-
బాబు కష్టం ఎమ్మెల్యేల దోపిడీతో ఆవిరి
-
పార్టీ పరువు తీస్తున్న కొందరు ఎమ్మెల్యేలు
-
కూటమి ఎమ్మెల్యేల కక్కుర్తి
-
క్లబ్బులతో మళ్లీ గబ్బు
-
గుంటూరులో వైసీపీ నేతతో కలసి వ్యాపారం
-
ఎమ్మెల్యేల అనుమతితో క్లబ్బులు ప్రారంభం
-
గుంటూరు నుంచి గోదావరి వరకూ తెరుచుకున్న అనధికార క్లబ్బులు
-
సీఐల పోస్టింగులకు ముందే ఎమ్మెల్యేల లక్ష్మణరేఖ
-
క్లబ్బులపై దాడులు చేయవద్దని షరతులు
-
జగన్ జమానాలో క్లబ్బులపై ఉక్కుపాదం
-
నాడు రేపల్లె, గుడివాడ, మాచర్లకే పరిమితం
-
కూటమి ఎమ్మెల్యేల కక్కుర్తికి కళ్లెం వేయకపోతే కష్టమేనంటున్న సీనియర్లు
-
సోషల్‌మీడియా ఉంది జాగ్రత్త అంటున్న కూటమి నేతలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఒకవైపు చంద్రబాబునాయుడు.. మరో వైపు లోకేష్.. ఇంకో వైపు భువనేశ్వరి కాళ్లకు బలపాలు కట్టుకుని, మండుటెండల సెగల సెల్సియస్‌లో ప్రచారం చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. జగన్ కుట్రతో బాబు జైలుకూ వెళ్లారు. మరోవైపు జనసేనాధిపతి పవన్ కల్యాణ్, ఎన్నికలను చావోరేవోగా తీసుకుని సుడిగాలి ప్రచారం చేశారు. వీరుకాక కూటమి విజయం కోసం తెరవెనుక కష్టపడ్డ తలలెన్నో?! వీరందరి రెక్కల కష్టంతో ఎన్డీఏ కూటమి తిరుగులేని మెజారిటీతో చరిత్ర తిరగరాసి గద్దెనెక్కింది.
అంతకుముందు సీఎంగా పనిచేసిన జగన్ వైకాపాకు కేవలం 11 స్థానాలే ఇచ్చారంటే.. గత పాలన-గత ఎమ్మెల్యేలపై ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేకత గూడుకట్టుకుందో చెప్పాల్సిన పనిలేదు. బీజేపీకి ఏమాత్రం బలం లేని రాయలసీమ, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో అభ్యర్ధులు వేల మెజారిటీతో గెలిచారంటే.. జగన్ వ్యతిరేక గాలి ఎంత ప్రభ ంజనంగా వీచిందో అర్ధమవుతుంది.
మరి అంత సమిష్టి సమరంతో గద్దెనెక్కిన కూటమి ఎమ్మెల్యేలు ప్రజాతీర్పును గౌరవిస్తున్నారా?.. చంద్రబాబు-పవన్-లోకేష్ కష్టానికి విలువిచ్చి పార్టీని పదికాలం అధికారంలో ఉంచే పనులు చేస్తున్నారా?.. జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేస్తున్నారా?.. ఆ పార్టీ ఎమ్మెల్యేల దారిలోనే నడుస్తూ చంద్రబాబునాయుడు పరువు తీస్తున్నారా అంటే.. చాలా నియోజకర్గాలలో కూటమి శ్రేణుల నుంచి, దానికి అవుననే సమాధానం వస్తోంది.
విజయం తెచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. గెలవడం కష్టం కాకపోయినా శ్రమిస్తే గెలవవచ్చు. కానీ దాన్ని కాపాడుకోవడమే కష్టం. గతానుభవాలు, భారీ మెజారిటీలతో దక్కిన గెలుపును కాలదన్ని, కొందరు ఎమ్మెల్యేలు అడ్డదారుల్లో పయనిస్తున్నారన్న ఆందోళన కూటమి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
ప్రధానంగా కొద్దిరోజుల నుంచి అనేక నియోజకవర్గాల్లో తెరిచిన పేకాట క్లబ్బులు, పార్టీ పరువు తీస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు నగ రంలో రోడ్డుపైనే.. టీడీపీ-వైసీపీ నేతలు కలసి అనధికారికంగా పేకాట క్లబ్ ప్రారంభించడం పార్టీ శ్రేణులను నివ్వెరపరుస్తోంది. దీనికి పైస్థాయిలో పోలీసుపెద్దల ఆశీస్సులున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
నిజానికి జగన్ ఐదేళ్ల జమానాలో..రాజధాని గుంటూరులో పేకాట క్లబ్ తెరిచేందుకు ఆ పార్టీ నేతలు సైతం ధైర్యం చేయలేకపోయారు. అప్పట్లో పార్టీని శాసించిన ఓ ఎమ్మెల్సీ ఎంత ప్రయత్నించినా అవి ఫలించలేదు. అలాంటిది కూటమి సర్కారులో అనధికార క్లబ్ ప్రారంభం కావడం, అందులో వైసీపీ నేతల పెట్టుబడులు ఉండటం కూటమి శ్రేణులను నివ్వెరపరుస్తోంది.
గత ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని వ్యవస్థలూ భ్రష్ఠుపట్టి, ప్రతీ రంగంలో దోపిడీ జరిగినప్పటికీ.. పేకాట క్లబ్‌లపై మాత్రం కఠినంగా వ్యవహరించారు. అప్పట్లో గుడివాడ, రేపల్లె, మాచర్ల, నెల్లూరు జిల్లాలో ఉధృతంగా.. చిలకలూరిపేటలో కొద్దినెలలు పేకాట క్లబ్బులు నడిచాయి. రేపల్లెలో మోపిదేవి కుటుంబమే బోట్లు ఏర్పాటుచేయించి, పేకాట నిర్వహించేదన్న ఆరోపణలుండేవి. ఇక మాచర్లలో సైతం పిన్నెల్లి అనుచరులు అనధికార క్లబ్బు నడిపేవారన్న ఆరోపణలుండేవి. ఈ రెండు ప్రాంతాలకు తెలంగాణ, గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పేకాటరాయుళ్లు తరలివచ్చేవారు.
చిలలూరిపేటలో నాటి ఎమ్మెల్యే రజనీ అనుచరులు, ఏకంగా అపార్టుమెంటు తీసుకుని పేకాట నిర్వహించారు. ఆ తర్వాత దానిని కూడా మూయించేశారు. ఇవి మినహా రాష్ట్రంలో పేకాట క్లబ్బులు ప్రారంభమైన దాఖలాలు లేవు. చివరకు వ్యాపార-రాజకీయ ప్రముఖులుండి, పేకాటకు పేరున్న గుంటూరులోని రెండు పెద్ద క్లబ్బులో కూడా ్ల పేకాట మూతపడింది. పేకాట క్లబ్బుల విషయంలో నాటి జగన్ సర్కాను అంత కఠిన వైఖరి ప్రదర్శించింది. ఆ వైఖరి మహిళలను మెప్పించింది.
అలాంటిది మళ్లీ రాష్ట్రంలో అనేకచోట్ల.. కూటమి ఎమ్మెల్యేల అనుమతితో, మళ్లీ పేకాట క్లబ్బులు ప్రారంభం కావడం కూటమి శ్రేణులను ఆందోళనపరుస్తోంది. ఎమ్మెల్యేల అనుమతికి లక్షల ధర పలికిందని.. సీఐల పోస్టింగు సందర్భంలో, ఫలానా పేకాట క్లబ్బు జోలికి వెళ్లకూడదన్న షరతుతోనే, వారికి సిఫార్సు లేఖలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక రాజధాని గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిథిలోని క్లబ్బులు, బార్లు, రియల్‌ఎస్టేట్ వెంచర్ల యజమానులను పిలిపించి.. మీ మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయని హెచ్చరించడం ద్వారా, పరోక్షంగా బేరాలకు దిగుతున్నారట. అయితే వారంతా గత ఎన్నికల్లో కూటమి విజయానికి పరోక్షంగా ఆర్ధికసాయం చేసినవారేనంటున్నారు. చివరాఖరకు వీరు సెలూన్లు నడిపి జీవనం సాగించేవారు ఇల్లు కట్టుకుంటున్నా, విడిచిపెట్టడం లేదని కూటమి కార్యకర్తలు వాపోతున్నారు.
ఎన్నికల్లో అయిన ఖర్చును వాయువేగంతో రాబట్టుకునేందుకు కొందరు కూటమి ఎమ్మెల్యేలు, ఈవిధంగా అడ్డదారులు తొక్కి పార్టీపరులు తీస్తున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా అడ్డగోలుగా వ్యవహరించబట్టే ఓడిపోయారన్న స్పృహ లేకుండా.. కూటమి ఎమ్మెల్యేలు వ్యవహరించడం సరైంది కాదని, ఇది మొత్తం పార్టీ ఇమేజీకి డామేజీ అవుతుందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల ‘జగనే నయం అన్న భావన ప్రజల్లో తలెత్తే ప్రమాదం లేకపోలేద’ని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘మనం అధికారంలోకి వచ్చి ఇంకా 60 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఇలాంటి పనులు చేయడం వల్ల జనంలో చులకన అవుతాం. బాబు-లోకేష్-పవన్-భువనేశ్వరి మేడం పడ్డ క ష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంటే చూడలేపోతున్నాం. మొన్నటి ఎన్నికల్లో ఖర్చంతా దాదాపు పార్టీనే భరించింది. ఎంపీ అభ్యర్ధులతో ఇప్పించింది. వైసీపీ వాళ్లు వారి అభ్యర్ధులకు మనకంటే చాలా తక్కువ ఇచ్చారు. ఇక అభ్యర్ధులకు ఎక్కడ ఖర్చయింది? ఇలాంటి అనైతిక వ్యవహారాలు జనంలోకి వెళితే పార్టీ పలచన అవుతుంది. సార్ దీనికి చరమగీతం పాడకపోతే మళ్లీ జగన్ వచ్చి, ఈ పరిస్థితిని వాడుకునే ప్రమాదం ఉంద’’ని గోదావరి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఆవేదనతో వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం.
సోషల్ మీడియాతో యమ డేంజర్
ఇప్పుడు పార్టీలు-ప్రభుత్వాలతో ఉన్న అనేక రకాల మొహమాటాలతో పత్రికలు-చానెళ్లు రహస్యాలను బయటపెట్టకపోవచ్చు. కానీ నాలుగుగోడల మధ్య జరిగిన రహస్యాలను, నిమిషాల్లో బయటప్రపంచానికి చెప్పే సోషల్‌మీడియా ఉందని ప్రజాప్రతినిధులు మర్చిపోవడమే విచిత్రం. ప్రస్తుతం రాష్ట్రంలో వెలుగుచూసిన అనేక వ్యవహారాలన్నీ సోషల్ మీడియా పుణ్యమే.
పార్టీ కార్యకర్తలు నిర్వహించే సోషల్ మీడియా, ఇప్పుడు ప్రధాన మీడియా కంటే చాలా వేగంగా వెళుతోంది. సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తల మనోభావాలను గమనించిన తర్వాత, ప్రభుత్వం దిద్దుబాటుకు దిగిన సందర్భాలెన్నో. ఐఏఎస్ నుంచి సీఐలను కూడా మార్చాల్సి వచ్చింది. అసలు ఇప్పుడు ప్రధాన మీడియాలో వచ్చే కథనాలన్నీ, సోషల్‌మీడియాలో రోజంతా ప్రపంచం చుట్టివచ్చిన తర్వాత వస్తున్నవే. అంత ప్రాధాన్యం ఉన్న సోషల్‌మీడియా ప్రమాదాన్ని.. ప్రజాప్రతినిధులు గమనించి జాగ్రత్తగా ఉండకపోతే, పార్టీ నష్టపోతుందని మాజీ మంత్రులు హెచ్చరిస్తున్నారు.
యలమంచిలి, పెందుర్తిలో జనసేన రూటే సెప‘రేటు’
విశాఖ జిల్లా పెందుర్తి-యలమంచిలి నియోజకవర్గాల్లో జనసేన ప్రముఖులది విభిన్న శైలి. అక్కడి సెజ్ నుంచి బయటకువెళ్లే ప్రతి లారీకి, వెయ్యిరూపాయల చొప్పున వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దానితో పారిశ్రామికవేత్తలంతా జనసేనాధిపతి పవన్‌కు ఫిర్యాదు చేశారట. ఇటీవల నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల భేటీ తర్వాత.. ఈ వ్యవహారంపై పవన్ దృష్టి సారించారట.
తన దృష్టికి వచ్చిన వసూళ్ల ఫిర్యాదులను వారివద్ద ప్రస్తావించి, అగ్గిరాముడయినట్లు సమాచారం. ఇకపై అలా చేస్తే ఆ నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను పెడతానని హెచ్చరించారట. అయితే ఆ విషయం పారిశ్రామికవేత్తలకు తెలిసిందని గ్రహించిన జనసేన ప్రముఖులు వారిని పిలిచి.. మాకు వార్నింగు ఇచ్చిన విషయం బయటకు తెలిస్తే లారీకి రెండు వేలు వసూలు చేస్తామని తమదైన శైలిలో వార్నింగులిచ్చినట్లు విశాఖ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే ఈ్యవహారాన్ని పారిశ్రామికవేత్తలు ఒక ఎంపీ దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో.. ఆయన చంద్రబాబు-పవన్‌కు జనసేన నేతల వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివరించారట. తర్వాత పారిశ్రామికవేత్తలతో భేటీ నిర్వహించి, మీరు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదని అభయం ఇచ్చిన తర్వాత కూడా, లారీకి వెయ్యిరూపాయలు వసూలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.