Suryaa.co.in

Telangana

రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి

– కార్యదర్శులు పూర్తి బాధ్యత వహించి, పాఠశాలలు సందర్శించాలి
– మెస్ చార్జీల పెంపుపై త్వరితగతిన కసరత్తు పూర్తి చేయండి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్: ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు అన్నారు. మంగళవారం బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల కార్యదర్శులతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

బోధన జరుగుతున్న తీరుపై నిపుణులతో పర్యవేక్షణ జరిపించి ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇప్పించాలని కోరారు. విద్యార్థుల మెస్, కాస్మోటిక్స్ బిల్లులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం.. అధికారులు ఈ విషయాలకే పరిమితం కాకుండా బోధనలో నాణ్యతను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

టీచింగ్, లెర్నింగ్, మెటీరియల్ (TLM ) వినియోగం పెంచండి, కంప్యూటర్లు, సైన్స్ ఇతర ల్యాబ్ల వినియోగాన్ని విస్తృతం చేయాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల సెక్రటరీలు క్షేత్రస్థాయిలో ఉండాలి, ప్రతిరోజు ఒక పాఠశాలను పరిశీలించాలి, వెళ్ళామా, వచ్చామా అన్న పద్ధతిలో కాకుండా సగం పూట అక్కడే ఉండి అన్ని రకాల విషయాలను సమీక్షించాలని ఆదేశించారు.

నెలాఖరులోగా కార్యదర్శులు ఎన్ని విద్యాసంస్థలను సందర్శించారు, ఏ ఏ అంశాలను గమనించారు, ఏ చర్యలు చేపట్టారు నివేదిక ఇవ్వాలని అన్నారు. కార్యదర్శులు పర్యటించి సమస్యలు పరిష్కరించడం ద్వారా సిబ్బందికి భరోసా ఏర్పడుతుంది అన్నారు.

ప్రధానంగా అద్దె భవనాల్లో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అద్దె భవనాల యజమాలతో మాట్లాడి ఒప్పందం మేరకు విద్యాసంస్థ భవనంలో అన్ని సౌకర్యాలు కల్పించేలా నేను వెంటనే చర్యలు చేపట్టాలని కార్యదర్శులను ఆదేశించారు. అద్దె భవనాల కిరాయి బిల్లుల పెండింగ్లపై సమీక్షించి.. నిధుల విడుదలకు వెను వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను సందర్శించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించాం, వారు విజిట్ చేసిన సమయంలో స్థానికంగా ఉన్న సమస్యలపై నేరుగా రెసిడెన్షియల్ విద్యాసంస్థల కార్యదర్శిలనే ప్రశ్నిస్తారన్న విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని తెలిపారు.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లోని విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని ఓ నిర్ణయం తీసుకున్నాం. ఈ క్రమంలో సంబంధిత అధికారులు సమావేశమై అన్ని రకాల అంశాలను పరిశీలించి మెస్ ఛార్జీల పెంపుపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్స్, టూటర్ల చార్జీల పెంపు పైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.

సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, రెసిడెన్షియల్ పాఠశాలల సెక్రటరీలు సైదులు, తఫ్సీల్ ఇక్బాల్, సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE