Suryaa.co.in

Editorial

జనం బతుకు.. జల‘హారతి’

– ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు
– 8 మంది మృతి, డజన్ల మందికి గాయాలు
– నీటమునిగిన పంటపొలాలు
– విజయవాడలో నలుగురు, గుంటూరులో నలుగురు మృతి
– జలదిగ్బంధంలో విజయవాడ, గుంటూరు
– నీళ్లలో కొట్టుకుపోయిన కార్లు, టూ వీలర్లు
– కారు కొట్టుకుపోవడంతో టీచరు, విద్యార్ధులు మృతి
– దుర్గ గుడిపై విరిగిపడుతున్న కొండచరియలు
– కొండపైకి రాకపోకలు బంద్
– గుంటూరు, కృష్ణాలో జలప్రళయం
– ఆ రెండు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
– ఉదయం నుంచి సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ
– మృతులకు 5 లక్షల నష్టపరిహారం
– తక్షణ సాయం కింద జిల్లాకు 3 కోట్లు విడుదల
( సుబ్బు)

జనం బతుకు జలహారతయిపోయింది. రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు గుంటూరు, కృష్ణా జిల్లాలు భారీగా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం వివిధ ఘటనల్లో 8 మంది మృతి చెందగా, డజన్ల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్ర రాజధాని నగరం విజయవాడ, రాజధాని జిల్లా అయిన గుంటూరు నగరం వానకు తడిసి ముద్దయింది. విజయవాడ క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందగా, గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మరో నలుగురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంగళగరి, వినుకొండతోపాటు గుంటూరు నగరం భారీగా నష్టపోయింది. ప్రధానంగా పంటపోలాలు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యవస్థంగా మారింది. భారీ వాహనాలు సైతం కాల్వల్లో కొటుకుపోయాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో రెండురోజుల పాటు భారీ వర్షాల గండం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

కాగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు ఉదయం నుంచి సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. డీజీపీ, సీఎస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిరంతరం సమీక్షలు చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీకి అంతరాయం ఏర్పడుతున్న నేపధ్యంలో, మరో మూడురోజుల సమయం ఇచ్చారు. తక్షణ సాయం కింద జిల్లాకు 3 కోట్లు విడుదల చేశారు.

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 8 మంది చనిపోయినట్టు అధికారులు వివరించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అత్యధికంగా 21.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా తెనాలిలో 17.8, మంగళగిరిలో 15.4, ఏలూరు జిల్లా నూజివీడులో 15, బాపట్ల జిల్లాలో 11, పల్నాడు జిల్లాలో 10, కృష్ణా జిల్లాలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కృష్ణా,గుంటూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా,గుంటూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అకస్మాత్తుగా వరదలు ముంచెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మొగల్రాజపురంలో నలుగురు మృతి

విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఏపీ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

జలదిగ్బంధంలో ఇబ్రహీంపట్నం, కొండపల్లి

జలదిగ్బంధంలో ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. బస్టాండ్ సమీపంలో బ్రిడ్జి వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు బస్సులు, లారీ లు, కార్లు గోతుల్లో దిగబడి ఇరుక్కుపోయిన పరిస్థితి. వన్‌టౌన్ పితాని అప్పలస్వామి స్ట్రీట్ వద్ద సపోర్ట్ గోడ మెట్లు కూలడంతో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంట్లో ఉన్న వారు బయటకి రావడంతో ప్రమాదం తప్పినట్లైంది.
డ్రైనేజీ నీరు ఇంట్లోకి రావడంతో రాత్రి నుంచి చిన్న పిల్లలు, మహిళలతో జాగారాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.

చాలా చోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు

విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాహనదారులు అవస్తలు పడుతున్నారు.
రామవరప్పాడు రింగ్ రోడ్ నుంచి నిడమానూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. చాలా చోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచింది. ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద బస్సులు నీటిలో ముందుకు కదల్లేక నిలిచిపోయాయి.

ఇంద్రకీలాద్రిపైనా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దేవస్థానానికి చెందిన సమాచార కేంద్రం ధ్వంసమైంది. పెద్ద బండరాళ్లు, ఒక్కసారిగా జారిపడడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

కాల్వలకు 3,507 క్యూసెక్కులు విడుదల

ప్రకాశం బ్యారేజీకి వరద ఉదృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి కాల్వలకు 3,507 క్యూసెక్కులు విడుదల చేశారు.

కాజ టోల్ గేట్ వద్ద నీరు

మంగళగిరి సమీపంలోని కాజ టోల్ గేట్ వద్ద నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. ఇక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దాంతో, సిబ్బంది టోల్ గేట్ వద్ద ఎలాంటి ఫీజు వసూలు చేయకుండానే వాహనాలను పంపించి వేస్తున్నారు. అయినప్పటికీ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.

ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో, పలు వాహనాలను సిబ్బంది వెనక్కి పంపిస్తున్నారు. రోడ్లపైకి ఎవరూ రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వరద ప్రవాహం ధాటికి వాహనాలు సైతం కొట్టుకుపోయే పరిస్థితి ఉందని స్పష్టం చేశారు.

జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణ సాయం:చంద్రబాబు

వర్షాలపై మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘మరో మూడు రోజులు వర్షం ప్రభావం ఉండనుంది. అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించా. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతో ఉంటే ప్రజల ఇబ్బందులను తగ్గించొచ్చు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోంది. పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టి, ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి అని’ అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సహాయ చర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణ సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు.

ఉప్పలపాడు వాగులో కారు కొట్టుకుపోయింది..

గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలోని వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. నంబూరులోని ఓ పాఠశాలలో ఉప్పలపాడుకు చెందిన రాఘవేంద్ర విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా శనివారం ఉదయం పాఠశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది.

పాఠశాలకు వచ్చిన ఉప్పలపాడుకు చెందిన ఇద్దరు విద్యార్థులను తీసుకొని రాఘవేంద్ర స్వగ్రామానికి బయల్దేరాడు. దారి మధ్యలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా ఆగకుండా వెళ్లడంతో వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాఘవేంద్రతోపాటు కారులో ఉన్న విద్యార్థులు సాత్విక్‌, మానిక్‌లు మృతిచెందారు. స్థానికుల సాయంతో కారుతో పాటు వాగులో కొట్టుకుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

గుంటూరు జిల్లా వినుకొండ లో శనివారం ఉదయం నుండి ఎడతెరిపికొండ భారీ వర్షం కురుస్తుంది. వినుకొండ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు కొన్ని కారుతున్నాయి. బస్సు పై బాడీకి చిల్లులు పడటం, తుప్పుపట్టి అతుకులు పోవడంతో వర్షానికి బస్సు అంతా కారుతుంది. దీంతో ప్రయాణికులు తడిసి ముద్దయి ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణికులు వెంట తెచ్చుకున్న గొడుగులు బస్సుల్లో వేసుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మంగళగిరి టిడ్కో కాలనీలోకి నీళ్లు

రాత్రి నుంచి మంగళగిరిలో కురిసిన భారీ వర్షాలకు టిడ్కో కాలనీలోకి నీళ్లు వచ్చాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి కూడా కాలువలు నిండిపోయి బ్లాకులు వద్దకు మురుగునీరు రావటంతో పలు ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న టిడ్కో కాలనీవాసులు. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు దెబ్బకు బ్లాక్ లోకి నీరు చేరడంతో పాటు విష పురుగులు కూడా తిరుగుతూ కనిపించడంతో ఆందోళన చెందుతున్న కాలనీవాసులు. అధికారులు వెంటనే నీరు త్వరగా బయటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్న టిడ్కో కాలనీ ప్రజలు కోరుతున్నారు.

25 ప్యాసింజర్‌ రైళ్ల రద్దు

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడ డివిజన్‌ పరిధిలో 25 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. వీటిల్లో విజయవాడ నుండి తెనాలి, గూడూరు, కాకినాడ పోర్టు, రేపల్లె, మచిలీపట్నం, గుడివాడ, నిడదవోలు, భీమవరం, గుంటూరు, నరసాపూర్‌, ఒంగోలు వెళ్లే రైళ్లున్నాయి. ఇవి కాకుండా గుంటూరు రేపల్లె, తెనాలి రేపల్లె, గుడివాడ, మచిలీపట్నం మధ్య నడిచే రైళ్లను 31, 1, 2 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా కొండపల్లిలో తొలిసారి రైలు పట్టాలపైకి వర్షపునీరు వచ్చి చేరింది. భారీగా నీరుపారడంతో పట్టాలు కొట్టుకుపోయాయి. దీంతో రైళ్లను ఎక్కడికక్కడ నిలిపేశారు. వీలైనంత త్వరగా రైళ్ల రాకపోకలు పునరుద్ధరిస్తామని డిఆర్‌ఎం తెలిపారు.

LEAVE A RESPONSE