Suryaa.co.in

Editorial

నిద్రపోతున్న నాలుగో సింహం!

– పోలీసులు నాలుగు రాష్ట్రాలు తిరిగినా కనిపించని పానుగంటి చైతన్య
– ఎన్టీఆర్ భవన్‌పై దాడి కేసులో తొలి ముద్దాయి చైతన్య
– ఫలితాల రోజునే గుంటూరు నుంచి పరారీ
– తాజాగా లాయర్లతో కోర్టుకు వచ్చి లొంగుబాటు
– విజయపాల్, అప్పిరెడ్డిని పట్టుకోలేని అసమర్ధత
– అంతకుముందు పిన్నెల్ని అరెస్టులోనూ అదే వైఫల్యం
– విజయపాల్‌కు సొంత శాఖలోనే వార్తాహరులు
– కోర్టుకెళ్లేంతవరకూ కళ్లప్పగించి చూస్తున్న వైనం
– చైతన్య లొంగిపోతే తప్ప పట్టుకోలేని అసమర్ధత
– ఏబీని చీటర్ అని పోస్టు పెట్టిన అధికారికి గోదావరిలో పోస్టింగ్
– బాబును అర్ధరాత్రి నడిపించిన అధికారికి అమలాపురంలో కీలక బాధ్యత
– బోండా ఉమ, జత్వానీ కుటుంబాన్ని వేధించిన అధికారికి గుంటూరు జిల్లాలో పోస్టింగ్
– నిఘా నిద్రపోతోందా? పోస్టింగుల సమయంలో నివేదికలు ఇవ్వదా?
– సోషల్‌మీడియాలో నిప్పులు కక్కుతున్న తమ్ముళ్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే.. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’’- ఇది పోలీసుల పనితనమేమిటో తెలియచేసే సాయికుమార్ సినిమాలోని, ఒక భావోద్వేగ డైలాగ్. అయితే.. ఏపీలో ఇప్పుడు దీనికి కొద్దిగా రివర్సులో జరుగుతోందన్నది, టీడీపీ సోషల్‌మీడియా సైనికుల విమర్శ. అవును.. నాలుగో సింహం కనిపించడం లేదు. బహుశా నిద్ర పోతున్నట్లుంది. అంటూ టీడీపీ ఆఫీసు ధ్వంసం చేసిన కేసులో మొదటి ముద్దాయి అయిన పానుగంటి చైతన్య తప్పించుకుని, తాజాగా కోర్టులో లొంగిపోయిన తీరును దృష్టిలో పెట్టుకుని వ్యంగ్యాస్త్రాలు రువ్వుతున్నారు.

రాష్ట్రంలో పోలీసులు పనిచేస్తున్నారా? లేదా? నిందితులు కోర్టులో లొంగిపోయేవరకూ అరెస్టు చేయకుండా కాలక్షేపం చేస్తున్నారా? నిందితుడి జాడ లాయర్లకు తెలిసినప్పుడు, విస్తృతమైన యంత్రాంగం ఉన్న పోలీసులకు తెలియదా? ఒక పిన్నెల్లి,అప్పిరెడ్డి.. ఇంకో విజయపాల్.. లేటెస్టుగా పానుగంటి చైతన్య.. వీరంతా బయటకు రావడానికి కారణం పోలీసుల ఘనత అనుకుంటే తప్పులో కాలేసినట్లే. వారంతట వారు దయతలచి వచ్చి లొంగిపోవడమో.. లేదా కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడమో జరుగుతోంది తప్ప, అందులో పోలీసుల గొప్పతనమేమీ లేదు.

వాళ్లే కాదు. టీడీపీ ఆఫీసుపై దాడిచేసిన మూకలు.. హైకోర్టు జడ్జిలపై దారుణమైన పోస్టింగులు పెట్టిన వైసీపీ సోషల్‌మీడియా బ్యాచ్‌లో, చాలామంది ఇప్పటిదాకా అయిపు అజా లేరు. అసలు పంచ్ ప్రభాకర్‌ను తీసుకువచ్చే మొనగాడే లేడు. అంటే వారంతట వారు కలుగులోంచి బయటకు వస్తే తప్ప, పట్టుకోలేని దిక్కుమాలిన దుస్థితిలో ఉన్నారా? పోనీ గత ఐదేళ్లలో కూడా ఇంత ప్రజాస్వామ్యయుతంగా.. ఇంత నిర్లిప్తంగా.. ఇంత కరుణామయుల్లా పనిచేశారా అంటే అదీలేదు. మరి పోలీసులు ఏం చేస్తున్నట్లు? పైగా జగన్ జమానాలో పార్టీ నేతలపై రెచ్చిపోయిన వారికే మళ్లీ అందలం? అంటే నిఘా నిద్రపోతోందా? అలాంటి జగనాభిమాన అధికారులెవరో సర్కారుకు నివేదికలివ్వరా? అసలు గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఏం జరిగిందో తెలిసినవారికే, నిఘా వేసే బాధ్యతలు అప్పగించారా? ఇవీ..సోషల్‌మీడియాలో నిప్పులు కక్కుతున్న టీడీపీ సోషల్‌మీడియా సైనికుల పోస్టులు.

జగన్ జమానాలో డీజీపీ ఆఫీసుకి కూతవేటు దూరంలో ఉన్న, టీడీపీ రాష్ట్ర కార్యాలయమైన ఎన్టీఆర్‌భవన్‌పై.. వైసీపీ ముష్కరమూకలు చేసిన ఆటవిక దాడిలో, పార్టీ ఆఫీసు ధ్వంసమయింది. జీతాల కోసం పనిచేసే అమాయక ఉద్యోగులను రాక్షసంగా గాయపరిచారు. డజన్ల సంఖ్యలో బీహార్ తరహాలో తెగబడి చేసిన ఆ దాడి దృశ్యాలు, సోషల్‌మీడియాలో ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి.

అప్పట్లో దానిపై దాడిచేసిన వారికి నోటీసులు ఇచ్చి పంపిన పోలీసులు, ఫిర్యాదు చేసిన వారిపై మాత్రం కేసులు పెట్టారు. అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ వంటి వారిపై కేసులు పెట్టారు. వారిని పోలీసులు విచారించారు. ఆ సందర్భంగా తమకు గుర్తు లేదన్న సమాధానం ఇచ్చారు. ఫోన్లు ఇచ్చేందుకు నిరాకరించారు. ‘ఆ విచారణ అలా విజయవంతంగా జరిగిందన్న’మాట.

తాజాగా ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మొత్తం దాడిలో కీలకపాత్ర పోషించిన అప్పిరెడ్డి అనుచరుడు, పానుగంటి చైతన్య పోలీసులకు దొరకకుండా పారిపోయాడు. అతనొక్కడే కాదు. ఆ దాడిలో భాగస్వాములయిన కిరాయి మనుషులు కూడా పారిపోయారు.

అయితే అందులో కీలక పాత్ర పోషించిన చైతన్య కోసం, పోలీసులు ఎంత కష్టపడినా కనిపించలేదట. ఒళ్లంతా కళ్లు చేసుకుని వెదికినా కనిపించలేదట. జాలర్ల నుంచి ఎన్ని వలలు తెచ్చినా దొరకలేదట. అతగాడి ఫోన్లపై నిఘా వేసినా ఆచూకీ తెలియలేదట.

అయితే విచిత్రంగా అదే చైతన్య.. తన లాయర్ ద్వారా దిలాసాగా వచ్చి కోర్టులో లొంగిపోయారు. నదురు బెదురు లేకుండా, బేఫర్వాగా వచ్చి కోర్టులో లొంగిపోయిన ఈ సమర్ధుల జీవనయాత్ర సర్కారును వెక్కిరించింది. ఇది నిస్సందేహంగా పొలీసుల అసమర్ధత-నిస్సహాయతను స్పష్టం చేస్తోంది. దీనిపై టీడీపీ సోషల్‌మీడియాలో శరపరంపరగా పోలీసులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ముసుగు ధరించిన చైతన్య, తన న్యాయవాదులతో వచ్చి మంగళగిరి కోర్టులో లొంగిపోవడం పోలీసుల అసమర్ధ-వైఫల్యాన్ని జమిలిగా చాటినట్లయింది. చైతన్య రావడం, లొంగిపోవడం, కోర్టు 14 రోజుల రిమాండ్‌కు తరలించడం ముగిసిన తర్వాత విచారణాధికారులు నింపాదిగా మంగళగిరి కోర్టుకు వెళ్లడం విశేషం.

ఫలితాల తర్వాత గుంటూరు నుంచి జంపయిన చైతన్యను పట్టుకునేందుకు, పోలీసులు నాలుగు బృందాలు ఏర్పాటుచేశారు. వారిని ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు పంపించారు. అంటే చైతన్య కోసం బోలెడు డబ్బు ఖర్చు చేశారన్నమాట.

అయితే స్విచ్చాఫ్ చేసుకున్న చైతన్య ఎవరికీ దొరక్కుండా తిరుగుతూనే ఉన్నాడు. హటాత్తుగా మంగళగిరి కోర్టులో లొంగిపోవడం బట్టి, పోలీసుల విచారణ ఎంత వేగంగా జరిగిందో అర్ధమవుతుంది. పోలీసులు నాలుగైదు బృందాలు ఏర్పాటుచేసినా, చైతన్య దొరక్కుండా కోర్టుకు వచ్చి లొంగిపోయాడంటే.. నాలుగైదు రాష్ట్రాలకు వెళ్లిన పోలీసులకు దారి ఖర్చులు వృధా అయ్యాయే తప్ప, ఫలితం కనిపించలేదన్నది స్పష్టమయింది.

‘‘ఈ కేసులో పోలీసుల విచారణ వేగం చూసి నత్తలు కూడా ఈర్ష్యపడినట్లున్నాయి. పోలీసులు తమకంటే వేగంగా ఎలా కదలగలుగుతున్నారని నత్తలు కూడా నవ్వుకున్నట్లున్నాయి’’ అంటూ సోషల్‌మీడియాలో తమ్ముళ్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇదే కేసులో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని, అంతకుముందు ఈవీఎంను బద్దలుకొట్టిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పట్టుకోవడంలోనూ పోలీసులు చేతులెత్తేశారు. నత్తలతోపోటీ పడిన విచారణపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. అప్పిరెడ్డికి పోలీసు శాఖలోని కొందరు అధికారులతోపాటు, గుంటూరులోని కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు టీడీపీ నేతలు కూడా సహకరించారన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును చావగొట్టిన నాటి సీఐడీ అధికారి విజయ్‌పాల్‌ను పట్టుకోవడంలోనూ పోలీసులు చేతులెత్తేయడంపైనా సోషల్‌మీడియా సైనికులు ఫైరవుతున్నారు.

ఆయనకు గుంటూరు ఎస్‌బీలోని ఓ కిందిస్థాయి అధికారి ఉప్పందించిన ఫలితంగానే, ఆరోజు రాత్రి విజయపాల్ గుంటూరు నుంచి పారిపోయారన్న ఆరోపణలు వినిపించాయి. విజయ్‌పాల్ కోసం ఎంత వెతికినా కనిపించలేదన్న పోలీసులు.. ఆయన ఢిల్లీలో తేలి, న్యాయవాది సాయంతో ఊరట తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నప్పటికీ నో యూజ్. ఈవిధంగా పోలీసులకు కనిపించని నిందితులు.. లాయర్లకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారంటే, పోలీసులు పనిచేస్తున్నట్లా? నిద్రపోతున్నట్లా అని తెలుగుతమ్ముళ్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు నియామకాల్లో జరిగిన తప్పులే ఇంకా కొనసాగుతున్నాయని సోషల్‌మీడియా సైనికులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జగన్ జమానాలో ఆయనపై తిరుగుబాటు చేసిన నాటి సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును చీటర్ అంటూ, అప్పట్లోనే ఫేస్‌బుక్‌లో దూషించిన ఓ అడిషనల్ ఎస్పీకి, ‘పశ్చిమగోదావరి జిల్లాలో కీలక బాధ్యత అప్పగించిన మేధావులకు మా జోహార్లు’ అంటూ వెటకారాలాడుతున్నారు.

సహజంగా కానిస్టేబుళ్లు తమపై అధికారి అయిన ఎస్‌ఐ, సీఐని దూషించేందుకే భయపడతారు. కానీ ఇంకా డీజీపీ హోదాలోనే ఉన్న ఒక స్టేట్ ఆఫీసర్‌ను, ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి దూషిస్తూ, పేస్‌బుక్‌లో పోస్టు పెడితే చర్యలు తీసుకోకపోగా.. పెద్ద జిల్లాలో పోస్టింగ్ ఇవ్వడమేమిటన్నది తమ్ముళ్ల ప్రశ్న.

ఇక విపక్ష నేత చంద్రబాబును, అనపర్తిలో అర్ధరాత్రి సెల్‌ఫోన్ వెలుగులో నడిపించిన సీఐ, ఎస్‌ఐలకు.. కోనసీమ జిల్లాలో కీలక బాధ్యతలు అప్పగించడం పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోనసీమకు మారిన ఆ అధికారికి ఇప్పటికీ జగనాభిమానం పోలేదని, తమ కార్యకర్తలపై జగన్ సర్కారు తెరిచిన రౌడీషీట్లు తొలగించాలంటూ.. కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చే వినతిపత్రాలను, ఆయన బుట్టదాఖలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. జిల్లా కీలక అధికారి సైతం, ఆయన మాటలే వింటున్నట్లు తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు.

మంత్రి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రాపురం నియోజవర్గంలో, నాటి వైసీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు… ఎన్నికల్లో తన అవసరానికి తీసుకువచ్చిన డీఎస్పీనే, మంత్రి సుభాష్ కొనసాగించడంపైనా టీడీపీ సోషల్‌మీడియా సైనికులు విరుచుకుపడుతున్నారు. రెండుసార్లు డీఎస్పీ బదిలీలు జరిగినా, ఆయనను మాత్రం కదిలించకపోవడంపై తమ్ముళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన మంత్రికి, కార్యకర్తల త్యాగాలు ఏం తెలుసని నిలదీస్తున్నారు.

పార్టీ అధినేత చంద్రబాబునాయుడు. చిత్తూరు జిల్లా అంగళ్లులో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు, ఆయనపై వైసీపీ నేతలు రాళ్ల దాడి చేశారు. దానితో కార్యకర్తలు ప్రతిఘటించారు. ఆ ఘటనలో స్వయంగా చంద్రబాబుతోపాటు, బాధితులైన కార్యకర్తలపై కేసులు పెట్టిన అధికారి గంగాధర్‌రావుకు, కృష్ణాజిల్లా ఎస్పీ పోస్టింగ్ ఇవ్వడంపై పార్టీ సోషల్‌మీడియా సైనికులు చేసిన హాట్ కామెంట్స్ తెలిసినవే.

ఎన్నికల చివరి రోజుల్లో నాటి సీఎం జగన్‌పై, యువకులు రాయి విసిరిన కేసులో.. ఇప్పటి ఎమ్మెల్యే బొండా ఉమాను అరెస్టు చేసేందుకు అప్పటి విజయవాడ పోలీసు అధికారి రమణమూర్తి వ్యవహరించిన తీరుపై, బొండా సహా కార్యకర్తలు కన్నెర్ర చేశారు. తర్వాత అదే రమణమూర్తి, సినీనటి జత్వానీ కుటుంబాన్ని ముంబై నుంచి తీసుకువచ్చిన దానిలోనూ, కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలున్నాయి. అయితే ఆయనకు గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీగా పోస్టింగ్ ఇవ్వడంతో క్యాడర్ భగ్గుమంది. ఆయనకు పోలీసు శాఖలోని ఓ కీలక అధికారి ఆశీస్సులున్నట్లు ప్రచారం జరిగింది. రఘురామకృష్ణంరాజు కేసులో విచారణాధికారి అయిన రమణమూర్తి, ఇప్పటివరకూ ఒక్కరినీ పట్టుకోలేని కారణంతో ఆయనను తప్పించి, ప్రకాశం ఎస్పీకి కేసు విచారణ అధికారి బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది.

ఇక జగనాభిమానులైన ఐపిఎస్‌లలో ఒకరైన అమ్మిరెడ్డికి, కీలకమైన డీజీపీ ఆఫీసులో డీఐజీ అడ్మిన్‌గా నియమించడంపై తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన, ఓ మంత్రి సిఫారసుతోనే ఆయనకు పోస్టింగ్ ఇచ్చారని, క్యాబినెట్‌లో రెండు-మూడు స్థానాల్లో ఒకటైన శాఖను వెలిగిస్తున్న సదరు మంత్రిగారే.. అమ్మిరెడ్డి పక్షాన చక్రం తిప్పారంటూ, సోషల్‌మీడియాలో తమ్ముళ్లు విరుచుకుపడుతున్నారు. అమ్మిరెడ్డి ఉమ్మడి అనంతపురంలో పనిచేసినప్పటి బంధం, ఇప్పుడు పనికివచ్చిందంటున్నారు. పులివెందులలో వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లులను సంపూర్ణంగా ఇచ్చేసి, విశాల హృదయాన్ని చాటుకున్న వైనాన్ని ఈ సందర్భంగా తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు.

ఈ విధంగా జగన్ హయాంలో రెచ్చిపోయిన వారిని, జగన్ మాదిరిగా హింసించమని తాము కోరుకోవడం లేదని, కనీసం వారిని పట్టుకుని దోషిగా నిరూపించకపోతే, ఇక మా త్యాగాలకు అర్ధం ఏమిటన్నది ప్రశ్న. రఘురామకృష్ణంరాజును హింసించిన వారిలో ఇప్పటివరకూ ఒక్కరినీ అరెస్టు చేయలేదంటే.. ఏపీలో అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? మా త్యాగాలు వృధాయేనా? అన్న అనుమానాలు వస్తున్నాయంటూ, తమ్ముళ్లు సోషల్‌మీడియాలో విరుచుకుపడుతున్నారు.

అయితే అసలు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే.. నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించడంలోనే, పార్టీ-ప్రభుత్వం విఫలమయిందన్న మరికొన్ని కథనాలు, సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. జగన్ జమానాలో ఎవరెవరు ఇబ్బందులు పడ్డారు? అప్పటి పోలీసులు ఎవ రిని ఇబ్బందులు పెట్టారు? ప్రభుత్వం మారిన తర్వాత ఇచ్చిన పోస్టింగులలో జగన్ అభిమానులెవరు? వైసీపీకి అనుకూలంగా పనిచేసిందెవరన్న కీలక అంశాలపై.. అవగాహన ఉన్న అధికారిని నిఘా విభాగంలో నియమిస్తే, ఈ సమస్య ఉండేది కాదంటున్నారు. పోనీ ఈ అంశాలలో నాటి జగన్ బాధితుడైన సీనియర్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వంటి అధికారుల సలహాలు తీసుకున్నా, ఈ సమస్యలు వచ్చేవి కాదన్న వాదన వినిపిస్తోంది.

అందుకు భిన్నంగా జగన్ హయాంలో రాష్ట్రంలో లేని వారికి.. అంత కీలకమైన బాధ్యతలు అప్పగిస్తే, నాటి విషయాలు ఆ అధికారికి ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన అధికారి నిజాయితీపరుడు, ముక్కుసూటి అయినప్పటికీ.. ఐదేళ్లు రాష్ట్రంలో లేని వారికి ఆ బాధ్యత అప్పగిస్తే, పార్టీ-ప్రభుత్వ లక్ష్యం- కార్యకర్తల ఆకాంక్షలు నెరవేరడానికి, ఎన్నేళ్లు పడుతుందన్నది సోషల్‌మీడియాలో తమ్ముళ్లు సంధిస్తున్న ప్రశ్నలు.

LEAVE A RESPONSE