Suryaa.co.in

Andhra Pradesh

తిరిగి వస్తుంటే అడ్డుకోవడం ఏమిటి?

– కక్ష సాధింపు చర్యలు. వేధింపుల పర్వం
– అందుకే ఎయిర్‌పోర్టులో నన్ను ఆపారు
– హైకోర్టు ఆదేశాలున్నా, పట్టని పోలీసులు
– రాష్ట్రంలో అరాచక పాలన.. రెడ్‌బుక్‌ పాలన
– నేను ఏ తప్పు చేయలేదు. ఎందుకు పారిపోతాను?
– స్కిల్‌స్కామ్‌లో ఈడీ దర్యాప్తుపైనా అసత్య ప్రచారం
– రూ.24 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు
– అయినా చంద్రబాబుకు కేసులో క్లీన్‌ చిట్‌ అని ప్రచారం
– ఏ మాత్రం నైతికత ఉందా? అంతగా తప్పుదోవ పట్టించడమా?
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: నేను విదేశాల నుంచి వస్తుంటే, నన్ను విమానాశ్రయంలో ఆపితే.. నేను నేరం చేసి పారిపోతుంటే ఆపినట్లు.. వారి పైత్యమంతా ఒలకపోస్తున్నారు. డిబేట్లలో దారుణంగా చర్చిస్తున్నారు.
తమకు మీడియాలో బలం ఉంది కాబట్టి, ఏ అబద్దాన్ని అయినా ప్రచారం చేయొచ్చని అలా చేస్తున్నారు.

నేను, నా కుటుంబంతో ఈనెల 7న ఢిల్లీ నుంచి బాలి వెళ్లి, 14వ తేదీన తిరిగి వచ్చాను. ఢిల్లీ విమానాశ్రయంలో మధ్యాహ్నం 3.30కి ల్యాండ్‌ అయ్యాను. 6 గం.కు విజయవాడ ఫ్లైట్‌ క్యాచ్‌ చేయాల్సి ఉంది.
అక్కడ నన్ను ఇమ్మిగ్రేషన్‌ వాళ్లు ఆపారు. కారణం మాత్రం చెప్పలేదు. తమకు గుంటూరు ఎస్పీ నుంచి లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) వచ్చిందని చెప్పారు.

నేను విదేశాలకు వెళ్లడం లేదని, తిరిగి వస్తున్నానని, ఇప్పుడు కూడా విజయవాడకే వెళ్తున్నానని చెప్పినా, తామేం చేయలేమన్నారు. అది వేధింపు తప్ప, మరేదీ కాదు. ఈనెల 25వరకు ఏ చర్య తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పడంతో, మోడిఫికేషన్‌ చేశారు. దాంతో ఆరోజు ఫ్లైట్‌ మిస్‌ అయి, మర్నాడు ఉదయం ఫ్లైట్‌కు విజయవాడ వచ్చాను.

ఇంత దారుణ వేధింపా?
చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా? అధికారం ఉండొచ్చు. కేసులు పెట్టొచ్చు. కానీ కోర్టులు అనేవి ఉన్నాయి కదా? మేము కచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తాం. మాకు కోర్టులపై విశ్వాసం ఉంది.

పోలీసు వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. నిన్న గుంటూరు ఎస్పీ నుంచి ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు నిన్న లెటర్‌ వచ్చింది. అందులో నన్ను ఆపాల్సిన అవసరం లేదని రాశారు.

నేను బాలి వెళ్లింది ఈనెల 7న అయితే, నాపై లుక్‌ అవుట్‌ నోటీస్‌ను ఈనెల 10న ఇచ్చారు. అంటే నేను వెళ్లినట్లు తెలుసుకుని ఆ నోటీసు ఇచ్చారేమో?.

నేను పారిపోతుంటే పట్టుకున్నారని ఆరోపణలు చేశారు. అసలు మేమెందుకు పారిపోతాము. ఏం తప్పు చేశామని? మాపై మీరు తప్పుడు కేసు పెట్టారు. ఆనాడు మీమీద కేసులు పెట్టారంటే, అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఆధారాలతో సహా అడ్డంగా దొరికినా మీ పెండ్యాల శ్రీనివాస్‌ నోటీస్‌ తీసుకుని విదేశాలకు పారిపోయారు.

చంద్రబాబు అరెస్టు కూడా కక్ష సాధింపుతో జరగలేదు. సిట్‌ దర్యాప్తు తర్వాత పక్కా ఆధారాలతోనే ఆయన్ను అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడుపై కేసు కూడా అంతే. అన్ని ఆధారాలతోనే ఆయన్ను అరెస్టు చేశారు.

మేం ఏ తప్పు చేయలేదు. మీ పార్టీ ఆఫీస్‌మీద దాడి ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగింది. అది కూడా ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు. అయినా, అంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారు. ఎందుకంత నీచంగా వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారు.

ఆ కేసులో నన్ను ఎక్కడో 131వ ముద్దాయిగా చేర్చారు. కేసులో నాపేరు నమోదు చేయడంతో, కోర్టును ఆశ్రయిస్తే, సెప్టెంబరు 20న హైకోర్టు ఆదేశం ఇచ్చింది. అక్టోబరు 25 వరకు నాపై ఏ చర్య తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

మరి అంత క్లియర్‌గా ఆదేశాలు ఉంటే, నేను విదేశాలకు వెళ్లి, తిరిగి వస్తుంటే, ఆపడం ఏమిటి? కోర్టు డైరెక్షన్‌ వచ్చిన తర్వాత 17 రోజులకు నేను విదేశాలకు వెళ్లి, 24 రోజుల తర్వాత తిరిగి వస్తుంటే, ఎల్‌ఓసీ పేరుతో ఆపడం ఏమిటి?

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేది లేదు. అంతా గుండారాజ్యం. లోకేష్‌ చెప్పినట్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. పోలీసుల వ్యవహారం అలా ఉంటే, ఛానళ్లలో పిచ్చి డిస్కషన్స్‌ చేస్తూ, అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు.

నిన్న చూశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఈడీ ఆస్తులు అటాచ్‌ చేస్తే.. ఈడీ చంద్రబాబుకు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఏమైనా కామన్‌సెన్స్‌ ఉందా?. అక్కడ స్కామ్‌ జరిగింది కాబట్టే, ఈడీ కేసు దర్యాప్తు చేస్తోంది. ఆస్తుల అటాచ్‌మెంట్‌ జరుగుతోంది. ఆ కేసు అంత క్లియర్‌గా ఎస్టాబ్లిష్‌ చేస్తుంటే, చంద్రబాబుకు క్లీన్‌చిట్‌ ఇస్తూ, తమ మీడియాలో రాయిస్తున్నారు. చంద్రబాబు నేరం చేశాడు కాబట్టే, ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. అయినా దాన్ని క్లీన్‌చిట్‌ అని సిగ్గు లేకుండా రాస్తున్నారు. అలా జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

అంటే, వారు టార్గెట్‌ చేసుకున్న వారిని ఎలాగోలా కేసులో ఇరికించేందుకు.. ఎవరినో పట్టుకురావడం, ఏదేదో చెప్పించడం అలవాటుగా మారింది. ముంబై నటిని తీసుకొచ్చి ఎవరెవరి పేర్లో చెప్పించారు.

నిజానికి టీడీపీ ఆఫీస్‌మీద దాడి ఘటనలో అసలు కేసే లేకపోతే, దాన్ని ఇప్పుడు సీఐడీకి అప్పగిస్తారట. చూస్తుంటే దాన్ని దేశద్రోహం కేసుగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. 2024 ఎన్నికలకు ముందు మీడియాను అడ్డుపెట్టుకుని ఎలా రాజకీయాలు చేశారో.. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చినా, అదే మీడియా సహకారంతో, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, తప్పుడు కేసులు పెడుతున్నారు. వేధిస్తున్నారు. జగన్‌ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. దాంట్లో భాగంగానే, నాపై ఎల్‌ఓసీ ఉందని, నన్ను విమానాశ్రయంలో ఆపారు.

టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో అసలు కేసు పెట్టడానికి అవకాశం కూడా లేదు. బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టే కుట్ర చేశామని కూడా కేసు పెట్టారు. ఎవరెవరినో తీసుకొచ్చి లోపల వేశారు. వారితో ఎవరెవరి పేర్లో చెప్పించి, కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలి. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? కోర్టు ప్రొటెక్షన్‌ ఉంది కాబట్టి నన్ను ఎయిర్‌పోర్టు నుంచి వదిలేశారు.

LEAVE A RESPONSE