Suryaa.co.in

Editorial

కిక్కు అదిరింది బాసూ!

  • ఏపీలో కొత్త లిక్కర్‌కు గల్లాపెట్టెల గలగల

  • ఖజానాకు పెరుగుతున్న లిక్కర్ కిక్కు

  • యమాస్పీడుగా అమ్ముడుపోతున్న కొత్త బ్రాండ్లు

  • పెరిగిన ‘బీర్’బలులతో కేసులకు కేసుల అమ్మకాలు

  • నాణ్యమైన మద్యం దొరకడమే దానికి కారణం

  • బ్రాండ్ల రాకతో బార్లకు తగ్గిన ఆదాయం

  • ఒకేచోట వైన్ షాపులు పెట్టడంతో తగ్గిన పోటీ

  • గతంలో మాదిరి ఏరియా పాయింట్లు లేకపోవడమే సమస్య

  • గతంలో పాయింట్ల ప్రకటనతో కనిపించని సమస్య

  • ఇప్పుడు ఉన్నచోటనే ఆదాయం పంచుకోవాల్సిన దుస్థితి

  • ఎమ్మెల్యేలకు 30 లక్షల మామూళ్లు

  • మరికొన్ని చోట్ల పెట్టుబడి లేకుండానే వాటాలు డిమాండ్ చేస్తున్న వైనం

  • చాలాచోట్ల పార్టీ నేతల షాపుల నుంచే మామూళ్లు డిమాండ్ చేస్తున్న వైచిత్రి

  • ఫలితంగా సిండికేట్లకు అన్నిచోట్లా అవకాశం

  • గ్రామాల్లో బెల్లుషాపులకు పోటీ

  • రహదారులపై మందుబాబుల హడావిడితో జనాలకు ఇబ్బంది

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఐదేళ్ల పాటు జగన్ బ్రాండ్లతో మొహంమొత్తిన మందుబాబులు ఇప్పుడు బ్రాండ్ల రాకతో యమా ఖుషీతో కనిపిస్తున్నారు. ఫలితంగా వైన్‌షాపుల గల్లాపెట్టె గలగలలాడుతుండగా.. ఖజానాకు సైతం లిక్కర్ కిక్కు పెరుగుతోంది. కొత్తఐన్‌షాపుల్లో బ్రాండ్ల రాకతో.. ఇప్పటిదాకా బార్లపై ఆధారపడిన మందుబాబులు, ఇప్పుడు బార్ల మొహం చూడటం మానే స్తున్నారు. అంతా బాగానే ఉన్నా.. గతంలో మాదిరి వైన్ షాపు పాయింట్లు ఇవ్వకుండా, ఊరి పేర్లు ఇవ్వడం సామాన్య జనాలకు ఇబ్బందికరంగా పరిణమించింది.

ఏపీలో బ్రాండెడ్ లిక్కరు పొంగి ప్రవహిస్తోంది. ఈనెల 16 నుంచి కొత్త వైన్‌షాపులు ప్రారంభమైన నేపథ్యంలో, బ్రాండెడ్ లిక్కరు కోసం ముఖంవాచిన మందుబాబులు వాటికోసం ఎగబడుతున్నారు. ఫలితంగా ఈ మూడురోజుల్లోనే 541 కోట్ల అమ్మకాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

కేవలం ఈ మూడురోజుల వ్యవధిలోనే వైన్‌షాపు యజమానులు మూడుసార్లు స్టాక్ తీసుకున్నారంటే, ఐదేళ్ల జగన్ బ్రాండ్లపై మందుబాబు ఏ స్థాయిలో విసిగిపోయారో అర్ధమవుతుంది. ఆ ప్రకారంగా 7948 మంది వైన్‌షాపు యజమానులు, లిక్కర్ స్టాకు తీసుకువె ళ్లినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

వారి లెక్కల ప్రకారం.. ఇప్పటిదాకా రాష్ట్రంలో 1,94,261 కేసుల బీర్లు అమ్ముడుపోయాయట. ప్రధానంగా జగన్ ఐదేళ్ల పాలనలో దిక్కులేక బూమ్ బూమ్ వంటి దిక్కుమాలిన బీర్లు తాగిన ‘బీర్’బలులు.. ఇప్పుడు కింగ్‌ఫిషర్, నాకౌట్, రాయల్‌చాలెంజ్, బడ్వైజర్, కరోనా వంటి నిఖార్సైన బీర్లు తాగి చిల్లవుతున్నారు.

ఇక 100 పైపర్స్, టీచర్స్, ఓటీ, మాన్షన్‌హౌస్, మెక్‌డొవెల్స్, రాయల్‌స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, బ్లెండర్స్ స్పైడ్, 8 పీఎం, రాయల్ చాలెంజ్ వంటి విస్కీ, బ్రాందీ 6,77,511 కేసుల లిక్కర్ అమ్ముడుపోయాయి. ఫలితంగా ఈనెల 16 నుంచి ఎక్సైజ్ శాఖ 77 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపిందట.

ఇదంతా బాగానే ఉన్నా.. లిక్కర్‌షాపుల సంఖ్య పెరగడం, గతంలో మాదిరి ఒక పట్టణం, మండలంలోని ఫలానా ఏరియా అని పేర్కొనకుండా.. కేవలం పట్టణాలు పేర్లు-సంఖ్య ఇవ్వడం అటు కోట్లు ఖర్చు పెట్టి వైన్‌షాపులు పెట్టిన వ్యాపారులకు, ఇటు సాధారణ ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఉదాహరణకు గతంలో విజయవాడకు 50 వైన్‌షాపులు కేటాయించారనుకోండి. అందులో విజయవాడలోని ఏయే ప్రాంతాల్లో వైన్‌షాపులు పెట్టుకోవచ్చో స్పష్టం చేసేవారు. దానితో ఆ ప్రాంతాల్లోనే వైన్‌షాపులు పెట్టుకునేవారు. అప్పుడు పోటీ లేకుండా వ్యాపారం బాగా నడిచేది. అది స్థానిక ప్రజలకూ ఇబ్బందిగా ఉండేది కాదు.
ఇప్పుడు అందుకు భిన్నంగా విజయవాడకు 70 షాపులు కేటాయించి, ఏయే ప్రాంతాల్లో షాపులు పెట్టుకోవచ్చో పేర్కొనకుండా, మీ ఇష్టం వచ్చినచోట పెట్టుకోమన్న కొత్త విధానం, వ్యాపారులు-ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. దానితో డిమాండ్ ఉన్నచోటఉఏ నాలుగైదు షాపులు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఉదాహరణకు విజయవాడలో బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, బెంజిసర్కిల్, గుణదల, ఓల్డ్‌సిటీ బాగా రద్దీగా ఉండే ప్రాంతాలనుకోండి. దానితో వ్యాపారులు ఒకేచోట, అంటే ఒకటి నుంచి 3 కిలోమీటర్ల మధ్యలోనే ఐదారు షాపులు పెట్టుకుంటున్న పరిస్థితి. ఇక కాలనీలు, మురికివాడలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దీనితో ఉన్న వ్యాపారాన్నే అందరూ పోటీపడి పంచుకోవటం అనివార్యమవుతోంది. దీనితో సిండికేట్లకు అవకాశం ఏర్పడుతోంది.

ఫలితంగా ఆయా ప్రాంతాల స్థానికులకు, మందుబాబుల హడావిడితో ఇబ్బంది ఏర్పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ప్రజల్లో ప్రభుత్వంపై విమర్శలకు దారితీస్తోందంటున్నారు. ఇక మున్సిపాలిటీల్లోనూ ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఎక్కువ డబ్బు పెట్టి షాపులు దక్కించుకోవడం, స్థానిక ఎమ్మెల్యేలకు వాటాలు ఇవ్వాల్సి రావడంతో వైన్‌షాపులు దక్కించుకున్న వారు ఇప్పుడు గ్రామాల్లో బెల్ట్‌షాపుల వైపు దృష్టి పెడుతున్నారు. ఫలితంగా తమ నష్టాన్ని భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నమాట.

చాలాచోట్ల ఎమ్మెల్యేలకు షాపుకు 30 లక్షలు ఇవ్వాల్సివస్తోంది. అది కాక మళ్లీ నెలవారీ ముడుపులు ‘మామూలే’నట. మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వాటాలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేలు 60-40 నిష్పత్తిలో వాటాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనితో వాటాలు వేసుకుని వైన్‌షాపులు దక్కించుకున్న వ్యాపారులు, వేరే మార్గం లేక సిండికేట్లుగా ఏర్పడటం, బెల్టుషాపులకు తెరలేపడం అనివార్యమవుతోందంటున్నారు.

నర్సరావుపేట నియోజకవర్గంలో వైన్‌షాపుల కమిషన్ల పంచాయతీ రోడ్డునపడి పార్టీ-ప్రభుత్వ పరువు పోయేందుకు కారణమవుతోంది. ఇక్కడ పార్టీలోని వర్గాల మధ్యనే కొట్లాట జరుగుతుండటం విశేషం. చివరకు ఆ వ్యాపారాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, పార్టీ నాయకులే ప్రెస్‌మీట్ మరీ చెప్పుకోవలసిన పరిస్థితి.

కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు దక్కించుకున్న వైన్ షాపుల నుంచి కూడా, ఎమ్మెల్యేలు మామూళ్లు డిమాండ్ చేస్తుండటాన్ని పార్టీ నేతలు సహించలేకపోతున్నారు. సహజంగా ఎమ్మెల్యేలకు ప్రతి నియోజకవర్గంలో నమ్మకమైన నాయకుడు ఒకరుంటారు. నియోజకవర్గంలోని బార్లు-వైన్‌షాపుల వసూళ్ల వ్యవహారం ఆ నాయకుడే పర్యవేక్షిస్తుంటారు. ఇప్పుడు కొత్త వైన్‌షాపుల నుంచి కమిషన్లు, వాటాల వ్యవహారాలు కూడా వారే పర్యవేక్షిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు ఆర్ధికంగా నష్టపోయిన తమ దగ్గర కూడా.. ఎమ్మెల్యేలు కమిషన్లు, మామూళ్లు, వాటాలు అడగటం ఏమిటని తిరగబడుతున్న పరిస్థితి. మరికొందరు నాయకులయితే, తాము లోకేష్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించేవరకూ వెళుతున్నారు.
కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అధికారులు విఫలమవడంతోపాటు, ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవపట్టించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర ఈ వ్యవహారంలో అంత సీరియస్‌గా వ్యవహరించలేదన్న విమర్శలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

ఎక్సైజ్ పాలసీ అధ్యయనం కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లామంటున్న అధికారులు.. ఇలాంటి పాలసీ ఏ రాష్ట్రంలో అమలవుతుందో, ఇప్పటిదాకా చెప్పకపోవడమే ఆశ్చర్యం. ప్రాంతాల వారీగా కాకుండా.. పట్టణం, నగరం, మండలం వారీగా దరఖాస్తులు తీసుకోవడమే సమస్యకు కారణంగా కనిపిస్తోందని, గుంటూరులోని ఓ వైన్‌షాపు యజమాని చెప్పారు.

LEAVE A RESPONSE