Suryaa.co.in

Andhra Pradesh

అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, జనరేటర్ల ఖర్చు 23 లక్షలే

– 4.06 లక్షల బాధితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
– రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్

అమరావతి: రాష్ట్రంలో ఈ మధ్య సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన దాదాపు 4.06 లక్షల మంది బాధితులకు నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లించినట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సుమారుగా రూ.602 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉందని అంచనావేయగా, అందులో రూ.601 కోట్లను ఇప్పటికే చెల్లించడం జరిగిందని, మిగిలిన సొమ్మును కూడా ఆధార్ సీడింగ్ తదుపరి తక్షణమే చెల్లించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

వరద నష్టంపై అంచనా వేసేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, వంగలపూడి అనిత గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడి కేవలం 115 రోజులు అవుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రజలకు ప్రతి రోజూ ఏదో మంచి చేయాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సారధ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బంది ఒక టీమ్ లాగా అహర్నిశలూ కృషిచేయడం జరుగుతుందన్నారు.

ఊహించని విధంగా బుడమేరు విపత్తుతో విజయవాడ అతలాకుతలమైందన్నారు. అయినా కూడా నిరాశ చెందక సీఎం చంద్రబాబు సారధ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బంది ఒక టీమ్ లాగా పనిచేయడం జరిగిందన్నారు. 10 రోజుల్లోనే విజయవాడలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వరద నష్టపరిహారం కూడా చెల్లించామన్నారు.

గత ప్రభుత్వంలో వరద సాయంగా రూ.3 – 4 వేలు ఇస్తే, ఇప్పుడు దానిని రూ.25 వేలకు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు. హెక్టారుకు రూ.10 వేలు చేసి సకాలంలో అందరికీ నష్టపరిహారం అందించామన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఒక్క పిలుపుతో పలువురు దాతలు ముందుకొచ్చి, దాదాపు రూ.400 కోట్ల విరాళంగా ఇచ్చారంటే అది చంద్రబాబుపై ప్రజలకున్న నమ్మకమన్నారు. అందులో ఇప్పటికే దాదాపు రూ.252 కోట్లు సొమ్ము డిజాస్టర్ మేనేజ్మెంట్ ఖాతాలో జమ అయినట్లు ఆయన తెలిపారు.

అయితే ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి దుష్ప్రచారం చేస్తూ తప్పుడు కథనాలను తమ పత్రిలో ప్రచురిస్తున్నారని తప్పు పట్టారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, జనరేటర్లు, విద్యుత్ తదితర వాటిపై చేసిన ఖర్చుపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాటికి చేసింది రూ.23 లక్షలని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ జిల్లాలో ముంపుకు గురైన ప్రాంతాల్లో బాదితుల సహాయార్థం మొత్తం చేసిన ఖర్చు రూ.139.44 కోట్లు అని వెల్లడించారు. 32 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బందితో కలిసి పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారన్నారు.

ఎంఎస్ఎంఈ యజమానులకు సైతం బ్యాంకులతో మాట్లాడి సహాయం చేస్తున్నారని తెలిపారు. గ్యాస్ స్టవ్‌లు, ఫ్రిజ్‌లు, టీవీలు, బైక్‌లు, కార్లు ఏం చెడిపోయినా వారందరికీ నష్టపరిహారం ఇచ్చామని, చివరికి వరదల్లో తోపుడు బళ్లు కోల్పోయిన వారికి కూడా ప్రత్యామ్నాయంగా తోపుడు బళ్లు అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ నాయకుడు వరద విరాళంగా ప్రకటించిన రూ.కోటి ఇవ్వలేదని, మరి ఆ రూ.కోటిని ఏవిధంగా ఖర్చు చేశారో, ఎవరికిచ్చారో కూడా తెలియదన్నారు.

పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. ఈ మధ్య రాష్ట్రంలో సంబవించిన వరదు విపత్తు సందర్బంగా నష్టపోయిన బాదితులకు దాదాపు రూ.601 కోట్ల మేర అనేక విధములుగా లబ్దిచేకూర్చడం జరిగిందన్నారు. అయితే అందులో రూ.534 కోట్లు దుర్వినియోగం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి విమర్శిస్తూ, తన పత్రిలో కథనాలు వ్రాయించడం విడ్డూరంగా ఉందన్నారు. వరద బాదితులను ఆదుకొనేందుకు ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే మొత్తం రూ.139.44 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, అందులో తాత్కాలిక వసతికై రూ.8.42 కోట్లు, ఆహారానికై రూ.92.51 కోట్లు, త్రాగునీటికై రూ.11.22 కోట్లు, మెడికల్ కేర్ కై రూ.4.55 కోట్లు, శానిటేషన్ , పునరావాస కేంద్రాలకై రూ.20.56 కోట్లు, మిగిలినవి ఇతరములకు ఖర్చు చేయడం జరిగిందన్నారు.

రోజుకి 12 లక్షల ఫుడ్ ప్యాకెట్లను, 30 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీచేయడం జరిగిందన్నారు. టాయిలెట్లకు పోవడానికి నీళ్లు లేకపోతే మేము పంపిణీ చేసిన వాటర్ బాటిల్స్ తోనే వారు టాయిలెట్స్ కు వెళ్లడం జరిగిందన్నారు. ఇంత పెద్ద ఎత్తున వరదలు సంభవించిన సరే, ఎటువంటి అంటు వ్యాధులు ప్రభలకపోవడానికి తాము పారిశుద్ధ్య విషయంలో తీసుకున్న ప్రత్యేక చర్యలే కారణమన్నారు.

పారిశుద్ధ్య పనికై దాదాపు ఏడు వేల మందిని బయటి నుండి తెప్పించడమే కాకుండా మరో మూడు వేల మంది మున్సిపల్ సిబందిని కలుపుకుని, మొత్తం 10 వేల మంది తో రేయింబవళ్లు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయబట్టే, ఎటు వంటి అంటు వ్యాధుల ప్రభల్లేదన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫైర్ ఇంజన్లను అన్నింటినీ విజయవాడకు తెప్పించి, ఇళ్లలో కూడా క్లీన్ చేయించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశించిన వెంటనే 3.83 లక్షల కుటుంబాలకు రూ.572 కోట్లు, వెంటనే వారి ఖాతాల్లో జమచేయడం జరిగిందని, ఇప్పుడు ఆథార్ ఫీడింగ్ అయిన తదుపరి మొత్తం 4.06 లక్షల మందికి రూ.600 కోట్లు జమచేయడం జరిగిందన్నారు.

హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడూ రాని విపత్తు, వరద రూపంలో విజయవాడలో వచ్చిందన్నారు. 10 రోజులపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ, మార్గనిర్దేశం చేస్తూ సాధారణ పరిస్థితికి తీసుకొచ్చారన్నారు.

రోడ్లు, ఇళ్లల్లో పేరుకున్న బురదను ఫైరింజల ద్వారా శుభ్రం చేయించారని తెలిపారు. ఈవిషయంలో ఫైర్ సేఫ్టీ, మున్సిపల్ సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నా అన్నారు. వరదసాయంగా మొత్తం ఖర్చు అయింది రూ.601 కోట్లు అయితే రూ.300 – రూ.400 కోట్ల అవినీతి జరిగిందని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు.

ఆహారానికి రూ.92.5 కోట్లు, తాగునీటికి రూ. 11.2 కోట్లు, మెడికల్ కేర్ కు రూ. 4.55 కోట్లు, పారిశుద్ద్యానికి రూ. 20.56 కోట్లు ఖర్చయిందన్నారు. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాల్లో రూ.139.44 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. వరదలతో తీవ్రంగా నష్టపోతే ఆదుకోవాల్సింది పోయి , విమర్శలు చేయడం సరికాదని.. అవసరమైతే ఆరోపణలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

వరద విరాళంపై కూడా ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. దాతలు తమ విరాళాలను చెక్కులు, డీడీల రూపంలో అందించారని వీటికి అన్ని లెక్కలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆరోపణలు చేసేవారు అవసరమైతే ఆర్టీఐకి అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు.

రెవెన్యూ శాఖ స్పెషల్ సి.ఎస్. ఆర్.పి.సిసోడియా, ఏపి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE