-
‘పువ్వు’ నవ్వలే!
-
టీటీడీలో పాపం ఏపీ బీజేపీ
-
ఒక్క ఏపీ నేతకూ దక్కని చోటు
-
వచ్చిన ఏడూ ఢిల్లీ కోటాకే సరి
-
ఏపీ నాయకత్వ సిఫార్సులు పట్టించుకోని ఢిల్లీ బీజేపీ
-
ముగ్గురి పేర్లూ బుట్టదాఖలు
-
అధ్యక్షురాలి తీరుపైనే అనుమానాలు
-
అందరి పేర్లు పంపించామని చెబుతున్న అధ్యక్షురాలు
-
పరువుపోగొట్టుకున్న ఏపీ బీజేపీ
-
ఏపీ పార్టీకి అంత సీన్ లేదని తేలిన వైనం
-
కుమిలిపోతున్న కమలదళం
( మార్తి సుబ్రహ్మణ్యం)
జీ.. పువ్వెందుకు నవ్వలేదు?.. ఏమో రాష్ట్ర పార్టీని అడుగుతాం.
జీ.. పువ్వెందుకు నవ్వలేదు?.. ఏమో జాతీయ పార్టీని అడుగుతాం.
జీ.. పువ్వెందుకు నవ్వలేదు?.. నవ్వించాలా వద్దా అన్నది మా ఇష్టం. మేము చెప్పినప్పుడే పువ్వు నవ్వుతుంది. నవ్వాలి కూడా! అయినా మనం నవ్వడానికి రాజకీయాల్లోకి రాలేదు. దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాం. మన కు దేశం ముఖ్యం. నవ్వు కాదు. ఇంకెప్పుడూ నవ్వులాట గురించి మా దగ్గర చర్చించకండి. ముందు మీరు మీ రాష్ట్రంలో పువ్వును పరిమళింపచేయండి.
సరే జీ.. భారత్‌మాతా కా జై.. వందే మాతరం!
ఇవీ.. టీటీడీ బోర్డులో ఏపీ ‘పువ్వు’ ఎందుకు నవ్వలేదన్నదానికి సంబంధించి బీజేపీలో పేలుతున్న సెటైర్లు.
* * *
మేం మా అధిష్ఠానంతో చర్చిస్తున్నాం.. మా నాయకత్వంపై మాకు నమ్మకం ఉంది.. మా సూచనలు నాయకత్వం పరిగణనలోకి తీసుకుంది.. మా జాతీయ అధ్యక్షుడు, మోదీ, అమిత్‌షాతో భేటీ అయ్యాం.. రాష్ట్ర పార్టీ పురోభివృద్ధిపై చర్చించాం.. ఇలాంటి గంభీర వ్యాఖ్యలు, భారీ డైలాగులు ఏపీ బీజేపీ పేరు గొప్ప అగ్రనేతల నుంచి తరచూ ప్రెస్మీట్లలో వింటుంటాం. వాటిని విన్నవారు.. అబ్బో ఏపీ నేతలకు ఢిల్లీలో ఎంత పలుకుబడి ఉందోనని ఆశ్చర్యపోవడం సహజం.
ఇంకా రాష్ట్రంలోని కొన్ని తలకాయలయితే ఇప్పుడే అమిత్‌షాతో మాట్లాడాం.. నిన్ననే నద్దా ఫోన్ చేశారు.. రాత్రి సంతోష్జీతో అరగంట మాట్లాడామని చెప్పే బాపతు నేతలు కూడా లేకపోలేదు. కాబట్టి.. ఆ ప్రకారంగా టీటీడీ బోర్డులో హీనపక్షంగా ఏపీ బీజేపీకి ఒకటి రెండు పదవులు దక్కవచ్చని మెదడున్న ఎవరైనా అనుకుంటారు.
కానీ ఏపీ బీజేపీకి అంత సీన్ లేదని, వారంతా ఢిల్లీలో చెల్లని రూపాయలేనని, డాంబికాలు పలికే బిల్డప్ బాబాయ్‌ల హవా అంతా, బెజవాడ దాటదన్న విషయం తాజా టీటీడీ బోర్డు ప్రకటనలో తేటతెల్లమై, ‘తెలుగు పువ్వు’ తెల్లమొఖమేయడంతో తేలిపోయింది. అంటే ‘పువ్వు’నవ్వకపోగా నవ్వులపాలయిందన్నమాట! 24 మందితో టీటీడీ బోర్డు ప్రకటిస్తే, అందులో కనీసం ఒక్క ఏపీ బీజేపీ నేత పేరు భూతద్దం పెట్టి వెతికినా కనిపించకపోవడంతో, పువ్వు నవ్వులపాలయింది. పోనీ తెలంగాణ నుంచయినా స్థానం దక్కిందా అంటే అదీ లేదు. ఈ అవమానంపై కమలనాధులు కస్సుమంటున్నారు.
‘‘అసలు ఏపీలో ఉన్న టీటీడీలో ఏపీ బీజేపీకి చోటు దక్కలేదంటే అది ఎంత అవమానమో మీరే ఆలోచించుకోవాలి. మా అధ్యక్షురాలు, సంఘటనామంత్రి, కేంద్రమంత్రి ఉత్సవవిగ్రహాలేనని, వాళ్లకు ఢిల్లీలో నయాపైసా పలుకుబడి లేదని దీన్ని బట్టి అర్ధమవుతుంది. జాతీయ పార్టీ అయిన మాకు ఇక్కడ ఒక్క మెంబరు కూడా ఇవ్వకుండా, పవన్ పార్టీకి మూడు పదవులిచ్చారంటే అది ఎవరికి అవమానమో నాయకత్వమే ఆలోచించుకోవాలి. మాకు వచ్చే పదవులు కూడా ఢిల్లీ వాళ్లే తీసుకుంటే, ఇక మేం ఇక్కడ పనిచేసి లాభమేమిటి? రేపటి నుంచి మమ్మల్ని ఎవరు లెక్కచేస్తారు? ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదు. గతంలోనే మాకు టీటీడీలో స్థానం కల్పించారు. ఈసారి 8 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాలు సాధించినా ఏపీ నుంచి ఒక్కరికీ ఇవ్వలేదంటే, ఢిల్లీ మమ్మల్ని పట్టించుకోవడం లేదని అర్ధమవుతుంది. మరి ఇక్కడ పార్టీ పనులు కూడా ఢిల్లీ కోటా నుంచి ఇచ్చిన వాళ్లతోనే చేయించుకోమనండి’’ అని బీజేపీ జాతీయ నేత ఒకరు, తమ పార్టీ నేతల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన ఆరెస్సెస్ మద్దతుతో టీటీడీ చైర్మన్ పదవికే ప్రయత్నించగా, అసలు మెంబరు కూడా రాకపోవడం ప్రస్తావనార్హం.
ఢిల్లీ నాయకత్వం తీరు చూస్తే.. ‘మీకు రాష్ట్రంలో ఒక మంత్రి పదవి, ఒక కార్పొరేషన్ చైర్మన్ సిఫార్సు చేయడమే ఎక్కువ’ అన్నట్లుందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ బీజేపీ నుంచి టీటీడీలో స్థానం కోసం సోమువీర్రాజు, విష్ణువర్దన్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, పాతూరు నాగభూషణం తదితరులు అవిశ్రాంతంగా ప్రయత్నించారని పార్టీ వర్గాలు చెప్పాయి. వీరిలో ఒకరైతే ఏకంగా సంఘ్ మద్దతుతో చైర్మన్ పదవినే ఆశించినట్లు చెబుతున్నారు. మరో ఇద్దరు కిషన్‌రెడ్డి ద్వారా పదవి కోసం లాబీయింగ్ఖ చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర నాయకత్వం మాత్రం కోలా ఆనంద్, భానుప్రకాష్‌రెడ్డి, పాతూరు నాగభూషణం పేర్లు ఢిల్లీకి పంపినట్లు సమాచారం. చివరాఖరకు అసలు ఏ ఒక్కరికీ టీటీడీలో స్థానం దక్కకపోవడం నిరాశతోపాటు, ఆగ్రహం కలిగించింది.
కాగా టీటీడీలో చోటు సంపాదించుకున్న ఉత్తరాదివారిలో ఇద్దరు తప్ప, మిగిలిన వారంతా ఢిల్లీ బీజేపీ కోటాలోని వారే కావడం విశేషం. హోంమంత్రి అమిత్‌షా సహా, పలువురు కేంద్రమంత్రులు సిఫార్సు చేసిన వారికి బోర్డులో పదవులు దక్కాయని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. బడా పారిశ్రామికవేత్తవేత్తలయిన వారిని ఏపీలో ఒక్క కార్యకర్త కూడా గుర్తు పట్టరని, అయినప్పటికీ గతంలో పదవులు ఇచ్చిన కుటుంబాలకే మళ్లీ పదవులు ఇచ్చారని కేతన్ దేశాయ్ పేరు ఉదహరిస్తున్నారు.
బీజేపీ నాయకత్వ వ్యవహారశైలి తమను అవమానించిందన్న భావన నేతల మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘‘ ముగ్గురి పేర్లు తీసుకున్న నాయకత్వం, అందులో ఒక్కరికీ ఇవ్వలేదంటే వారు సమర్ధులు కారని నాయకత్వం భావిస్తోందా? మరి సమర్ధులు కాని వారికి పార్టీ పదవులు కూడా ఎందుకు ఇచ్చినట్లు? పోనీ ఆ ముగ్గురూ సమర్ధులు కాకపోతే ఆ సమర్ధులెవరో ఢిల్లీ నాయకులే గుర్తించి టీటీడీలో వారి పేర్లు సిఫార్సు చేయవచ్చు కదా?’’ అని ఉత్తరాంధ్ర బీజేపీ నేత ఒక ప్రశ్నించారు. అసలు ఏపీ బీజేపీ నేతలకు పదవులు ఇప్పించాలన్న ఆలోచన పార్టీకి లేదన్నది దీనితో స్పష్టమయిందంటున్నారు.
కష్టపడ్డ వారికి గుర్తింపు ఇప్పించని ఇంతోటి దానికి కోర్ కమిటీ, సంఘటనా మంత్రి ఎందుకన్న ప్రశ్నలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షులు, కోర్ కమిటీ, సంఘటనా మంత్రి సమన్వయంతో రూపొందించిన జాబితాను సహజంగా నాయకత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. కానీ ఇక్కడ నుంచి పంపించిన ముగ్గురి పేర్లను అసలు పరిగణనలోకి తీసుకోలేదంటే, మా పార్టీ నేతలకు ఢిల్లీలో నయాపైసా పలుకుబడి లేదని సామాన్య కార్యకర్తలకూ తెలిసిపోయింది. ఇక మా అధ్యక్షుడు, సంఘటనామంత్రిని ఎవరు లెక్కచే స్తారు? ఇది మాకే కాదు. వాళ్లకే పెద్ద అవమానం’’ అని నాయకులు రుసరుస లాడుతున్నారు.
టీటీడీ జాబితాలో బీజేపీ నాయకత్వం సిఫార్సు చేసిన వారి పేర్లు పరిశీలిస్తే.. వారిలో ఏబీవీపీలో పనిచేసిన ఒక్క నరేష్కుమార్ తప్ప, ఏ ఒక్కరూ పార్టీ జెండా మోసిన వారు కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో అనేక ఆరోపణలు, కేసులు ఎదుర్కొన్న కేతన్ దేశాయ్ తనయుడికి సిఫార్సు చేయడం వల్ల కార్యకర్తలకు ఏం సంకేతాలు పంపిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
‘గతంలో జగన్ ప్రభుత్వం టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని, కేతన్ దేశాయ్ వంటి నేరగాళ్లకు ఎలా టీటీడీ సభ్యత్వం ఇచ్చిందని అప్పటి అధికార ప్రతినిధి యామిని, మా అధ్యక్షురాలు పురందేశ్వరి ట్వీట్లో ప్రశ్నించారు. మరి ఇప్పుడు మా పార్టీనే కేతన్ తనయుడికి బోర్డులో సిఫార్సు చేసింది. దీన్నిబట్టి మా పార్టీ క్యాడర్, ప్రజలకు ఏం సంకేతాలిస్తోంది’ అని ఓ సీనియర్ నేత ప్రశ్నించారు.
కాగా జగన్ నియమించిన టీటీడీ బోర్డుపై వైసీపీ చేసిన విమర్శలపై.. వైసీపీ చేసిన ఎదురుదాడిని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కేతన్‌దేశాయ్, కృష్ణమూర్తి వైద్యనాధన్, ఎస్సార్ విశ్వనాధ్, నర్వేకర్, అమోల్‌కాలే, సౌరభ్ బోరాను సిఫార్సు చేసిందెవరు? అమిత్‌షా, నిర్మలాసీతారామన్, షిండే, దేవేంద్రఫడ్నవీస్ సిఫార్సు చేసిన వారికే కదా బోర్డులో పదవులిచ్చింది? మరి ఎవరు ఎవరికి పునరావాసం కల్పించినట్లు’’అని వైసీపీ విసిరిన వ్యంగ్యాస్త్రాలను ఇప్పుడు బీజేపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు.
పార్టీ జెండా మోసిన వారు లేకనా ఉత్తరాది నుంచి, పరాయి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నారు? గత ఎన్నికల్లో టికెట్లు రాని సీనియర్లకు బోర్డులో అవకాశం కల్పిస్తే, క్యాడర్లో మంచి సంకేతాలు వెళ్లేవి కదా? దానికి బదులు నిధులు సమీకరించేవారికి ఇవ్వడం వల్ల, పార్టీ తత్వం ఏమిటో ప్రజలకు అర్ధం కాదా? అని కృష్ణా జిల్లాకు చెందిన ఓ నేత ప్రశ్నించారు. మొత్తానికి టీటీడీ బోర్డులో ఢిల్లీ బీజేపీ ఏపీని అనాధను చేసి, అవమానించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధ్యక్షురాలు గట్టిగా అడగరేం?
అయితే ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర అధ్యక్షురాలు వ్యవహరిస్తున్న తీరుపై నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పదవుల సిఫార్సు వ్యవహారాల్లో అధ్యక్షురాలిని కలిసిన సీనియర్లతో, ‘మీ పేరు పంపిస్తున్నా’నని చెబుతున్నారని, అయితే తీరా ఫలితాలు చూస్తే అసలు అధ్యక్షురాలు తమ పేరు పంపించలేదన్న విషయం అర్ధమవుతోందని నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
టీటీడీ విషయంలో కూడా ఆమె చాలామందికి హామీలిచ్చారని, చివరకు ముగ్గురి పేర్లు మాత్రమే పంపించారని, తమ వాదనకు మద్దతుగా చెబుతున్నారు. సంఘటనా మంత్రి మధుకర్జీ తిరుపతి నేత భానుప్రకాష్‌రెడ్డి కోసం, అధ్యక్షురాలు పాతూరి నాగభూషణం కోసం ప్రయత్నించి ఉంటారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
‘‘‘సీఎంగారు ఆమె మాటలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న సంగతి అందరికీ తెలుసు. ఈ విషయంలో సంఘటనా మంత్రి మాట కూడా నడవడం లేదనీ మాకు తెలుసు. ఆమె ఫలానా వారికి ఫలానా పదవి ఇవ్వాలని సీఎంకు చెప్పడం లేదు. చెబితే కచ్చితంగ మాకు పదవులొస్తాయి. కానీ ఆమె తన మనుషులు లేనందున, మాకోసం గట్టిగా మాట్లాడటం లేదని అర్ధమవుతోందని’’ రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అసలు విషయం వెల్లడించారు.
కోలా అనంద్ పేరును శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అడ్డుకున్నారు. భానుప్రకాష్‌రెడ్డికి ఇవ్వడం ఆమెకే ఇష్టం లేదంటున్నారు. నాగభూషణం విషయంలో చంద్రబాబునాయుడుకు ఏదో ఉన్నట్లుంది. అందుకే వివాదరహితులైన పేర్లు సూచిస్తే చంద్రబాబు ఎందుకు ఆమోదించరు? అలాంటి వారి పేర్లు సూచించడంలో రాష్ట్ర అధ్యక్షురాలు విఫలమయినట్లు కనిపిస్తోంది. మేడమ్ తపన చైదరికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్న ప్రచారం మా పార్టీలో ఉంది. ఎందుకంటే ఆయన దగ్గుబాటి బంధువు కాబట్టి. కానీ అది చంద్రబాబుకు ఇష్టం ఉండదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా మిగిలిన వారి పేర్లు సూచిస్తే, వారికి న్యాయం జరుగుతుందన్న కోణంలో ఎందుకు ఆలోచించడం లేదో అర్ధం కావడం లేదని గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.