Suryaa.co.in

Entertainment Telangana

కోర్టుకు వచ్చిన నాగార్జున

– వాంగ్మూలం నమోదు

హైదరాబాద్: హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, మేనకోడలు యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు.

నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్‌మెంట్‌ను నాంపల్లి కోర్టు రికార్డ్ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.

తన కుటుంబంతో పాటు నాగచైతన్య-సమంత విడాకుల అంశంపై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టుకు నాగార్జున తెలిపారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన వాంగ్మూలం ఇచ్చారు.

రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని, అన్ని టీవీ ఛానళ్లలోనూ ఇది ప్రసారమైందని వెల్లడించారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన మంత్రి పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వాంగ్మూలం సందర్భంగా కోరారు.

మా కుటుంబం మొత్తం షాక్ కు గురైంది: నాగ్ మేనకోడలు సుప్రియ వాంగ్మూలం
“బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్ల సమంత, నాగచైతన్య విడాకులు జరిగాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. కేటీఆర్ వద్దకు సమంతను పంపించాలని అడిగితే దానికి సమంత ఒప్పుకోలేదని, అందుకే విడాకులు తీసుకుందని మంత్రి చెప్పారు. ఈ వ్యాఖ్యలతో మా కుటుంబం మొత్తం షాక్ కు గురైంది. మంత్రి వ్యాఖ్యలు కొన్ని టీవీ ఛానల్స్ లో చూశా. మరుసటి రోజు వార్తాపత్రికల్లో వార్తలు వచ్చాయి. మంత్రి వ్యాఖ్యల కారణంగా మా కుటుంబం ఎంతో మనోవేదనకు గురైంది”అన్నారు.

LEAVE A RESPONSE