో.. కరువు వస్తే పక్కోడి ఖాతాలో వేసే నైజం మీది. అప్పులకైతే బాధ్యత వహించారట. అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం మాయే అని డబ్బా కొట్టుకుంటున్నారు. ఇదేమి రాజకీయం..?ఇరిగేషన్ మంత్రిగా, ఆర్దిక మంత్రిగా, మార్కెటింగ్ శాఖ మంత్రిగా, మైనింగ్ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావు ఇప్పుడు కాల్ సెంటర్ లో అంటూ కహానీలు చెప్తున్నాడు. అప్పుడు కలెక్షన్స్ సెంటర్లు ఇప్పుడు కాల్ సెంటర్లు.రేపు రోడ్డు సెంటర్ లో నిలబడాలి. ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా మీ అహంకారం మాత్రం తగ్గలేదు.

LEAVE A RESPONSE