– భిన్న కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రచారం కోసం డ్రోన్‌లు
– నగర పాలక సంస్ధలలో పైలెట్ ప్రాజెక్టు
– స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు
విజయవాడ: స్వచ్చాతా హీ సేవ లక్ష్య సాధనలో డ్రోన్ సేవలను వినియోగించుకోనున్నట్లు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద రాష్ట్రంలోని వివిధ నగర పాలక సంస్ధలలో డ్రోన్ సేవలను ప్రతిపాదించామన్నారు.
ఎపి డ్రోన్స్ కార్పొరేషన్‌తో మద్దతుతో పరిశుభ్రత లక్ష్య యూనిట్ల గుర్తింపు, ఇతర కార్యక్రమాల కోసం డ్రోన్ సేవలు ప్రవేశపెడుతున్నామన్నారు. తిరుపతి, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగర పాలక సంస్ధలలో డ్రోన్ సేవలను ఉపయోగించాలని ప్రాధమికంగా నిర్ణయించామని, ఇప్పటికే అయా నగర పాలక సంస్ధలలో వీటి వినియోగం ప్రారంభించామన్నారు.
స్వచ్చాతా హీ సేవ నేపధ్యంలో పరిశుభ్రత లక్ష్య యూనిట్ల ఎంపికతో పాటు పనులు పూర్తి అయిన తరువాత తనిఖీ చేయడానికి డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయని గంధం చంద్రుడు పేర్కొన్నారు. ప్రమాణాల మేరకు పరిశుభ్రత లక్ష్య సాధన కోసం నిర్ధేశించుకున్న ప్రదేశాలు శుభ్రం చేయబడ్డాయా, లేదా అన్న విషయాలను పర్యవేక్షించడానికి స్వచ్చాతా హీ సేవ కార్యక్రమాలలో భాగంగా డ్రోన్స్ సేవలు ఉపయోగించబడుతున్నాయన్నారు.
మరోవైపు అక్టోబరు 2 వరకు జరిగే విభిన్న కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రచారం కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తామని, తద్వారా మెరుగైన సేవలు అందుతాయని అన్నారు. డ్రోన్‌లను ఉపయోగించి సేకరించిన డేటాను భవిష్యత్తు అవసరాల కోసం డాక్యుమెంటేషన్ చేస్తామని, మరోవైపు భారత ప్రభుత్వం స్వచ్చాతా హీ సేవ కార్యక్రమం కోసం రూపొందించిన ప్రత్యేక పోర్టల్‌తో ఈ డ్రోన్లను అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందేలా ప్రయత్నిస్తామని చంద్రుడు వివరించారు.