Suryaa.co.in

Andhra Pradesh

అర్చక స్వాములకు విజ్ఞప్తి… త్వరపడండి…

  • ఆంధ్రప్రదేశ్లో అర్చక పరీక్షల దరఖాస్తులకు గడువు పెంపు
  • బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ

రాష్ట్ర దేవాదాయ శాఖ త్వరలో నిర్వహించబోయే అర్చక పరీక్షలకు దరఖాస్తులకు గడువు పెంచినట్టు ఆ శాఖ కమీషనర్ ది 20-10-2024 నేడు సోమవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అర్చక ఆగమ పరీక్షల దరఖాస్తుల గడువు పెంచుతూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనీ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు. అన్ని ఆగమాలకు నిర్వహించే ఈ అర్చక పరీక్షల దరఖాస్తులకు గతంలో నిర్ణయించినట్టుగా సెప్టెంబర్ 20 తేదీ తో గడువు ముగిసినా మళ్ళీ గడువు పెంచిన కారణంగా ఈ నెల అక్టోబర్ 30 వ తేదీ వరకూ ఆన్లైన్ లో దరఖాస్తులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు, అర్చక బ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తి మేరకు కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్ తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ వైదిక, స్మార్త, పాంచరాత్ర, వైఖానస, తంత్రసార, వీరశైవ, శివార్చాక, చాత్తాద శ్రీ వైష్ణవ మరియు గ్రామ దేవత ఆగమములలో ప్రవేశ, వర, ప్రవరస్థాయిలకు దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించబడుతున్న ఈ ప్రకటన తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 16 సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు. అదే విధంగా కనీసం 5వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానమైన విద్యా పరిజ్ఞానం కలిగి ఉన్నట్లు సంబంధిత సంస్థ నుండి లేదా గురువు వద్ద నుండి ధృవీకరణ పత్రం జతపరచాల్సి ఉంది. ఆన్లైన్ లోనే పరీక్ష రుసుము రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

40 సంవత్సరాల వయస్సు నిండిన అభ్యర్థులను మాత్రమే వ్రాత పరీక్షకు మినహాయిస్తారు. వారు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ ను జతపర్చాల్సి ఉంటుంది. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే తప్పనిసరిగా ఓరల్ మరియు వ్రాత (ప్రాక్టికల్) పరీక్ష రాయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. వర మరియు ప్రవర రాసే అభ్యర్థులు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన ప్రవేశ మరియు వర పరీక్షల యోగ్యతా పత్రాలను దరఖాస్తుతో పాటు జతచేయాల్సి ఉంటుంది.

పరీక్షలు రాసే అభ్యర్థులు తమ దరఖాస్తులను 30 అక్టోబర్ 2024 లోగా ఆన్ లైన్ లో apendts.archakaexaminations.com వెబ్ సైట్ లో సమర్పించాలి.

అర్చక సోదరులు అందరూ గమనించ గలరు. ఆగమ పరీక్షల ఫీజ్ చెల్లించడానికి ఆఖరు తేదీ ఈ నెల 30 వ తేదీ, కావున ఫీజ్ చెల్లించ వలసి ఉన్న వారు త్వరగా చెల్లించి త్వరగా దరఖాస్తు చేసుకోవాళని శ్రీధర్ పిలుపునిచ్చారు.

ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తులు చేసేందుకు వెబ్సైట్ ఓపెన్ లోనే ఉందని, పెంచిన గడువుని సద్వినియోగం చేసుకోవాలని శ్రీధర్ తెలియజేశారు.

LEAVE A RESPONSE