Suryaa.co.in

Telangana

గుజరాత్ రైతులే దేశభక్తులా?

– తెలంగాణ రైతులు దేశ అభ్యున్నతికి కృషిచేయడం లేదా ?
– తెలంగాణ పత్తి కన్నా గుజరాత్ పత్తి నాణ్యమైనది కాదని సీసీఐ పేర్కొన్నది
– కేసీఆర్ ప్రభుత్వం మీద ఒంటికాలితో లేచిన మేధావులు ఎక్కడ ఉన్నారు ?
– విధ్వంసపాలకుడు రేవంత్
– తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: గుజరాత్ లో ఉన్న పత్తి ధర తెలంగాణ రైతుల పత్తికి ఇవ్వాలి. తెలంగాణ నుండి ఉన్న కేంద్రమంత్రులు ఇద్దరూ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా ఎందుకు తెరవలేదు ?

వానల మూలంగా పత్తిని స్టాక్ పెట్టుకోలేక తెలంగాణ రైతులు సతమతం అవుతున్నారు.దళారుల చేతుల్లోకి రైతులను నెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దిక్కులేని పరిస్థితులలో రైతులు, మద్దతుధర క్వింటాలు పత్తికి రూ.7521 కి బదులు రూ.5500కు అమ్ముకుంటున్నారు.

గుజరాత్ రాష్ట్రంలో క్వింటాలు పత్తి రూ.8257కు కొంటున్నారు. గుజరాత్ పత్తికి రూ.8257 ఎందుకు ? తెలంగాణ రైతులకు రూ.7521 ఎందుకు ? గుజరాత్ రైతులే దేశభక్తులా ? తెలంగాణ రైతులు దేశ అభ్యున్నతికి కృషిచేయడం లేదా ? రాష్ట్రానికి ఉన్న ఇద్దరు కేంద్రమంత్రులు ఎన్నడైనా రైతుల సమస్యల మీద దృష్టిపెట్టారా ?

కేసీఆర్ మీద విమర్శలు చేయడం తప్ప మీరు ఇంత వరకు ఏం చేశారు ?
ఇద్దరు కేంద్ర మంత్రులు వెంటనే గుజరాత్ లో ఉన్న పత్తి ధర తెలంగాణకు అందేలా కృషిచేయాలి. వెంటనే సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరిపించాలి. మూసీ ప్రక్షాళనకు అడ్డొస్తే పండబెట్టి తొక్కుతా.దగ్గరుండి పనిచేయిస్తా అంటున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగం పట్ల బాధ్యత లేదా ? రైతుబంధు జాడలేదు, క్వింటాలుకు రూ.500 వడ్ల బోనస్ ఊసులేదు. పండిన ధాన్యానికి బోనస్ కోసం వడ్ల నాణ్యత పేరుతో ఆంక్షలు విధిస్తున్నారు.

ఒక్కనాడైనా తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం సీఎం, వ్యవసాయ శాఖా మంత్రి డిమాండ్ చేశారా ? లాంగ్ స్టేబుల్ పేరుతో గుజరాత్ పత్తి నాణ్యత అంటున్నారు. తెలంగాణ పత్తి కన్నా గుజరాత్ పత్తి నాణ్యమైనది కాదని సీసీఐ పేర్కొన్నది.

పేదల ఇండ్లు కూల్చడమే ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యతనా ? ప్రభుత్వాన్ని నడపడానికి అప్పులు తెస్తున్నాం అని చెబుతూ .. రూ.లక్షన్నర కోట్లతో మూసీని ప్రక్షాళన చేస్తాం అని చెప్పడం దేనికి సంకేతం? ప్రభుత్వమే పేదల ఇండ్లను కూలగొడుతూ నేరపూరిత చర్యలకు దిగడం సమంజసమేనా ?

నాలుగేళ్ల పిల్లలు కూడా తమ పుస్తకాలు తీసుకుంటాం అని కోరితే రాతిగుండెలు కూడా కరుగుతాయి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కరగడం లేదు ప్రజల ఇండ్లు కూల్చడం విప్లవచర్యనా ? రేవంత్ ను విప్లవకారుడుగా పోల్చడం అవివేకం. విధ్వంసపాలకుడుగా రేవంత్ చరిత్రలో నిలబడతాడు.

కేసీఆర్ ప్రభుత్వం మీద తొమ్మిదిన్నరేళ్లలో ఒంటికాలితో లేచిన మేధావులు, ఇప్పుడెందుకు నోరుమూసుకున్నందుకు సిగ్గుతో తలవంచుకోవాలి. ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతుంటే వారు ఎక్కడ ఉన్నారు ? బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రభుత్వ మద్దతు ధరకు మించి ప్రైవేటులో పత్తిని రైతులు అమ్ముకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 44 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారు .. బీఆర్ఎస్ హయాంలో రైతులను ప్రోత్సహించి 60 లక్షల పైచిలుకు ఎకరాలకు పత్తి సాగును తీసుకెళ్లాం.పత్తి విస్తీర్ణం పెంపునకు తెలంగాణ ఏర్పాటు తర్వాత తీవ్రంగా కృషిచేశాం.

తెలంగాణ పత్తి నాణ్యతతో సీసీఐ ఖ్యాతి పెరిగింది అని .. సీసీఐకి వచ్చిన అధిక లాభాలు తెలంగాణ పత్తి నాణ్యత మూలంగానే లభించాయని సాక్షాత్తూ సీసీఐ అధినేత గతంలో చెప్పారు. ప్రెస్ మీట్ లో మాజీ కార్పోరేషన్ చైర్మన్ రజనీ సాయిచంద్, బీఆర్ఎస్ నేత కురువ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE