– – ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు
ఉండి: కాలువ గట్లను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పరచుకున్న వారికి ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే, ఇళ్ల స్థలాలిచ్చి గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. కాలువ గట్లను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పరచుకున్న వారికి గతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు నుంచి ఆరు లక్షలకు మించి ఇళ్లను నిర్మించలేదు.
తాను టిడ్కో ఇళ్ల గురించి చెప్పడం లేదన్న ఆయన, కాలువ గట్లపై ఇంటి స్థలం లేకనే బ్రతుకుతెరువు కోసమే వారు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. అటువంటి వారికి త్వరితగతిన ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి , ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే ఆక్రమణలను తొలగించడం కష్టమవుతుందని పేర్కొన్నారు. కాలువగట్లను కాపాడుకోలేక పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
కిలోమీటర్ కాలువ గట్టు పై 100 మీటర్లు కబ్జా చేసినా కూడా, పూడిక తీయడానికి యంత్రాలతో కూడిన వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుందన్నారు. మనుషులు వెళ్లి పూడిక తీయలేరని, దీనితో చాలా ఇబ్బందులు తలెత్తుతాయన్నారు.
ఉండి నియోజకవర్గ పరిధిలో నేను ఓట్ల కోసమే కాకుండా, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, కాలువ గట్లపై నివాసాలు ఏర్పరచుకున్న వారికి నచ్చచెప్పి ఖాళీ చేయించడం జరిగిందన్నారు.
మూడు నెలల్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని, ఆ మూడు నెలల పాటు అద్దె తానే చెల్లిస్తానని చెప్పడం జరిగిందన్నారు. గృహ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా 70 వేలకు తగ్గకుండా అందజేయాలని కోరారు.
ఈ మొత్తం రెండున్నర లక్షల రూపాయలవుతుందని, ఎలాగో వారు డ్వాక్రా గ్రూపులలో సభ్యులుగా ఉండడంతో తక్కువ వడ్డీకే రుణం లభిస్తుందన్నారు. ఎవరికైనా సొంత ఇల్లు అనేది ఒక కల అని, సొంత ఇంట్లోకి వారు త్వరగా అడుగుపెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
కొన్నిచోట్లలో చెరువులతో పాటు, కాలువ గట్లు, డ్రైనేజ్ గట్లను కబ్జా చేసి నివాసాలను ఏర్పాటు చేసుకున్నారని, దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందన్నారు. వరద సహాయక కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్కబెట్టిన తర్వాత ఆయన్ని కలిసి బలహీనవర్గాల గృహ సముదాయం గురించి చర్చిస్తానని తెలిపారు. అలాగే సంబంధిత శాఖామంత్రి తో కూడా ఈ విషయంపై చర్చించి, ఉండి నియోజకవర్గ పరిధిలో వీలైనంత త్వరగా బలహీన వర్గ గృహ నిర్మాణ సముదాయాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటానని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.
400 నుంచి 600 ఎకరాల్లో పంట నష్టం… 400 మందికి పునరావాస కేంద్రం ఏర్పాటు
ఉండి నియోజకవర్గ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో 400 నుంచి 600 ఎకరాలలో పంట నష్టం జరిగిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. పంట నష్టం పై ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు, వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి సత్వరమే పంటకు నష్టపరిహారాన్ని అందజేసే విధంగా చొరవ తీసుకోవడం జరిగిందన్నారు. గుమ్మలూరు, సిద్దాపురం, చిన్న మిల్లిపాడు, ఆకివీడులోని సమతా నగర్ లో కొంతమేర ముంపుకు గురైనట్టు రఘురామకృష్ణం రాజు తెలిపారు.
గ్రామాల్లోకి నీరు పెద్దగా రాలేదని, వచ్చిన ప్రాంతంలో 400 మందిని పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందన్నారు. వారికి భోజన సదుపాయాలన్నీ తన పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కొనుగోలు పెద్ద ఎత్తున అవినీతి జరిగిన మాట నిజమేనని ఒక ప్రశ్నకు సమాధానం రఘురామకృష్ణం రాజు అంగీకరించారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చూసుకుంటారని తెలిపారు. గంజాయి వల్ల బహిరంగ ప్రదేశాలలో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆయన, గంజాయి సరఫరాను అరికట్టే విధంగా జిల్లా ఎస్పీ తో పాటు, డీఎస్పీ తో తరచూ మాట్లాడుతూనే ఉన్నట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు.