Suryaa.co.in

Editorial

‘కమలం’లో గుంటూరు కారం

  • ఎమ్మెల్సీ కోటాలో ఏదీ వాటా?

  • రాజధానిలో బీజేపీ భాగస్వామ్యం ఏదీ?

  • హైదరాబాద్, ఢిల్లీ మాదిరి వ్యూహమేదీ?

  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటివ్వరా?

  • సీటు కావాలని నాయకత్వం టీడీపీని అడగరేం?

  • అమరావతిలో బీజేపీ అవసరం లేదా?

  • కేంద్రపథకాల శిలాఫలకాలపై బీజేపీ ప్రతినిధులకు చోటు అవసరం లేదా?

  • నాయకత్వానికి అమరావతి ప్రాధాన్యం పట్టదా?

  • గుంటూరు నుంచి నెల్లూరు వరకూ పార్టీకి ప్రాతినిధ్యం ఏదీ?

  • ‘కమలం’ కార్యకర్తల కన్నెర్ర

( మార్తి సుబ్రహ్మణ్యం)

పొత్తు ధర్మం పాటించే క్రమంలో టీడీపీపై ఒత్తిడి తెచ్చి పార్టీ నేతలకు భాగస్వామ్యం కల్పించడంలో.. పార్టీ నాయకత్వం విఫలమవుతోందన్న విమర్శ బీజేపీ శ్రే ణుల్లో వినిపిస్తోంది. ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి మిత్రపక్షమైన జనసేనకు ఇచ్చిన టీడీపీ నాయకత్వం.. త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఎందుకు కేటాయించదని, రాజధాని అయిన ఉమ్మడి గుంటూరు జిల్లా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో తమ పార్టీ నాయకత్వ వైఫల్యంపై, గుంటూరు-కృష్ణా జిల్లా కమలం కార్యకర్తలు కారాలు మిరియాలు నూరుతున్నారు.

త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. గుంటూరు-కృష్ణా జిల్లా స్ధానాన్ని తమకు కేటాయించాలని పట్టుపట్టడంలో, రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందన్న విమర్శలు వెల్లుతున్నాయి. అమరావతి రాజధానిగా ఉన్న ప్రాంతంలో పార్టీ భాగస్వామ్యం అవసరం లేదా? రానున్న ఐదేళ్ల కాలంలో కేంద్ర నిధులతో అమరావతిలో ప్రారంభమయ్యే అనేక ప్రాజెక్టుల శిలాఫలకాలపై, బీజేపీ ప్రజాప్రతినిధుల పేర్లు ఉండటం రాష్ట్ర నాయకత్వానికి ఇష్టం లేదా? రాజధాని జిల్లాలో పార్టీ బలంగా ఉండాలని కోరుకోవటం లేదా? అంటూ గుంటూరు-కృష్ణా జిల్లాల బీజేపీ శ్రేణులు రాష్ట్ర నాయకత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రెండు జిల్లాల నియోజకవర్గాల బీజేపీ నేతలు.. రాష్ట్ర స్థాయి నేతలపై సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు లేకుండా పోయింది. మీ అభిప్రాయాలను రాష్ట్ర అధ్యక్షురాలి దృష్టికి తీసుకువెళతామని చెప్పి తప్పించుకుంటున్న పరిస్థితి.

గత ఎన్నికల్లో గుంటూరు-కృష్ణా జిల్లాల నుంచి సుజనాచౌదరి, కామినేని శ్రీనివాసరావు మినహా బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఎన్నికల్లో గుంటూరు జిల్లాకు అసలు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. అమరావతి రాజధానిగా ఉన్న ప్రాంతమంతా దాదాపు గుంటూరు జిల్లా పరిథిలోకే వస్తుంది. అలాంటి ఇప్పటి విభజిత గుంటూరు జిల్లా, అప్పటి ఉమ్మడి జిల్లా అయిన గుంటూరు జిల్లాలో బీజేపీ ప్రాతినిధ్యం సున్నా. అమరావతి రాజధానిగా ఉండాలని గుంటూరు జిల్లా బీజేపీ పోరాడినప్పటికీ, ఎన్నికల సమయంలో వచ్చిన అవకాశాలు సున్నా.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి పొత్తులో భాగంగా ఒక్క సీటు కూడా కేటాయించలేదు. కృష్ణా జిల్లాలో ఇచ్చిన రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఉమ్మడి గుంటూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల్లో ఒక్క సీటులో కూడా పోటీ చేసే అవకాశం దక్కలేదు. నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకప్పుడు, గుంటూరు జిల్లా సీనియర్ నేత జూపూడి యజ్ఞనారాయణ విజయం సాధించిన సందర్భం లేకపోలేదు. నిజానికి బీజేపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో విజయం సాధించనప్పటికీ, తొలి నుంచీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం గెలుస్తూ వస్తోంది. రామారావు, పివి చలపతిరావు, జూపూడి యజ్ఞనారాయణ, మొన్నటి పివి మాధవ్ వరకూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినవారేనని గుర్తు చేస్తున్నారు. అంటే మేధావులు-విద్యావంతుల్లో బీజేపీకి ఆదరణ ఉన్నప్పటికీ, దానిని రాష్ట్ర నాయకత్వాలు సమర్ధవంతంగా వినియోగించుకోవడంలో విఫలమయ్యాయని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో, ఒకటి మిత్రపక్షమైన జనసేనకు కేటాయించగా, మరో స్థానం టీడీపీ తీసుకుంది. దానిపై బీజేపీలో ఎలాంటి అభ్యంతరాలు కనిపించలేదు. అయితే గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా టీడీపీకి కేటాయించడంపై, రెండు జిల్లాల బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం చొరవ చూపి, ఆ స్థానం తమకు కావాలని పట్టుపట్టకపోవడం వల్లనే, ఆ స్థానం నుంచి టీడీపీ పోటీ చేస్తోందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు తప్పనిసరిగా తమకు కావాలని పట్టుబడితే, చంద్రబాబునాయుడు ఎందుకివ్వరని బీజేపీ నేతలు లాపాయింట్లు తీస్తున్నారు.

గత ఎన్నికల్లో కృష్ణా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ అన్ని జిల్లాలకు బీజేపీ ప్రాతినిధ్యం పెరగగా, ఒక్క రాజధాని జిల్లా అయిన గుంటూరులోనే పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నిజానికి గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం మాకు కావాలని మా పార్టీ నాయకత్వం సీఎం గారి దగ్గర పట్టుబడితే ఆయన కచ్చితంగా ఇచ్చేవారు. ఎందుకంటే ఇటీవల ఒక ఎమ్మెల్సీ జనసేన కోటా కింద హరిప్రసాద్‌కు ఇచ్చారు కాబట్టి. అసలు వేమా నాయకత్వం ఏమీ అడగకపోతే చంద్రబాబు మాకు సీటు ఎలా ఇస్తారు? మేం టీడీపీని ఎలా తప్పుపట్టగలం?

రాజధాని జిల్లాలో పార్టీ ప్రాతినిధ్యం ఉండాలని నాయకత్వం కోరుకుంటున్నట్లు లేదు. రేపు వేల కోట్ల రూపాయలతో అమరావతిలో ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆ శిలాఫలకాలపై పార్టీ ప్రతినిధుల పేర్లు ఉండాలని భావిస్తే, నాయకత్వం గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధి మా పార్టీగా ఉండాలని చంద్రబాబు దగ్గర గట్టిగా పట్టుపట్టేది. అలా ఒత్తిడి చేయలేదంటే నాయకత్వానికి, గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ అభ్యర్ధిగా ఉండటం ఇష్టం లేదని తేలిపోతుంద’ని పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు.

ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు కూడా బీజేపీ, రాజధాని నగరమైన హైదరాబాద్‌పైనే దృష్టి సారించిన విషయాన్ని గుంటూరు జిల్లా నేతలు గుర్తు చేస్తున్నారు. అందువల్లనే ఇప్పుడు హైద రాబాద్ సిటీలో, బీజేపీ బలమైన పార్టీగా ఆవిర్భవించిందని చెబుతున్నారు. టీడీపీతో కలసి పోటీ చేసినప్పుడు, కేవలం గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఐదుగురు ఎమ్మెల్యేలు గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

బీజేపీ 300 పైచిలుకు స్థానాలు గెలిచినప్పటికీ.. దేశ రాజధాని ఢిల్లీలో ప్రాతినిధ్యం లేకపోవడంపై ప్రధాని మోదీ తరచూ అసంతృప్తి వ్యక్తం చేసే వారన్న విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలోనయినా దాని రాజధానిలో బలపడటమే బీజేపీ లక్ష్యమని స్పష్టంగా తెలిసినపప్పటికీ, తమ నాయకత్వ అసమర్థత వల్లే గుంటూరు జిల్లాకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావడం లేదని పెదవి విరుస్తున్నారు.

నిజానికి గత ఎన్నికల్లో.. కృష్ణా, గోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి బీజేపీకి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఏర్పడింది. కానీ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు. తాజా నామినేటెడ్ పంపకాల్లో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన, లంకా దినకర్‌కు కార్పొరేషన్ చైర్మన్ అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కృష్ణా-గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం బీజేపీకి వచ్చేలా, రాష్ట్ర నాయకత్వం టీడీపీపై ఒత్తిడి తీసుకురావాలన్న డిమాండ్ బీజేపీ అమరావతి రాజధాని జిల్లా నేతల నుంచి వినిపిస్తోంది.

టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు విపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించనందున, నాయకత్వం తన పలుకుబడి వినియోగించాలని పార్టీ సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A RESPONSE