Suryaa.co.in

Andhra Pradesh

సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం

– ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ….
– లోటుపాట్లను సవరించి సంతృప్తికరమైన దర్శన భాగ్యం…
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన

ఇంద్రకీలాద్రి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర పండుగ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో వివిధ శాఖల మధ్య కొన్ని సందర్భాల్లో సమన్వయం లోపించడం వల్ల తలెత్తిన లోటుపాట్లను గుర్తించి, చక్కదిద్దామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఘాట్ రోడ్డులోని క్యూలైన్లను పరిశీలించి, క్యూ లైన్ లో ఉన్న వారికి అవసరమైన సహాయం అందించేందుకు ఏర్పాటుచేసిన వ్యవస్థలను పరిశీలించారు. సాధారణ భక్తులకు మంచినీరు, పసి పిల్లలకు అందజేయాల్సిన వేడి పాలు కూడా సక్రమంగా అందుతున్నాయా? అని భక్తులను ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది భక్తులు దర్శనంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. వారి సమస్యలు విని, అధికారులతో దర్శనం ఆలస్యం అయ్యేందుకు గల కారణాలను తెలుసుకున్నారు.

సాధారణ రోజుల కంటే శుక్రవారం రోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, కొన్ని సందర్భాల్లో భక్తులు సహనంతో వ్యవహరించి ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతృప్తికరమైన దర్శన అనుభవాన్ని అందించేలా జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధారణ భక్తులకు దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించిన నేపథ్యంలోనే కొంతమంది ప్రముఖుల కోసం దర్శన సమయాలను నియంత్రించామని వివరించారు. వారు కూడా తమకు కేటాయించిన సమయానికి దర్శనం చేసుకునేందుకు రావాలని సూచించారు. ప్రముఖులను పున్నమి ఘాట్ నుంచి కొండపైకి తెచ్చేందుకు ఏర్పాటుచేసిన వాహనాలలో గుర్తించిన చిన్న లోపాలు వెంటనే చక్కదిద్దామన్నారు.

వృద్ధులు, వికలాంగుల కోసం వారికి కేటాయించిన సమయంలోనే దర్శనానికి రావాలని సూచించారు. 300 రూపాయలు, 500 రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన భక్తులతో కలెక్టర్ మాట్లాడారు. చాలామంది భక్తులు లైన్ వేగంగానే కదులుతోందని తెలిపారు. శని, ఆదివారాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శన భాగ్యం కల్పించడమే అంతిమ లక్ష్యంగా అధికారులకు కృషి చేస్తున్నారన్నారు.

లడ్డు విక్రయ కేంద్రాలని సృజన పరిశీలించారు. ఏర్పాట్ల పర్యవేక్షణ అనేది నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. షిఫ్టుల వారీగా ఉద్యోగులు భక్తుల సౌకర్యాలపై సమీక్షిస్తూ… సత్వర దర్శనం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ జగన్మాతను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధ స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం, అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని బహూకరించారు.

LEAVE A RESPONSE