• ఈ ప్రభుత్వంలో బీసీలకు పూర్వ వైభవం
• ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంత్యోత్సవం
• రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ ఎస్.సవిత
అమరావతి : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్టీయే ప్రభుత్వ లక్ష్యమని, టిడిపి ప్రభుత్వానికి బీసీలు బ్యాక్ బోన్ అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అని తెలిపారు. విజయవాడ నగరం గొల్లపూడిలోని బీసీ భవన్ లో మంగళవారం నిర్వహించిన విశ్వకర్మ జయంత్యోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన సభలో మంత్రి సవిత మాట్లాడారు. ప్రపంచ తొలి వాస్తు శిల్పిగా… సృష్టికర్తగా విశ్వకర్మ పేరుగాంచారన్నారు. చేతి వృత్తులకు ఆద్యుడిగానూ విశ్వకర్మను ఆరాధిస్తున్నామన్నారు. విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారన్నారు. ఈ మేరకు జీవోను కూడా విడుదల చేశారన్నారు. ఆయనే స్వయంగా విశ్వకర్మ జయంత్యోత్సవంలో పాల్గొనాలని భావించారన్నారు. అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోయారన్నారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల పార్టీగా ముద్ర పడిందన్నారు. అన్న ఎన్టీ రామారావు బీసీల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా టీడీపీని స్థాపించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ఎన్నో కార్యక్రమాలను, పథకాలను అమలు చేశారన్నారు.
2019కు ముందు బీసీల అభ్యున్నతి కోసం అమలు చేసిన పథకాలన్నింటినీ మరోసారి వర్తింపజేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. బీసీ కార్పొరేషన్ ను పటిష్టపర్చి, వెనుకబడిన తరగతులకు వెన్నుదన్నుగా చంద్రబాబు ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు.
బీసీలకు పూర్వ వైభవం : మంత్రి సవిత
బడుగులు, బలహీన వర్గాల సహకారంతో చంద్రబాబు మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో బీసీలకు పూర్వ వైభవం వచ్చిందని మంత్రి సవిత తెలిపారు. గత ప్రభుత్వంలో బీసీలు పోరాటం చేశారని, ఇప్పుడు వారి అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రారంభమైందని తెలిపారు. ఎన్నికల ముందు బీసీల అభ్యున్నతి కోసం ఇచ్చిన ప్రతి హామీకీ సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారన్నారు. బీసీ కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేస్తామని, యువతకు స్వయం ఉపాధి లక్ష్యంగా రుణాలు అందజేస్తామని వెల్లడించారు.
బీసీలందరికీ న్యాయం జరిగేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మంత్రి స్పష్టంచేశారు. విశ్వబ్రాహ్మణుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రసంగ సమయంలో సభికులతో కలిసి మంత్రి సవిత జై బీసీ…జై విశ్వకర్మ భగవాన్ అంటూ నినాదాలు చేశారు.
అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించారు. మాజీ మంత్రి నెట్టం రఘురామయ్య మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. అనంతరం మంత్రి సవితను విశ్వబ్రాహ్మణులు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, విశ్వకర్మ కార్పొరేషన్ జేఎండీ తనూజరాణి, జె ఎం డి జి. ఉమాదేవి, హై కోర్ట్ అడ్వకేట్ చేవూరి రామ స్వామి, బిసి సెల్ జనరల్ సెక్రటరీ వీరంకి గురుమూర్తి, నాయకులు తాత జయప్రకాశ్ నారాయణ, సింహాద్రి కనకాచారి, సహా పలువురు కార్యకర్తలు, అధికారులు, అధిక సంఖ్యలో విశ్వ బ్రాహ్మణులు, బీసీలు పాల్గొన్నారు.