Suryaa.co.in

Andhra Pradesh

క‌ర్నాట‌క‌లో స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీక‌ర‌ణ ఆగిన‌ప్పుడు ఏపీలో ఆగ‌దా?

– కేంద్రానికి చంద్ర‌బాబు అల్టిమేటం ఇవ్వాలి
– స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ ఆపేలా ఉద్యమం. – ప్ర‌జా సంఘాలు, ప్లాంట్ కార్మికుల‌తో క‌లిసి ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌
– వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్య‌మం
– త్వరలో నిరాహార దీక్ష‌లు
– విశాఖపట్నం మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

విశాఖపట్నం: ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ జ‌ర‌ప‌నీబోమ‌ని ప్రకటన ఇస్తారనుకుంటే… త‌న‌కే స్ప‌ష్ట‌త లేద‌ని చెప్ప‌డం ప్రజలను మోసం చేయడమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా హామీలు ఇచ్చిన కూట‌మి పార్టీలు ఇప్పుడు మాట మార్చి మార్చుతున్నారని మండిపడ్డారు. విశాఖ‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ కార్మికుల చేస్తున్న ఉద్య‌మానికి వైఎస్సార్సీపీ అండ‌గా నిల‌బడుతుంద‌ని ఆయన హామీ ఇచ్చారు. విజ‌న్ 2047 గురించి చెప్పే చంద్ర‌బాబుకి, నేడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ ఆపే విజ‌న్ ఎందుకు లేదని నిలదీశారు.

ప‌దేళ్ల పోరాటం, 32 మంది ఆత్మ‌బ‌లిదానాల‌తో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఆంధ్రుడిపై ఉంద‌ని అమర్ తేల్చిచెప్పారు. వైఎస్సార్సీపీ పాల‌న‌లో ప్రైవేటీక‌ర‌ణ జ‌ర‌గ‌కుండా అడ్డుకుంటే, కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వంద రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేయ‌డానికి వేగంగా అడుగులు ప‌డుతున్నాయ‌ని ఆగ్రహించారు.

ఇప్ప‌టికే బ్లాస్ట్ ఫ‌ర్నెస్ మూతప‌డగా… ప‌ర్మినెంట్ ఉద్యోగుల‌కు కూడా స‌రిగా జీతాలు ఇవ్వ‌కుండా, హెచ్ఆర్ఏ సైతం నిలిపివేయడాన్ని తప్పుపట్టారు.

కేవలం ఒక్క రాత్రిలో 4200 మందికి గేట్ పాసులు ర‌ద్దు చేస్తే ఉద్య‌మం ద్వారా తిరిగి సాధించుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు. స్టీల్ ప్లాంట్ విష‌యంలో స్థానిక టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఒక‌లా, సీఎం చంద్ర‌బాబు ఒక‌లా, కేంద్ర మంత్రి మ‌రోలా.. మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కేవలం ఇద్ద‌రు ఎంపీల బ‌లంతో క‌ర్నాట‌క భ‌ద్రావ‌తి స్టీల్ ప్లాంట్ ను ఆ రాష్ట్రం కాపాడుకుంటే, 16 మంది ఎంపీల బ‌లంతో కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిలబెట్టిన చంద్ర‌బాబు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అల్టిమేటం ఇవ్వ‌లేరా అని ప్ర‌శ్నించారు. భ‌ద్రావ‌తి స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం రూ. 15 వేల కోట్లు కేటాయించింద‌ని, ఇంకా నిధులు ఇవ్వడానికి మోడీ హామీ ఇచ్చిన విష‌యాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్లాంట్ ను కాపాడకపోతే కూటమి ఎంపీలు చులకనగా మాట్లాడ్డం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం చ‌త్తీస్‌ఘ‌డ్‌, క‌ర్నాట‌క, గుజ‌రాత్‌ల‌లో ఒక‌లా ఏపీ విష‌యంలో మ‌రోలా వ్య‌వ‌హ‌రించ‌డం దారుణ‌మ‌న్నారు.

స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవ‌డానికి తాము గతంలో ప్ర‌భుత్వ ప‌రంగా చేయాల్సిన‌దంతా చేశామ‌ని, ఇక‌పై వైఎస్సార్సీపీ ఉద్య‌మంలోకి దిగుతుంద‌ని గుడివాడ అమ‌ర్నాథ్ స్ప‌ష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, ప్ర‌జా ఉద్య‌మ సంఘాలతో చ‌ర్చించి త్వరలో ధ‌ర్నాకు దిగుతామ‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చరించారు.

LEAVE A RESPONSE