Suryaa.co.in

Telangana

సైకిలెక్కనున్న తీగల

– అదే దారిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, కృష్ణారావు?
– చంద్రబాబుతో భేటీ అయిన తీగల, మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి
– బాబు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చేరికకు ముహుర్తం
– పాతకాపులందరినీ మళ్లీ పార్టీలోకి తీసుకువ స్తానన్న తీగల
– తెలంగాణలో సైకిల్‌ను మళ్లీ పరుగులు తీయిస్తానన్న తీగల కృష్ణారెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ వైపు మళ్లీ చేరికలు మొదలవుతున్నాయి. వివిధ కారణాలతో పార్టీని వీడిన పాతకాపులంతా తిరిగి తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే, నగర మాజీ మేయర్, హుడా మాజీ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి తొలి అడుగువేశారు. ఆయన తాజాగా హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత-సీఎం చంద్రబాబునాయుడు నివాసంలో కలిశారు. హైదరాబాద్ నగర ప్రజలకు సుపరిచతమైన తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరడంతో, సహజంగానే నగరంలో పార్టీ మళ్లీ పరుగులు తీయడం ఖాయమన్న భావన ఏర్పడింది.

తాను టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాన న్న తీగల కోరికను బాబు అభినందించారు. తాను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తిరిగి చర్చిద్దామని బాబు ఆయనకు సూచించారు. ఆ సందర్భంగా తీగల వియ్యంకుడైన ఎమ్మెల్యే-మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు కూడా బాబుతో చర్చించారు. తన మనవరాలు శ్రేయారెడ్డి పెళ్లికి హాజరుకావల్సిందిగా మల్లారెడ్డి సీఎం చంద్రబాబుకు పెళ్లికార్డు అందించారు. కాగా కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు కూడా త్వరలో టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. పాతకాపులను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ఈ సందర్భంగా తీగల చేసిన ప్రతిపాదనను చంద్రబాబు అంగీకరించి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

బయటకు వచ్చిన తర్వాత తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ ఆశీర్వాదంతో రాజకీయాల్లో వచ్చిన తనను, చంద్రబాబు ప్రోత్సహించడం వల్లే ఈస్థాయికి వచ్చానన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబే కారణమని, తెలంగాణ ప్రజలకు తిరిగి తెలుగుదేశం అవసరమని స్పష్టం చేశారు. తెలంగాణలో బడుగుబలహీన వర్గాలకు గుర్తింపునిచ్చింది టీడీపీనే అని గుర్తు చేశారు.

చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో అనేమంది సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలయ్యారని గుర్తు చేశారు. తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిలో ప్రజలకు సామాజికన్యాయం అందించే టీడీపీ అవసరం ఎంతో ఉందన్నారు. పార్టీని వీడిన పాతకాపులను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ‘‘నాకు జీవితంలో ఇక ఎలాంటి కోరికలు లేవు. చంద్రబాబు ప్రోత్సాహంతో మేయర్, హుడా చైర్మన్, నగర అధ్యక్ష పదవులు నిర్వహించా. ఇప్పుడు ఇక నాకు రాజకీయ జీవితం ఇచ్చిన టీడీపీని తెలంగాణలో అగ్రస్థానంలో నిలబెట్టడమే నాముందున్న లక్ష్యం’’ అని తీగల వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE