Suryaa.co.in

Andhra Pradesh

ఈవీఎంలపై ఇంకా ఎన్ని యూ టర్న్‌లు?

– 2014 ఎన్నికల తర్వాత ఈవీఎంలపై అనుమానాలు
– దేశవ్యాప్తంగా అదే పరిస్థితి. ప్రజల్లో అనేక సందేహాలు
– వాటిని నిర్వహించే వ్యవస్థలు నోరు మెదపడం లేదు
– బ్యాలెట్‌ ఎన్నికలతోనే ప్రజాస్వామ్యం మరింత స్ఫూర్తి
– వ్యవస్థలు బలపడాలి. ప్రజాస్వామయం విరాజిల్లాలి
– అందుకే జగన్‌ ఆ ట్వీట్‌ చేశారు
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మెరుగు నాగార్జున

తాడేపల్లి: ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై లెక్కలేనన్ని సార్లు యూటర్న్‌ తీసుకున్న చంద్రబాబు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతుండటం సిగ్గు చేటని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. బీజేపీతో కలసి ఉంటే ఓ మాట, లేకుంటే మరో మాట.. ఎన్నికల్లో గెలిస్తే ఓ మాట, ఓడితే మరో మాట ఫిరాయించే చంద్రబాబు, మా పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆక్షేపించారు.

2014 ఎన్నికల తర్వాత చాలా పార్టీలు, మేథావులతో పాటు, ప్రజల్లో కూడా ఈవీఎంలపై అనేక సందేహాలు వచ్చాయని గుర్తు చేసిన మెరుగు నాగార్జున, వాటికి హేతుబద్ధతతో సమాధానం చెప్పాల్సిన వ్యవస్థలు మౌనంగా ఉండటం బాధాకరమని అన్నారు. అందుకే ప్రజల్లో వచ్చిన అనుమానాలు తీర్చాడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం, విశ్వాసం పెంచడానికి తమ పార్టీ ప్రయత్నిస్తోందని.. ఆ దిశలోనే అటు ప్రకాశం, ఇటు విజయనగరం జిల్లాల్లో వీవీప్యాట్‌ల లెక్కింపు కోరామని ఆయన వెల్లడించారు.

ఎన్నికలు జరిగి నెలలు గడిచినా, ఆయా జిల్లాల్లో కొన్ని ఈవీఎంలు ఫుల్‌ ఛార్జింగ్‌తో ఉండడం, పోలింగ్‌ ఓట్లు, కౌంటింగ్‌ ఓట్ల మధ్య వ్యత్యాసాలు అనుమానాలు మరింత బలపడేలా చేశాయని చెప్పారు.

తాజాగా హరియాణ ఎన్నికల ఫలితాలు కూడా యావత్‌దేశాన్ని ఆశ్చర్యచకితులను చేశాయన్న మాజీ మంత్రి, ఆ ఫలితాలపై కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలు ప్రస్తావించారు.

అందుకే హరియాణ ఎన్నికల ఫలితాలకు, ఇక్కడ మన రాష్ట్ర ఎన్నికల ఫలితాలకు తేడా లేదని, అక్కడా అవే అనుమానాలు ఉన్నాయని జగన్‌ ట్వీట్‌ చేశారని తెలిపారు. బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరిగితేనే, ప్రజాస్వామ్యం విరాజిల్లుతుందని జగన్‌ పేర్కొన్నారని అన్నారు.

ఇటీవల 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగితే, 530 సీట్లలో వీవీ ప్యాట్‌లకు, పోలైన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉందని ఎన్‌డిఆర్‌ అనే సంస్థ అధ్యయనం చేసి తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. 362 నియోజకవర్గాల్లో 5 లక్షలకు పైగా ఓట్ల తేడా వచ్చిందని, 175 స్థానాల్లో 35,093 ఓట్లు అదనంగా లెక్కించారని తేలినట్లు చెప్పారు.

మన రాష్ట్రంలో పోలైన ఓట్ల ప్రకారం చూస్తే.. ఎంపీ సీట్లలో 14 కూటమికి, 11 వైయస్సార్‌సీపీకి రావాలని ఎన్‌డీఆర్‌ సంస్థ ఏకంగా ఈసీకి నివేదికను పంపిందని మెరుగు నాగార్జున ప్రస్తావించారు. ఇంత స్పష్టమైన ఆధారాలతో, సాంకేతిక అంశాలతో నివేదించినా సరే, ఎన్నికల సంఘం (ఈసీ) నోరు మెదపకపోవడం అనుమానాలను కలిగిస్తోందని ఆయన వెల్లడించారు. ఈ చర్యలన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఉన్న నమ్మకాలను వమ్ము చేస్తాయని స్పష్టం చేశారు. ఇది ఏ మాత్రం సరైన సంప్రదాయం కాదని మెరుగు నాగార్జున చెప్పారు.

LEAVE A RESPONSE