Suryaa.co.in

Andhra Pradesh

ఏకలవ్య పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

  • కొడవలూరు పరిధిలోని ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలను పరిశీలించిన ఎంపీ
  • ప్రతి తరగతి గదిని పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి
  • పాఠశాలలో వసతులపై ఆరా.. పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడి
  • ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేస్తామని హామీ

కొడవలూరు: గిరిజనాభివృద్ధికి ఎంతో ఊతమిచ్చే ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ అన్నారు. బుధవారం కొడవలూరు మండలంలోని చంద్రశేఖర పురంలో ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలను ఆయన పరిశీలించారు.

స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రిన్సిపల్‌, అధ్యాపకులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా పాఠశాలకు చేరుకున్న ఎంపీకి స్థానిక నాయకులు, పాఠశాల ప్రిన్సిపల్‌ విశ్వప్రతాప్‌ శుక్లా, ట్రైబల్‌ వెల్ఫేర్‌ పీడీ పరిమళ, ఇతర అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో అన్ని ప్రాంతాలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. మరుగుదొడ్లు పరిశీలించి డోర్లు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్‌ను అడిగి వివరాలు ఆరా తీశారు. అలాగే తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాలలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలలో తగినంత మంది సిబ్బంది లేకపోవడంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆరా తీశారు. అలాగే ప్రయోగశాలలను పరిశీలించి ఏమేం వసతులు ఉన్నాయి, ఏం ఏర్పాటు చేయాలన్న దానిపై వివరాలు తెలుసుకున్నారు. ప్రాంగణంలో నిర్మించిన విద్యార్థుల భోజన శాల ప్రారంభానికి నోచుకోకపోవడంపై ఆరా తీశారు.

భోజన శాలను త్వరలోనే ప్రారంభించి విద్యార్థుల ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. పాఠశాల ఆవరణలో అసంపూర్తిగా ఆగిపోయిన స్టేడియాన్ని పరిశీలించారు. బోధన, బోధనేతర సిబ్బంది నియామకంపై తప్పకుండా కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి జుయల్‌ ఓరమ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ పీడీ పరిమళ, తహసీల్దారు స్పూర్తి, పాఠశాల ప్రిన్సిపల్‌ విశ్వ ప్రతాప్‌, టీడీపీ ముఖ్య నాయకులు కోడూరు కమలాకర్‌రెడ్డి, కొడవలూరు మండల టీడీపీ ముఖ్య నాయకులు, అధ్యాపక సిబ్బంది, గెస్ట్‌ ఫ్యాకల్టీ, అధ్యాపకేతర సిబ్బంది, పేరెంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ శీనయ్య, సభ్యులు పద్మ, చెంచుకృష్ణ, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE