– జగన్‌ను తిట్టించడమే విజయసాయి లక్ష్యమా?
– వైఎస్ మృతిపై నాలుక మడతేస్తున్న వైసీపీ నేతలు
– గతంలో అంబానీ కారణమంటూ జగన్, విజయమ్మ, షర్మిల ఆరోపణ
– విచారణ జరపాలంటూ ఆందోళనలు
– రిలయన్స్ షాపులపై జగన్ అభిమానుల దాడులు
– ఆ తర్వాత అదే అంబానీ వియ్యంకుడు నత్వానీకి వైసీపీ రాజ్యసభసీటు
– ఇప్పుడు వైఎస్ మృతికి చంద్రబాబు కారకుడంటూ విజయసాయి కొత్త ఆరోపణ
– వాతావరణం బాగలేకనే హెలికాప్టర్ మరణమని చెప్పిన నాటి కాంగ్రెస్ సర్కారు
– షర్మిల సవాలుకు జవాబు లేక వైసీపీ అడ్డదారులు
– విజయసాయి వ్యాఖ్యలు జగన్‌ను తిట్టించడానికేనంటున్న వైసీపీ సీనియర్లు
– నత్వానీకి ఎంపి ఎలా ఇప్పించారని జగన్‌ను టీడీపీ ప్రశ్నించాలన్నదే విజయసాయి లక్ష్యమంటున్న వైసీపీ వర్గాలు
– విజయసాయిది ‘నెగటివ్‌లో పాజిటివ్ పాలిటిక్స్’ అంటున్న సీనియర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
రచ్చబండకు బయలుదేరిన నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలిక్పాప్టర్ ప్రమాదానికి గురయి.. పావురాలగుట్టలో మనిషిని సైతం గుర్తుపట్టనంత మాంసం ముద్దగా మారిన సంఘటన గుర్తుందా? ఆ హెలికాప్టర్ మృతి వెనక అంబానీ హస్తం ఉందంటూ, వైఎస్ కుటుంబం సామూహికంగా రోడ్డెక్కిన వైనం గుర్తుందా? వైఎస్‌ను చంపేశారంటూ జగనాభిమానులు ఉమ్మడి రాష్ట్రంలోని రిలయన్స్ షాపులు లూటీ చేసి, విధ్వంసం చేసిన దాష్టీకం గుర్తుందా?
గోదావరి బేసిన్లో అంబానీ ఆయిల్ సామ్రాజ్య విస్తరణకు వైఎస్ అడ్డు వస్తున్నందుకే, తమ తండ్రిని హెలికాప్టర్ ఘటనలో మట్టుబెట్టారంటూ.. జగన్ అండ్ విజయమ్మ అండ్ షర్మిల కోడై కూసిన శబ్దాలు గుర్తున్నాయా? తండ్రి మృతిపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాలంటూ, సకుటుంబ సపరివార సమేతంగా గళమెత్తిన వైనం గుర్తుందా? అంటే వైఎస్ హెలికాప్టర్ మృతి వెనుక, రిలయన్స్ అధినేత అంబానీ హస్తం ఉందన్నది జగన్ సహా ఆయన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు నాడు చేసిన గత్తరన్నమాట.
మరిప్పుడు జగన్‌కు ఎడమభుజమైన ఎంపి విజయసాయిరెడ్డి.. వైఎస్ మృతికి చంద్రబాబునాయుడు కారణమంటూ, అడ్డంగా నాలుక మడతేయడం రాజకీయ, సామాన్యవర్గాలను విస్మయపరుస్తోంది. స్వయంగా జగన్ కుటుంబం కూడా ఇప్పటిదాకా, ఇలాంటి ఆరోపణలను చంద్రబాబుపై చేయకపోవడం ఒక ఆశ్చర్యమైతే.. షర్మిల-జగన్ ఆస్తి గొడవలు రోడ్డెక్కి, మహిళలలో జగన్ ఇమేజ్ దారుణంగా డామేజీ అవుతున్న సమయంలో, వైఎస్ మృతి ఘటనను కొత్తగా చంద్రబాబుకు ఆపాదించడం మరో ఆశ్చర్యం. దీన్నిబట్టి వైసీపీ అధినేత జగన్ దగ్గర, షర్మిలను ఎదుర్కొనేందుకు ఎలాంటి అస్త్రాలు లేవన్నది స్పష్టమవుతోంది.
అన్నాచెల్లెల రచ్చను దారిమళ్లించేందుకు, విజయసాయి ప్రయోగించిన ఈ ‘డైవర్షన్ ప్రాపర్టీ స్కీము’ తమకే బూమెరాంగవుతుందన్నది వైసీపేయుల ఆందోళన. అసలు జగన్‌ను తిట్టించడానికే విజయసాయిరెడ్డి, వ్యూహాత్మకంగా వైఎస్ హెలికాప్టర్ ఘటనను తెరపైకి తీసుకువచ్చారన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
వైఎస్ మృతికి అంబానీ కారణమని ఏ జగన్ అయితే, ఆనాడు ఆరోపించారో.. అదే అంబానీ వియ్యంకుడయిన పరిమళ్ నత్వానీకి, వైసీపీ రాజ్యసభ సీటు ఇవ్వడం అప్పట్లోనే విమర్శలకు గురయింది. ఇప్పుడు మళ్లీ దానిని గుర్తు చేసి, జగన్‌ను టీడీపీనేతలతో తిట్టించడమే విజయసాయి అసలు లక్ష్యమన్న ప్రచారం జరుగుతోంది.
మరి తనకు ఎంతో అనుబంధం ఉన్న వైఎస్‌ను అంతం చేసిన అదే అంబానీ కుటుంబానికి చెందిన నత్వానీకి, జగన్ ఎంపి సీటు ఇస్తుంటే.. విజయసాయిరెడ్డి ఎందుకు అడ్డుకోలేదు? రాజారెడ్డి కుటుంబ వీరవిధేయుడైన విజయసాయిరెడ్డి.. తన అభిమాన నేత వైఎస్‌ను చంపిన కుటుంబానికి చెందిన వ్యక్తికి జగన్ ఎంపీ సీటు కట్టబెడితే, అప్పుడే ఎందుకు పార్టీ నుంచి బయటకు రాలేదన్న ప్రశ్నలు, మెడపై తల ఉన్న ఎవరికయినా రావడం సహజం. ఇవేమీ జరగలేదంటే.. విజయసాయిరెడ్డి కూడా వైఎస్ మృతికి కారణమైన అంబానీ కుటుంబానికి చెందిన నత్వానీకి, ఎంపీ సీటు ఇవ్వడాన్ని స్వాగతించినట్లే లెక్క.
ఇక తాజాగా జగన్-షర్మిల ఆస్తి వివాదాలు రోడ్డెక్కి , తన అన్న ఆడిన జగన్నాటకాన్ని షర్మిల, ప్రతిరోజూ మీడియా వేదికగా ఎండగడుతోంది. దానికి సంబంధి తనకు వైఎస్ ఏమేమి ఆస్తులు ఇచ్చారు? జగన్ నుంచి ఏమేమి ఆస్తులు రావాలన్న వివరాలను బహిరంగంగా వెల్లడిస్తుండటం, జగన్‌కు ప్రాణసంకటంగా పరిణమించింది. అయితే చెల్లి ప్రశ్నలు-సవాళ్లకు నేరుగా సమాధానం చెప్పే ధైర్యం లేని జగన్… తన పార్టీ ఎంపీ-ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తుండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దీన్నిబట్టి షర్మిల విసిరే సవాళ్లు, సంధించే ప్రశ్నల్లో నిజం ఉన్నందుకే, జగన్ దగ్గర జవాబు లేదన్న విషయం అందరికీ అర్ధమయిపోయింది.
ప్రధానంగా అసలు వైఎస్ ఆస్తులతో ఎలాంటి సంబంధం లేని సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, కల్యాణి వంటి నేతలతో షర్మిలను తిట్టించడం పార్టీ సీనియర్లకు నచ్చడం లేదు. వైఎస్ ఆస్తులతో సంబంధం లేని వారితో మాట్లాడించడం వల్ల.. షర్మిల ప్రశ్నలు-ఆరోపణలకు జగన్-భారతీ దగ్గర సమాధానం లేకనే, వారితో షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారన్న సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా తాజాగా ఈ ఎపిసోడ్లో తొలిసారి మాట్లాడిన ఎంపి విజయసాయిరెడ్డి.. దివంగత వైఎస్ కుమార్తె షర్మిలను పాముతో పోల్చడాన్ని, వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘వైఎస్ దయతో బ్యాంకు డైరక్టర్, టీటీడీ బోర్డులో పదవి పొందిన ఒక సాధారణ ఆడిటర్ ఈ స్థాయికి రావడానికి కారణం వైఎస్ ద యనే. అలాంటి వ్యక్తి వైఎస్ ఎంతగానో ప్రేమించే షర్మిల పాపను పాముతో పోల్చడం దారుణం. అంటే రేపు విజయసాయిరెడ్డి తనకు ఎంపీ సీటు ఇచ్చిన జగన్పైనయినా ఇలాంటి మాటలే మాట్లాడతారని అర్ధమవుతుంది’’ అని వైఎస్‌కు సన్నిహితుడైన, ఓ కేంద్రమాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
విజయసాయిరెడ్డి దివంగత వైఎస్ మృతికి, చంద్రబాబు కారణమన్న కొత్త ఆరోపణలను తెరపైకి తీసుకురావడంపై.. వివిధ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో చంద్రబాబు ఇంట్లో వెంకటేశ్వరస్వామి పింక్ డైమండ్ ఉందని ఆరోపించి.. ఎన్నికల్లో లబ్థిపొందినట్లే, ఇప్పుడు వైఎస్ మృతికి చంద్రబాబు కారణమన్న కొత్త కోణాన్ని వ్యూహాత్మకంగా చర్చకు తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ వ్యూహం బూమెరాంగవుతుందని, ఇప్పుడు వైఎస్‌ను గుర్తు చేసుకుని, ఆవేశపడేవారెవరూ లేరని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వెంకన్నకు పింక్‌డైమండ్ లేదని ఈఓ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే టీడీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అది వేరే విషయం.
ఇప్పుడు వైఎస్ హెలికాప్టర్ మరణాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడం వెనుక.. టీడీపీతో జగన్‌ను తిట్టించాలన్న తెలివైన అజెండా ఉందన్న ఆసక్తికరమైన చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఇది విజయసాయి చాలా తెలివిగా ఆడుతున్న ‘నెగటివ్‌లో పాజిటివ్ పాలిటిక్స్’ అని ఓ మాజీ మంత్రి విశ్లేషించారు.
‘పెద్దాయన మృతి వెనుక అంబానీ ఉన్నారని స్వయంగా జగన్, విజయమ్మ, షర్మిలమ్మ ఆరోపించిన విషయం అందరికీ తె లుసు. ఆరోజు రిలయన్స్ షాపులు ధ్వంసం చేస్తే కేసులు పెట్టిన సంగ తీ తెలుసు. ఆ తర్వాత ముకేష్ అంబానీ వియ్యంకుడు నత్వానీకి, మా పార్టీనే రాజ్యసభ సీటు ఇచ్చిందనీ తెలుసు. ఇవన్నీ ఇప్పుడు తన మాటలకు టీడీపీ వాళ్లు కౌంటర్‌గా మాట్లాడి, జగన్‌ను తిట్టించాలన్నదే విజయసాయిరెడ్డి ఆలోచనగా కనిపిస్తుంది. అంటే జగన్‌ను టీడీపీతో తిట్టించడానికే ఆయన, వైఎస్ మృతి వ్యవహారం తెరపైకి తీసుకువచ్చినట్లు అర్ధమవుతుంది’’ అని వైసీపీ సీనియర్ నాయకుడు ఒకరు, ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు.
‘‘అంటే వైఎస్ మృతికి కారణమైన అంబానీ కుటుంబానికి జగన్ రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారు? వైఎస్ మృతి వెనుక చంద్రబాబునాయుడు హస్తం ఉందని అప్పుడు ఇదే జగన్ ఎందుకు ఆరోపించలేదు? నిజంగా అంబానీ, చంద్రబాబు హస్తం ఉండి ఉంటే ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్, దానిపై సీబీఐ విచారణ చేయాలని ఎందుకు లేఖ రాయలేదు? తన శైలిలో రాష్ట్రంలో రిలయన్స్ ఆస్తులపై ఎందుకు ఉక్కుపాదం మోపలేదు? అని టీడీపీ నేతలు, జగన్‌ను ప్రశ్నించాలన్నదే విజయసాయి తాజా ఆరోపణ వ్యూహమ’’ని వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సజ్జలకు ప్రాధాన్యం ఇచ్చి, తనను రాజ్యసభ నాయకత్వ పదవి నుంచి కూడా తప్పించిన జగన్‌పై అసంతృప్తితో ఉన్న విజయసాయరెడ్డి.. తెలివిగా జగన్‌ను తిట్టించేపనిలో ఉన్నారని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.