-జగన్ పై బురద చల్లడం ఎంత వరకు సబబు?
-వాసిరెడి పద్మపై వరుదు కళ్యాణి ఫైర్
-వైయస్సార్‌సీపీలోనూ, ప్రభుత్వంలోనూ ఉన్నత పదవి
-స్వలాభం కోసం ఆత్మవంచన చేసుకోవద్దు
-వాసిరెడ్డి పద్మకు వరుదు కళ్యాణి హితవు
తాడేపల్లి: వ్యక్తిగత రాజకీయం కోసం పార్టీని వీడిన వాసిరెడ్డి పద్మ, ఇప్పుడు జగన్‌గారిపై బురద చల్లడం ఎంత వరకు సబబు అని వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్ అయ్యారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఉన్నత పదవులు అనుభవించిన వాసిరెడ్డి పద్మ, స్వలాభం కోసం ఆత్మవంచన చేసుకోవద్దని ఆమె హితవు చెప్పారు.
వాసిరెడ్డి పద్మ ఒక నియోజకవర్గాన్ని అడిగారని, ఆ సమయానికి అది వీలు కాకపోవడంతో, క్యాబినెట్ హోదాతో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ను చేసి ఉన్నతస్థానంలో కూర్చోబెట్టారని ఆమె గుర్తు చేశారు.
రాజకీయాలు చేయడానికి మహిళలే దొరికారా? అని వాసిరెడ్డి పద్మ అంటున్నారన్న వరుదు కళ్యాణి, కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల మీద దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే వారి పక్షాన నిలబడి న్యాయం చేయాలని చూడటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం రాజకీయం చేయడమా? బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడం రాజకీయమా?. అని నిలదీశారు.
‘మీ సొంత రాజకీయ ఎజెండాతో జగన్ పై బురద జల్లడం ఎంత వరకు సమంజసం?. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్ద పదవులు అనుభవించిన మీరు నైతిక విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదం’ అని చురకలంటించారు.
దిశ గురించి గతంలో మాటలకు, ఇప్పటి మాటలు ఎంత భిన్నంగా ఉన్నాయో చూసుకోవాలని, ఎవరి ప్రోద్భలంతో విమర్శలు చేస్తున్నారో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని, స్వలాభం కోసం ఆత్మవంచన చేసుకోవద్దని హితవు చెప్పారు. మహిళల రక్షణ, భద్రత కోసం ఇంతగా పోరాడుతున్న జగన్‌గారిపై బురద చల్లడం సమంజసం కాదని, దాన్ని ఎవ్వరూ హర్షించరని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు.