-
రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు సవిత
-
మంత్రిని కలిసిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జేఏసీ
-
సెబ్ రద్దుపై ధన్యవాదాలు తెలిపిన జేఏసీ సభ్యులు
అమరావతి : రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి సాగు, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులను గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత ఆదేశించారు. గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్బ్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవితను తాడేపల్లిలోని ఆమె క్యాంపు కార్యాలయంలో కలిసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సెబ్ ను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడంపై ఆనందం వ్యక్తంచేశారు. మద్యం, ఇసుక ద్వారా అక్రమ దందాను పాల్పడడానికి జగన్ ప్రభుత్వం కుట్ర పన్ని సెబ్ అనే వ్యవస్థను రూపొందించిందన్నారు. ఇందులో తమను పావులుగా ఉపయోగించుకుని గడిచిన అయిదేళ్లూ వేల కోట్ల రూపాయల్లో ఆక్రమార్జన దిగారన్నారు. అధికారులుగా తమను పనిచేయకుండా కాళ్లు చేతులు కట్టేసి…అక్రమ ఇసుక తవ్వకాలు, మద్యం, నాటు సారా అమ్మకాలకు తెర తీశారన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును, అమ్మకాలను తమపై ఒత్తిడి తీసుకొచ్చి, విధులు నిర్వర్తించనీయ్యలేదన్నారు. ఇపుడు చంద్రబాబు ప్రభుత్వం సెబ్ ను రద్దు చేయడం వల్ల తమను బంధ విముక్తులను చేసిందన్నారు. ఇకపై తాము స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునే అవకాశం కలిగిందన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆశయ సాధనకు అంకుఠిత దీక్షతో విధులు నిర్వహిస్తామని మంత్రి సవితకు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, తమది ప్రజా ప్రభుత్వమని,. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలిపారు. గంజాయి, నాటుసారా అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని తనను కలిసిన చేసిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులకు స్పష్టంచేశారు. విచ్చలవిడిగా గంజాయి అమ్మకాల వల్ల యువత దారితప్పుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.
అనంతరం జేఏసీ నేతలు…మంత్రి సవితమ్మను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బాబ్జీరావు, కార్యదర్శి నరసింహులు, కో చైర్మన్ మార్పు కోటయ్య, సూపరింటెండెంట్ లావణ్య, అసిస్టెంట్ కమిషనర్ స్వాతి, ఇన్ స్పెక్టర్లు వర్మ, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.