Suryaa.co.in

Andhra Pradesh

జోరు వానలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన

* నిర్విరామంగా 10 గంటల పాటు పర్యటించి ముంపు ప్రాంతాల పరిశీలన
* తక్షణ సహాయ చర్యలకు కాల్ సెంటర్ ఏర్పాటు

విజయవాడ: అకస్మాత్తుగా సంభవించిన భారీ వర్షాల ప్రకృతి విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షంతో జలమయమైన ప్రాంతాలలో శనివారం జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విశ్రాంతి లేకుండా పర్యటిస్తున్నారు.

జిల్లాలో ఉన్న వాగులు, వంకలు, కాలువలు వర్షపు నీటితో పోటెత్తాయి. తీవ్ర వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రజలు సమస్యలను తెలుసుకొనేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టేలా పలు సూచనలు చేశారు. మొగల్రాజపురం సున్నపు బట్టీలు సెంటర్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపదిన ప్రదేశాన్ని పరిశీలించి మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు పరిశీలించారు.

శనివారం తెల్లవారుజామున ప్రారంభమైన జిల్లా కలెక్టర్ పర్యటన శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. మునిగిపోయిన రోడ్లను నీరు నిలిచిన పల్లపు ప్రాంతాలను పరిశీలించి ఆయా ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో కురుస్తున్న వర్షభావంతో పాటు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షపు నీటితో మైలవరం నియోజకవర్గం జి కొండూరు ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో బుడమేరు వరదనీటి ముంపు వలన జలమయమైన ప్రాంతాలను కలెక్టర్ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండల సమీపంలో కొండపల్లి ఖాజామాన్యం వద్ద బుడమేరు కట్టతెగి భారీ ఎత్తున వరద నీరు నివాస ప్రాంతాలకు చేరుకోవడంతో అక్కడ నివాసముంటున్న ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.

అక్కడకు చేరుకున్న 20 మంది ఎన్డీఆర్ఎఫ్ సభ్యుల బృందం సహాయక చర్యలు చేపట్టేందుకు కష్టపడుతున్నారు. కలెక్టర్ స్థానిక అధికారులను అప్రమత్తం చేసి ఎన్డీఆర్ఎఫ్ సభ్యుల బృందానికి తోడ్పాటు అందించాలని రెవిన్యూ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం ముంపుకు గురైన కొండపల్లి పారిశ్రామిక వాడ విటిపీఎస్ లోని పలు కాలనీలు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు.

చందర్లపాడు మండలం ముప్పాళ్ళ వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు కొనసాగించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్థానిక అధికారులను ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లడంతో నందిగామ చందర్లపాడు మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించయని నందిగామ నుండి చందర్లపాడు వెళ్లే మార్గంలో అడవిరావులపాడు చందాపురంల వద్ద నల్లవాగు రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయని కలెక్టర్ తెలిపారు.

అలాగే పెనుగంచిప్రోలు- నందిగామ, పెనుగంచిప్రోలు- జగ్గయ్యపేట మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆయా మార్గాలలో ప్రజలు ప్రయాణించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు మరో ఒకటి రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు రేయింబవళ్లు అప్రమతత్తతో ఉండాలని ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

LEAVE A RESPONSE