– మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలి
– వరద ప్రభావిత ప్రాంతాల్లో గృహ నిర్మాణ అధికారులు సిబ్బంది సేవలు భేష్
– రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
విజయవాడ : పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నిర్దేశించిన వందరోజుల ప్రణాళిక లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు.
గృహ నిర్మాణ పనుల పురోగతిపై ఆదివారం మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రగతిపై సమీక్షించారు. వందరోజుల ప్రణాళిక కింద నిర్దేశించిన లక్ష్యాలు, వాటి సాధనలో పురోగతిని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (గృహ నిర్మాణం) అజయ్ జైన్ వివరించారు.
అదేవిధంగా మొత్తం మంజూరైన ఇళ్లు, పూర్తయిన ఇళ్లు, వివిధ దశల్లో ఉన్న ఇళ్ల వివరాలను ఏపీ ఎస్ హెచ్ సి ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజాబాబు వివరించగా.. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన వివరాలను ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి పేదలకు ఇళ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని ఈ నేపథ్యంలో అధికారులు చొరవ చూపాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా దాదాపు ఏడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని.. మిగిలిన ఇళ్లను 2025, మార్చినాటికి పూర్తి చేసేందుకు కృషిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు క్షేత్రస్థాయిలో సందర్శించి పనులను వేగవంతం చేసేందుకు కృషి చేయాలి అన్నారు.