Suryaa.co.in

Editorial

వద్దన్న విజయసాయి.. మళ్లీ ముద్దయ్యారా?

– ఉత్తరాంధ్ర పార్టీ పగ్గాలు మళ్లీ విజయసాయిరెడ్డికే
– గతంలో ఆయనను అక్కడి నుంచి అర్ధంతరంగా తప్పించిన జగన్
– సజ్జల సలహా, సుబ్బారెడ్డి కోరిక మేరకు విజయసాయి ఔట్
– అప్పట్లో ఆయనపై వేగుల నిఘా
– ఎన్నికల ముందు వైవి సుబ్బారెడ్డికి పట్టం కట్టినా ఫలించని వ్యూహం
– ఉత్తరాంధ్రలో పార్టీ కోసం కష్టపడ్డ విజయసాయిరెడ్డి
– అయినా జగన్‌కు ఆయనపై కోటరీ చాడీలు
– ఎన్నికల తర్వాత పార్లమెంట్ నాయకుడి బాధ్యతల నుంచి తొలగింపు
– ఆయన స్థానంలో మిథున్, సుబ్బారెడ్డిని నియమించిన జగన్
– కనీసం రాజ్యసభ నేత హూదా కూడా దక్కని అవమానం
– ఇప్పుడు మళ్లీ విజయసాయికి ఉత్తరాంధ్ర బాధ్యతలపై పార్టీలో చర్చ
– ప్రస్తుతం పార్టీలో అంటీముట్టనట్లు ఉన్న విజయసాయిరెడ్డి
– పార్టీలో సజ్జల, అప్పిరెడ్డి, తలశిలదే హవా
(మార్తి సుబ్రమణ్యం)

వాడుకో.. వదిలెయ్. అవసరం వచ్చినప్పుడు మళ్లీ పిలువ్. ఇది ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పాటిస్తున్న నయా రాజకీయ సూత్రం. అధికారంలో ఉన్నప్పుడు ఎంపి విజయసాయిరెడ్డిని అడ్డగోలుగా వాడుకుని.. సజ్జల, సుబ్బారెడ్డి మాట విని ఆయనను పక్కనపెట్టిన జగన్‌కు, ఇప్పుడు మళ్లీ ఉత్తరాంధ్రలో అదే విజయసాయిరెడ్డి దిక్కవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాడు నెంబర్‌టూగా ప్రచారంలో ఉన్న ఎంపి, పార్లమెంటరీపార్టీ నేత విజయసాయిరెడ్డి.. ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా అవిశ్రాంతంగా కష్టపడిన వైనాన్ని, విశాఖ వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. విశాఖలో అయితే ఒక డివిజన్ స్థాయి నాయకుడిని సైతం పేరు పెట్టి పిలిచి, ప్రోత్సహించిన విజయసాయి.. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపార ని చెబుతున్నారు. విజయసాయి ప్రోత్సాహంతోనే చాలామంది కార్పోరేటర్లు, ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేసే స్థాయికి ఎదిగారంటున్నారు.

ఇక ఉత్తరాంధ్రలో కూడా పార్టీ అంతర్గత సమస్యలతో పాటు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సమస్యలను పరిష్కరించే క్రమంలో, సంబంధిత అధికారులతో మాట్లాడిన వైనాన్ని వైసీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సీఎంగా జగన్ ఎవరికీ అందుబాటులో ఉండని నేపథ్యంలో, విజయసాయి అంతా తానై పార్టీ నేతల సమస్యలను పరిష్కరిస్తే.. చివరకు ఆయనను ఎన్నికల ముందు పార్టీ బాధ్యతల నుంచి తప్పించిన జగన్.. మళ్లీ అదే విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించడంపై పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ చిన్నాయన వైవి సుబ్బారెడ్డి కలసి.. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి విజయవంతంగా తప్పించారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. ప్రధానంగా విజయసాయిపై అనైతిక వ్యవహారాలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా, జగన్‌కు ఇప్పించారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరగకపోలేదు. ఆయన కార్యకలాపాలు-కదలికలపై చివరకు వేగులతో నిఘా వేయించారని గుర్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్రపై ఏమాత్రం అవగాహన లేని వైవి సుబ్బారెడ్డికి.. ఎన్నికల ముందు ఆ ప్రాంత బాధ్యతలు అప్పగించినా, ఫలితం శూన్యమని వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఎన్నికల ఫలితాల తర్వాత కూడా విజయసాయిని అవమానించిన వైనాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మీడియా ముందుకొచ్చి, తన భార్య బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రి అని, ఆయనకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలంటూ నానా రచ్చ చేసిన ఎపిసోడ్‌లో.. విజయసాయిరెడ్డి పార్టీలో దాదాపు ఒంటరివారయ్యారు.

ఆయనకు మద్దతుగా ఏ ఒక్క స్థాయి నాయకుడు కూడా, మీడియాముందుకు రాని వైనాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆ ఎపిసోడ్‌లో విజయసాయిరెడ్డి ఒంటరిపోరాటం చేశారే తప్ప, జగన్ సహా ఏ ఒక్క అగ్రనాయకుడూ విజయసాయికి దన్నుగా రాలేదంటున్నారు. తనపై దుష్ప్రచారం చేసిన ఒ చానెల్ సీఈఓకు లీగల్ నోటీసు పంపించటమే కాకుండా, టాల్కమ్ పౌడర్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే.

అప్పటికి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని.. తొలగించి ఆయన స్థానంలో మిథున్‌రెడ్డిని నియమించిన జగన్.. రాజ్యసభ నాయకుడిగా కూడా కొనసాగుతున్న విజయసాయిని తప్పించి, తన బాబాయ్ సుబ్బారెడ్డిని రాజ్యసభలో పార్టీ నేతగా నియమించి, అవమానించారని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో విజయసాయిరెడ్డి, జగన్ కోసం ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ప్రధాని మోదీ-హోంమంత్రి అమిత్‌షా చాంబర్ల వద్దనే ఆయన ఎక్కువగా దర్శనమిచ్చేవారు.

కేవలం విజయసాయి లాబీయింగ్ వల్లే.. అన్ని అంశాల్లో జగన్‌కు ఊరట వచ్చిందన్న విషయం, బహిరంగ రహస్యమేనంటున్నారు. అన్ని వ్యవస్థలనూ జగన్‌కు అనుకూలంగా మలచడంలో విజయసాయిదే కీలకపాత్ర అన్నది బహిరంగ రహస్యమేనంటున్నారు. ఐదేళ్ల కాలంలో ఒక్కరోజు కూడా జగన్.. ఏ ఒక్క కేసులోనూ కోర్టుకు హాజరుకాని విషయం తెలిసిందే. టీడీపీ ఎన్డీఏలో చేరకుండా చివరివరకూ శతవిధాలా ప్రయత్నించిన విజయసాయిరెడ్డి, ఆ అంశంలో మాత్రం విజయవంతం కాలేకపోయారు. అయితే ఎన్నికల సమయంలో ఈసీతో చర్చలు, ఫిర్యాదులు, ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఆయన ఎక్కువగా ఢిల్లీలోనే గడిపారు. పార్టీ కోసం అంత చిత్తశుద్ధితో పనిచేసిన విజయసాయికి, పార్టీలో ప్రాధాన్యం లేకుండా చేయడంలో సజ్జల విజయం సాధించారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తారకరత్న మృతి తర్వాత విజయసాయి, టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం, జగన్ మనసులో నాటడంలో కోటరీ సక్సెస్ అయిందంటున్నారు. తారకరత్న మృతికి ముందు విజయసాయి తన ట్వీట్లలో బాబు-లోకేష్‌ను దుర్భాషలాడేవారు. ఒకదశలో బాబును ముసలోడు కూడా కూడా సంబోధించారు. అయితే తారకరత్న మృతి తర్వాత.. విజయసాయిరెడ్డి తన ట్వీట్లలో అంతుకుముందుకు భిన్నంగా, చంద్రబాబుగారు అని ట్వీట్ చేయడాన్ని కూడా జగన్ వద్ద తమ వాదనకు మద్దతుగా చూపించారంటున్నారు.

చివరకు విజయసాయిరెడ్డి మద్దతుదారన్న అనుమానంతో, జగన్‌కు బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డిని సైతం పార్టీలో తనంతట తాను నిష్క్రమించేలా చేశారంటున్నారు. కేవలం విజయసాయిరెడ్డి సన్నిహితుడన్న కారణంగానే, ప్రకాశం జిల్లాలో బాలినేనికి చెక్ పెట్టిన వైనాన్ని పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

ఇంతగా అవమానించి, పక్కనపెట్టిన విజయసాయిని మళ్లీ పిలిచి, ఉత్తరాంధ్ర బాధ్యతలు కట్టబెట్టడం వింతగా ఉందని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ అధినేత జగన్ మాట కాదనలేక విజయసాయి ఈ బాధ్యతలు తీసుకున్నప్పటికీ.. ఇప్పటికే అక్కడ వివిధ హోదాల్లో సుబ్బారెడ్డి వర్గీయులే ఉన్నందున, వారు విజయసాయికి సహకరిస్తారా అన్నదే ప్రశ్న.

ఇక ఇప్పటికే మండలిలో విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖతోపాటు.. ఉత్తరాంధ్ర వ్యవహారాలను అనధికారికంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా బొత్స, విశాఖ కేంద్రంగానే మంత్రాంగం నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి మునుపటి మాదిరిగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందా? అన్నది వైసీపీలో జరుగుతున్న మరో ప్రధాన చర్చ.

‘విజయసాయిరెడ్డి మొదటి నుంచి రాజారెడ్డితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఆడిటర్‌గా వైఎస్ కుటుంబంతో గంటలపాటు మాట్లాడే చనువు ఉంది. వైఎస్ కుటుంబానికి విధేయుడు. కాకపోతే దగ్గరగా ఉండేవారు నిందలు మోయాల్సి ఉంటుంది. అది తెలియక ఆయనంటే గిట్టని మా పార్టీ పెద్దలు కొందరు, విజయసాయి మరికొందరు ఎంపీలతో కలసి బీజేపీలోకి వెళ్లిపోతున్నారని ప్రచారం చేశారు. జగన్ కోసం జైలుకెళ్లి తన జీవితాన్ని త్యాగం చేసిన విజయసాయిరెడ్డి పార్టీ ఎలా మారతారు? అందుకే ఆయనకు ఇష్టం లేకపోయినా జగన్ చెప్పినందున, ఉత్తరాంధ్రకు ఇన్చార్జిగా వెళతారు’ని మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

తన ప్రాధాన్యం తగ్గించేందుకు కారణమైన జగన్ కోటరీమీద అసంతృప్తితోనే, విజయసాయిరెడ్డి విజయవాడ వెళ్లడ ం మానేశారు. ఆయన చాలాకాలం నుంచి తాడేపల్లి జగన్ క్యాంపు ఆఫీసులో జరిగే పార్టీ మీటింగులకు దూరంగా ఉండి, హైదరాబాద్-ఢిల్లీకే పరిమితమవడానికి అదే ప్రధాన కారణమని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

LEAVE A RESPONSE