– దేశ వ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధుల హాజరు
– రెండు రోజుల సదస్సు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
– ఔత్సాహికుల కొరకు డ్రోన్ హ్యాకథాన్
– నేటి నుంచి ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
– ముగ్గురు విజేతలకు నగదు బహుమతి
– 22న సాయంత్రం కృష్ణా తీరంలో అతి పెద్ద డ్రోన్ షో నిర్వహణ
– పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్, డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ల వెల్లడి
– డ్రోన్ జాతీయ సదస్సు లోగోల ఆవిష్కరణ
అమరావతి: ఈ నెల 22-23వ తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 జాతీయ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ తెలిపారు.
ఆదివారం ఫైబర్‌నెట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సదస్సుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ను దేశానికే డ్రోన్స్ రాజధానిగా మార్చాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమని, సీఎం ఆశయాలకనుగుణంగా ఈ డ్రోన్ సదస్సు నిర్వహణ ఉంటుందన్నారు. 22వ తేదీ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఈ సదస్సు జరుగుతుందన్నారు.
ఈ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహననాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర పెట్టుబడులు, మౌలికసదుపాయల శాఖ మంత్రి బీసీ జనార్థనరెడ్డి కూడా సదస్సులో పాల్గొంటారన్నారు. డ్రోన్ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తవంగా అందుబాటులో ఉన్న సాంకేతిక సదుపాయాలు, మనకు దైనందిన జీవితంలో, పాలనలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై ఈ సదస్సులో మేథోమదనం జరుగుతుందన్నారు.
ఈ సదస్సు కేవలం సదస్సులాగానే కాకుండా డ్రోన్ అప్లికేషన్స్ కు సంబంధించి ఏం చేయాలనేదానిపై ఒక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. డ్రోన్ ద్వారా ఒక దృశ్యాన్ని చిత్రీకరించినప్పుడు దానికి సంబంధించి అనలిటికల్స్ ఇప్పుడు సరిగ్గా ఎక్కడా చేయడం లేదని దీనికి సంబంధించి ఏం చేయాలి అనే దానిపైన ఒక పరిష్కారం కనుగొనే దిశగా సదస్సు నడుస్తుందన్నారు.
వరదలు వచ్చినప్పుడు అక్కడ ఎంత మేర నీరు ఉంది, నీటి లోపల ఏముంది, జనసమూహం ఉన్న చోట ఎంత మంది జనసమూహం ఉన్నారు, అందులో పురుషులెంతమంది, మహిళలెంతమంది, చిన్నపిల్లలెంతమంది ఉన్నారు లాంటి విశ్లేషణ చేసే సామర్థ్యం ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు.
ముంబాయి, మద్రాస్, తిరుపతి ఐఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల భాగస్వామ్యంతో ఇలాంటి సమస్యలపై డ్రోన్ కార్పొరేషన్ అధ్యయనం చేసి ఒక పరిష్కారం తీసుకొచ్చే దిశగా పనిచేస్తోందన్నారు. అమరావతి డ్రోన్ సమ్మిట్ కు దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరవుతారని తెలిపారు. 400 మంది డ్రోన్స్ రంగంలో అనుభవమున్న సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు కూడా హాజరవుతారన్నారు. ఈ సదస్సులో మన రాష్ట్రంలో డ్రోన్స్ రంగంలో ఉత్సుకత చూపే అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నామని తెలిపారు.
5 వేల డ్రోన్స్ తో డ్రోన్ షో
సదస్సులో భాగంగా 22వ తేదీ సాయంత్రం కృష్ణా నది తీరంలో భారీ ఎత్తున డ్రోన్ షో నిర్వహిస్తున్నట్లు సురేష్ కుమార్ వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 2500 డ్రోన్లతోనే ఇలాంటి ప్రదర్శన చేశారని, అయితే ఇప్పుడు అంతకు రెట్టింపు స్థాయిలో డ్రోన్ షోను ప్రతిష్ఠాత్మకంగా రికార్డు స్థాయిలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
ఈ షో తిలకించడానికి ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. మన రాష్ట్రంలో తొలిసారిగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సు విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు.
హ్యాకథాన్ నమోదు చేసుకోండి
డ్రోన్ సమ్మిట్ సందర్భంగా ఔత్సాహికుల కోసం డ్రోన్ హ్యాకథాన్ నిర్వహిస్తున్నామని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చని హ్యాకథాన్‌లో పాల్గొనదలచిన వారు ఆన్‌లైన్ లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ఈ నెల 15వ తేదీలోపు ఔత్సాహికులు ఇందులో నమోదు చేసుకోవచ్చని, 20వ తేదీలోపు ఔత్సాహికుల నమోదు చేసిన ప్రతిపాదనలను మదింపు చేసి విజేతలను ఎంపిక చేస్తారని చెప్పారు. ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వతీయ బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి 1 లక్ష నగదు బహుమతి ఇస్తామన్నారు.
ఈ బహుమతులను సదస్సు ప్రారంభోత్సం రోజు ముఖ్యమంత్రి చేతులమీదుగా బహుకరిస్తామన్నారు. ఔత్సాహికులు ఈ వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. https://amaravatidronesummit.com/
లోగో ఆవిష్కరణ
అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు సంబంధించిన లోగో, డ్రోన్ హ్యాకథాన్ కు సంబంధించి లోగోలు, సదస్సు ఆహ్వాన పత్రికలను అధికారులు ఈ సమావేశంలో విడుదల చేశారు.