-
పేలుతున్న వాల్మీకి స్కామ్
-
తెలంగాణకు పాకిన 45 కోట్ల ‘కట్టల’పాములు
-
మిగిలిన 44 కోట్లు ఆంధ్రా కాంగ్రెస్‌కేనా?
-
9 హైదరాబాద్ కంపెనీల ఖాతాలకు కర్నాటక సొమ్ము
-
రంగంలోకి దిగిన ఈడీ, సిట్
-
ఇప్పటికే కర్నాటక సీఎం సిద్దరామయ్యకు నోటీసు
-
రేవంత్‌కూ నోటీసులు తప్పవన్న కాంగ్రెస్ మంత్రి సతీష్
-
సిద్దరామయ్యను తప్పిస్తే రేవంత్ సర్కారు కూలుతుందంటూ సతీష్ సంచలన వ్యాఖ్యలు
-
కుంభకోణంపై తెల్లమొఖం వేస్తున్న తెలంగాణ మీడియా
-
కేటీఆర్ బయటపెట్టేంత వరకూ సోయి లేని తెలంగాణ మీడియా
-
హైదరాబాద్‌లో ఈడీ దాడులు చేసినా వార్తలు రాయని వైనం
(మార్తి సుబ్రహ్మణ్యం)
కర్నాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. ఈపేరు కొద్దిరోజుల వరకూ కర్నాటకలో కూడా వాల్మీకి కులస్తులకు తప్ప, ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ అందులో జరిగిన 187 కోట్ల కుంభకోణం బయటపడటంతో అంతా అటు వైపే చూస్తున్నారు. మరి కర్నాటకలో జరిగిన కుంభకోణం పంచాయితీ తెలంగాణకు ఏం సంబంధం అనే కదా అందరి అనుమానం?
యస్. కర్నాటకలో పాకటం మొదలైన వాల్మీకి ‘కట్టల’ పాము.. ఎన్నికల ముందు తెలంగాణ-ఏపీలోలో కుబుసం చెరిసగం విడిచింది. ఆ పాము మోసుకొచ్చిన 45 కోట్ల రూపాయల బాంబు ఇప్పుడు తెలంగాణలో బాంబులా పేలుతోంది. అది ఇప్పుడు.. కర్నాటక కాంగ్రెస్ మంత్రి సతీష్ భాషలో చెప్పాలంటే.. సీఎం రేవంత్‌రెడ్డి సీటుకు ఎసరు తెచ్చేలా మారింది.
ఈ కుంభకోణంపై విచారణకు కర్నాటక సీఎం సిద్దరామయ్యకు నోటీసులిచ్చినట్లే.. రేపోమాపో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికీ నోటీసులొస్తాయంటూ స్వయంగా కాంగ్రెస్ మంత్రి సతీష్ జార్కిహోళి చేసిన ప్రకటన, తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపేందుకు కారణమయింది. అయితే కర్నాటకలో పేలిన వాల్మీకి బాంబు పేలుడు తెలంగాణ వరకూ వినిపించినా.. పేరుగొప్ప మీడియా దానిని పట్టించుకోకపోవడమే ఆశ్చర్యం. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కుంభకోణం బయటపెడితే తప్ప, తెలంగాణ మీడియాకు సోయి లేకపోవడం మరో వింత. కుంభకోణం వెలుగుచూసిన తర్వాత కూడా మన్నుతిన్నపాములా ఉండటం బట్టి ‘నాలుగోస్తంభం’ ఒత్తిళ్లతో నలుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. కర్నాటకలో బయటపడ్డ కుంభకోణం తెలంగాణ కాంగ్రెస్ నేతల చావుకొచ్చిపడుతోంది. పార్లమెంటు ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ విజయం కోసం, కర్నాటకలోని కర్నాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన 187 కోట్ల రూపాయల కుంభకోణంలో, తెలంగాణ కాంగ్రెస్ వాటా అక్షరాలా 45 కోట్ల రూపాయలని దర్యాప్తు సంస్థలు తేలడంతో, ఇక ఈడీ-సిట్ తెలంగాణలో కాలుపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
అసలు కర్నాటకలో ఈ కుంభకోణంపై అక్కడి ప్రతిపక్ష బీజేపీ కంటే.. వాల్మీకి వర్గానికి చెందిన సొంత పార్టీ మంత్రి సతీష్ చేస్తున్న గత్తరే ఎక్కువగా ఉండటం విశేషం. గత ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ కోసమే తెలంగాణ కాంగ్రెస్‌కు 44. 6 కోట్లు హైదరాబాద్‌కు చేరినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మిగిలిన కొంత 44 కోట్లను ఏపీ కాంగ్రెస్‌కూ సర్దుబాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
కర్నాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కుంభకోణాన్ని, కార్పొరేషన్ అకౌంటెంట్ చంద్రశేఖర్ తన ఆత్మహత్య లేఖ ద్వారా వెల్లడించటంతో బయటపడింది. దానిపై విపక్షాలు యాగీ చేయడంతో విధిలేక, సీఎం సిద్దరామయ్య సిట్ విచారణకు ఆదేశించారు. కుంభకోణం నిజమేనని సీఎం సిద్ధ-డిప్యూటీ సీఎం డికె నిండుసభలోనే అంగీకరించాల్సి వచ్చింది. వెంటనే ఈడీ కూడా విచారణకు బరిలో దిగింది. రంగంలోకి దిగిన ఈడీ మాజీ మంత్రి, కార్పొరేషన్ చైర్మన్, మరో ఇద్దరు బ్యాంకు అధికారులు సహా 11 మందిని అరెస్టు చే సింది.
కానీ రెండో చార్జిషీట్‌లో మాత్రం కథ మారింది. దానితో కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కర్నాటక వాల్మీకి సంఘాలు విరుచుకుపడతున్నాయి. ఫలితంగా ఆ సామాజికవర్గం నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సతీష్ జార్కిహోళిపై, సొంత కులం నుంచి ఒత్తిడిసెగ పెరిగింది. దానితో ఆయన, సొంత పార్టీపైనే విమర్శలు ఎక్కుపెట్టక తప్పని అనివార్య పరిస్థితి.
కాగా కర్నాటక వాల్మీకి కార్పొరేషన్ నిధులు హైదరాబాద్‌లోని 9 కంపెనీల బ్యాంకు ఖాతాలకు చేరినట్లు, ఆ డబ్బుతోనే మద్యం, కార్లు కొన్నట్లు సిట్ గుర్తించింది. ఈ ఖాతాలన్నీ హైదరాబాద్ ఆర్బీఎల్ బ్యాంకులో జమయినవేనంటున్నారు. అసలు నగదు బదిలీకి వాడిన బ్యాంకు ఖాతాలు కూడా నకిలీవేనని ఈడీ అనుమానిస్తోంది.
అయితే విచిత్రంగా.. అసలు ఈ 187 కోట్ల రూపాయల కుంభకోణాన్ని ఆత్మహత్యకు పాల్పడి మరీ వెల్లడించిన, కార్పొరేషన్ అకౌంటెంట్ చంద్రశేఖర్‌ను కీలక నిందితుడిగా చేర్చిన సిట్.. ఆయన సూసైడ్ నోట్‌లో వెల్లడి ంచిన అసలు నిందితుల పేర్లను మాత్రం చార్జిషీట్ నుంచి తప్పించడంపై, అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ కుంభకోణం వివరాలను ఈడీ ఇప్పటి దాకా వెల్లడించకపోవడం బట్టి.. కాంగ్రెస్-బీజేపీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందంటూ, కర్నాటక సోషల్‌మీడియా కోడై కూస్తోంది. కాగా ఈ కేసులో మూడున్నర కోట్లతో స్పోర్ట్స్‌కారు, 35 కిలోల బంగారం కొన్న తెలంగాణకు చెందిన సత్యనారాయణ వర్మను అరెస్టు చేశారు. ఇదీ.. కర్నాటక-తెలంగాణ రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కర్నాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో బయటపడ్డ 187 కోట్ల కుంభకోణం కథ.
ఇదిలాఉండగా.. హైదరాబాద్‌లోని ప్రముఖ బంగారు షాపులు, పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు లోక్‌సభ ఎన్నికల ముందు వివిధ బ్యాంకుల నుంచి భారీ ఎత్తున నగదు విత్‌డ్రా చేసుకున్నారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. దానితోపాటు..కర్నాటక సీఎం సిద్దరామయ్యను పార్టీ అధిష్ఠానం తప్పిస్తే, తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కారు కూలిపోతుందన్న కర్నాటక కాంగ్రెస్ మంత్రి సతీష్ వ్యాఖ్యలు.. తెలంగాణ కాంగ్రెస్ వర్గాలను అట్టుడికిస్తున్నాయి.
అసలు కర్నాటక కుంభకోణంలో అక్కడి సీఎం సిద్దను పక్కకుతప్పిస్తే, తెలంగాణలో రేవంత్ సర్కారు ఎందుకు కూలుతుంది? సిద్దకు-రేవంత్‌కు సంబంధమేమిటి? కర్నాటక కుంభకోణం రేవంత్‌ను ఎందుకు తొలగించేలా చేస్తుందన్న చర్చలకు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తెరలేచింది.
నిద్రపోతున్న నాలుగోస్తంభం
కర్నాటక టు తెలంగాణ వరకూ పాకిన వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం వ్యవహారంపై, పేరు గొప్ప తెలంగాణ మీడియా అసలు కన్నేయకపోవడమే విచిత్రం. ఈ కుంభకోణంపై విచారణ కోసం ఈడీ అధికారులు హైదరాబాద్‌కు వచ్చి, బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. సిట్, సీఐడీ కూడా దాడులు చేశాయి. కానీ వాటికి సంబంధించి ఒక్క ముక్క కూడా ప్రధాన మీడియాలో భూతద్దం వేసి వెతికినా కనిపించకపోవడం బట్టి, నాలుగో స్తంభం ఒత్తిళ్లకు లొంగిపోయినట్లు సులభంగానే అర్ధమవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గత పదేళ్ల నాటి తెలంగాణకు సంబంధించిన అనేక కుంభకోణాలను పరిశోధిస్తున్న మీడియా.. 187 కోట్ల రూపాయల కుంభకోణంపై దర్యాప్తు సంస్థలు హైదారబాద్‌కు వచ్చి, విచారణ జరిపిన వార్తను మాత్రం ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదన్న ప్రశ్నకు జవాబులేదు. పోనీ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాతయినా.. హైదరాబాద్‌లో ఈడీ దీనిపై ఎందుకు మౌనంగా ఉంది? ఈడీ ఎవరిని రక్షిస్తోంది? అనే తన సహజశైలి కథనాలను తెలంగాణ మీడియా ఎందుకు జమ్మిచెట్టు ఎక్కించిందన్న మరో ప్రశ్న. అయితే ఈ కుంభకోణంపై అదృశ్యశక్తులు.. ప్రస్తుతానికి విజయవంతంగా మీడియా మేనేజ్‌మెంట్ చేసినప్పటికీ, అసలు నిజాలు త్వరలో బయటకొస్తాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు.
నిజానికి అసలు ఈ కుంభకోణాన్ని బీఆర్‌ఎస్ తెరపైకి తీసుకువచ్చేంతవరకూ, మీడియాకు సైతం తెలియకపోవడమే విచిత్రం. తన ఆత్మహుతి ద్వారా ఈ కుంభకోణం బయటకు వచ్చేందుకు కారణమైన కార్పొరేషన్ అకౌంటెంట్ భార్యను ఇంటర్వ్యూ చేయాలన్న సోయి ఏ ఒక్క పెద్ద మీడియాకో లేకపోవడమే ఆశ్చర్యం.
ఇంకా సూటిగా చెప్పాలంటే.. తెలంగాణలోని పెద్ద పత్రికలు, చానెళ్లతోపాటు.. అన్ని ఇంగ్లీషు దినపత్రికలకూ బెంగళూరులో ఎడిషన్లు, రిపోర్టర్లూ ఉన్నారు. అయినా ఆ కోణంలో పరిశోధనలు జరగకపోవడం బట్టి, నాలుగోస్తంభం ఒత్తిళ్లకు నలిగిపోయిందని, మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది.