Suryaa.co.in

Andhra Pradesh

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్యాత్మిక పర్యాటక యాత్రలు

– రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ సమీపంలోని టూరిజం క్యాంప్ ఆఫీస్ వద్ద టూరిజం బస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
– జెండా ఊపి ఆధ్యాత్మిక బస్సు యాత్రను ప్రారంభించిన మంత్రి దుర్గేష్ , కూటమి ప్రజా ప్రతినిధులు
– కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను కలుపుతూ ప్రతి శనివారం అందుబాటులో బస్సులు.. భక్తుల కోరిక మేరకు ఆదివారం కూడా ఏర్పాటు చేసే యోచన
– అసెంబ్లీలో శాసనసభ్యుల సూచనల మేరకు ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్
– మంత్రి కందుల దుర్గేష్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టూరిజం శాఖ ఉన్నతాధికారులు, బోర్డ్ డైరెక్టర్ల చేతుల మీదుగా ప్రారంభమైన పర్యాటక యాత్ర బస్సులు

రాజమహేంద్రవరం: రాష్ట్ర పర్యాటకాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలన్న ఉద్దేశంతో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఒకరోజు ఆధ్యాత్మిక పర్యటన ప్యాకేజీకి శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

శనివారం ఉదయం రాజమహేంద్రవరం లోని సరస్వతి ఘాటు వద్ద ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం దగ్గర ఆధ్యాత్మిక పర్యటన ప్యాకేజీ బస్సును మంత్రి కందుల దుర్గేష్ జెండా ఊపి ప్రారంభించారు.

ఒక రోజు పూర్తి ఆధ్యాత్మిక భావంతో దేవాలయాలను సందర్శించుకుని యాత్రికులు ఇంటికి తిరిగి వెళ్లేలా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

2025 మార్చి నాటికి ప్రస్తుత టూరిజం పాలసీ ముగుస్తుందని ఏప్రిల్ 2025 నుంచి కొత్త టూరిజం పాలసీ అమల్లోకి తీసుకొస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇప్పటికే కొత్త టూరిజం పాలసీకి సంబంధించిన కార్యాచరణ సిద్దం చేశామని పేర్కొన్నారు. టూరిజం శాఖలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టూరిజం బోర్డ్, అధికారులు, అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి చేస్తామన్నారు.

LEAVE A RESPONSE