Suryaa.co.in

Andhra Pradesh

తుపాను వేళ ఆమె కృషి ‘అనిత’ర సాధ్యం!

– తుపాను నేపథ్యంలో హోం మంత్రి అనిత వరుస సమీక్షలు
– కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు
– ప్రజలకు ఫోన్ లు, సందేశాల ద్వారా అప్రమత్తం చేస్తున్న విపత్తు నిర్వహణ సంస్థ
– విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా హోం మంత్రి వంగలపూడి అనిత

అమరావతి: తుపాను నేపథ్యంలో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలోనే ఉంటూ జిల్లా కలెక్టర్లకు ఎప్పటికపుడు తగు ఆదేశాలిస్తున్నారు.

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉండడంతో దక్షిణకోస్తా, రాయలసీమ తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఫోన్ లు, సందేశాల ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారంతో జిల్లాల యంత్రాంగాలను తగు విధంగా సంసిద్ధంగా ఉంచాలని హోంమంత్రి పేర్కొన్నారు.

సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి, ప్రకాశం జిల్లాలలోని ప్రతి మండలంలో కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామన్నారు.

విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా తో కలిసి తుపాను ప్రభావ పరిస్థితులను ఆమె ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యాలయంలో తుపాను ప్రభావంపై డిజిటల్ విధానంలో పరిశీలించారు. మత్స్యకారులు, రైతులు, గొర్రెల కాపరులు తుపాను ప్రభావం ఉన్నంత వరకూ ఎక్కడికి బయటికివెళ్లకూడదని హోం మంత్రి కోరారు.

విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా హోం మంత్రి వంగలపూడి అనిత

ఏపీలోని జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, పాలనపరమైన వ్యవహారాలను సమీక్షించే నేపథ్యంలో హోం మంత్రి వంగలపూడి అనితకు విజయనగరం జిల్లా బాధ్యతలను అప్పగించారు. జిల్లాలకు సంబంధించిన సమగ్ర నివేదికలను ముఖ్యమంత్రికి తెలియజేయడం సహా పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షించడంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత వహించనున్నారు.

LEAVE A RESPONSE