– ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు
ఉండి: ఒకప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై గత ప్రభుత్వ హయాంలో కొంతమంది దారుణంగా దాడి చేశారని, వారిని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం పట్ల ఉండి శాసనసభ్యుడు రఘురామ కృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు.
ఈ కేసులో కొంతమంది హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరించిందన్నారు. కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. సురేష్ అనే వ్యక్తి దొరికాడు. జోగి రమేష్, అవినాష్ వంటి వారిని ఇప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. వీరంతా పరారీలోనే ఉన్నారా? అంటూ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి ఇంటిపైనే దాడి చేసిన వారి అరెస్టుకు, కోర్టు నుంచి ఎటువంటి ప్రతిబంధకాలు లేకపోయినప్పటికీ… ఇప్పటివరకు అదుపులోకి తీసుకోకపోతే ప్రజలకు పోలీసుల వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పోలీసులు ఈ అప్రతిష్ఠ నుంచి త్వరగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు రఘురామకృష్ణం రాజు అన్నారు.
కాదంబరీ జత్వాని ని సీనియర్ ఐపీఎస్ అధికారులైన సీతారామాంజనేయులు, క్రాంతి రానా టాటా తో పాటు మరో ముగ్గురు వేధించినట్టుగా ఆమె వారి పేర్లను ప్రస్తావించారని గుర్తు చేశారు. వారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా పేర్కొన్నారన్నారు. వరదల కారణంగా ఆమె కేసు మరుగునపడినప్పటికీ, తర్వాత వారిపై చర్యలు తీసుకుంటారన్న ఆశాభావాన్ని కాదంబరి జత్వాని వ్యక్తం చేశారన్నారు. ఇక నా కేసులో విజయ పాల్ పరారీలో ఉండగా, నిందితులైన డిజి ర్యాంక్ అధికారులు ఇక్కడే ఉన్నారన్నారు. వరద ప్రమాదం నుంచి అందరినీ కాపాడిన తర్వాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారిపై చర్యలు తీసుకుంటారన్న ఆశాభావం తనకు ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తన కేసులో నిందితులుగా ఉన్న డీజీ ర్యాంకు పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.
కొద్ది ఖర్చుతో రాబోయే విపత్తును ఎదుర్కొవచ్చు
కొల్లేరు నుంచి వరద నీరు ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్లే సమయంలో పరిసర గ్రామాలు ముంపునకు గురికాకుండా కొద్దిపాటి ఖర్చుతో ముందస్తు చర్యలను చేపడితే విపత్తును ఎదుర్కొవచ్చునని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉప్పుటేరు ముంపు ప్రాంతాలు మునగకుండా అతి తక్కువ డబ్బు ఖర్చుతో పునరుద్ధరణ చర్యలు చేపడితే ముంపు విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునని తెలిపారు. బుడమేరు పునరుద్ధరణ కోసం కోసం వందల, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారని, అందులో తక్కువ మొత్తాన్ని ఖర్చు చేయగలిగితే ఉప్పుటేరు ను పునరుద్ధరించడమే కాకుండా, చాలా నష్ట నివారణను అరికట్టవచ్చునని అన్నారు.
400 మందికి పునరావాస కేంద్రం ఏర్పాటు
ఉండి నియోజకవర్గ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో 400 నుంచి 600 ఎకరాలలో పంట నష్టం జరిగిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. పంట నష్టం పై ఇప్పటికే కలెక్టర్ తో పాటు, వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి సత్వరమే పంటకు నష్టపరిహారాన్ని అందజేసే విధంగా చొరవ తీసుకున్నామని తెలిపారు. గుమ్మలూరు, సిద్దాపురం, చిన్న మిల్లిపాడు, ఆకివీడులోని సమతా నగర్ లో కొంతమేర ముంపుకు గురైనట్టు రఘురామకృష్ణం రాజు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కొనుగోలు పెద్ద ఎత్తున అవినీతి జరిగిన మాట నిజమేనని ఒక ప్రశ్నకు రాజు అంగీకరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చూసుకుంటారని తెలిపారు. గంజాయి వల్ల బహిరంగ ప్రదేశాలలో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని గంజాయి సరఫరాను అరికట్టే విధంగా ఎస్పీ తో పాటు, డీఎస్పీ తో తరచూ మాట్లాడుతున్నట్టు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.