Suryaa.co.in

Editorial

‘కొండ’పై మళ్లీ పాత వాసనలే

  • పాత వైసీపీ నేతలకే మళ్లీ పట్టం

  • బోర్డు కూర్పుపై కూటమిలో అసంతృప్తి

  • పార్టీకి ప్రత్యక్షంగా పనిచేసిన వారెవరూ లేరంటూ విమర్శలు

  • కమ్మవారికి ఐదుగురికి ఇవ్వడంపై ఆ వర్గంలో సంతృప్తి

  • అయితే వారిలో పార్టీ జెండా మోసిన వారెవరంటూ ప్రశ్నలు

  • పార్టీకి పనిచేసిన వారెవరూ లేరా అంటూ సోషల్‌మీడియా సైనికుల చర్చ

  • కృష్ణమూర్తి వైద్యనాధన్‌కు స్థానంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి

  • మేం గుర్తుకురాలేదా అంటున్న బలిజ వర్గం

  • ఏపీలో పార్టీకి పనిచేసిన బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు లేరా అన్న ప్రశ్నలు

  • బోర్డు కూర్పుపై తమ్ముళ్ల పెదవి విరుపు

  • జనసేనలోనూ అదే అసంతృప్తి

  • ఏపీలో ఉండేవారికి స్థానమేదంటూ జనసైనికుల ప్రశ్నలు

  • ఏపీ బీజేపీలో అర్హులు లేరా అంటూ కమలదళం కన్నెర్ర

  • పారిశ్రామికవేత్తలతో నింపేశారంటూ వివిధ వర్గాల వ్యాఖ్యలు

  • కొత్త ‘బోర్డు’పై కిరికిరి

( మార్తి సుబ్రహ్మణ్యం)

కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగునెలల తర్వాత ప్రకటించిన టీటీడీ బోర్డుపై పెదవి విరుపు వినిపిస్తోంది. కొత్త బోర్డులో తెలిసిన ముఖాలు లేవని, అన్నీ పాత ముఖాలే.. అవి కూడా వైసీపీ నుంచి వచ్చినావారేనంటూ కూటమిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఉత్తరాదికి చెందిన పారిశ్రామికవేత్తలకు పట్టం కట్టడం, తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి వైద్యనాధన్‌కు ఆరోసారి అవకాశం ఇవ్వడంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అటు జనసేనాధిపతి పవన్ సైతం ఏపీలో నివసించే వారికి కాకుండా, పార్టీ జెండా మోయని హైదరాబాద్ వాసులకు సిఫార్సు చేయడం జనసైనికులకు మింగుడుపడటం లేదు.

బీఆర్ నాయుడు చైర్మన్‌గా 24 మందితో ప్రభుత్వం ప్రకటించిన టీటీడీ బోర్డుపై ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తితో కనిపించడం లేదు. చివరకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సైతం జాబితా చూసి పెదవి విరుస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధం చేసి, రాజద్రోహం కేసుకు గురైన బీఆర్ నాయుడు టీటీడీ అధికారంలోకి వచ్చేందుకు కసితో పనిచేశారు. దానిపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు.

ఈసారి ఎప్పుడూ లేని విధంగా.. ఐదుమంది కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికి స్థానం కల్పించడంపై, ఆ వర్గంలో సంతోషం వ్యక్తమవుతోంది. టీడీపీ స్థాపించిన తర్వాత టీటీడీలో ఈ స్థాయిలో అంతమందిని నియమించడమే దానికి కారణం. ఈ విషయంలో చంద్రబాబునాయుడు విమర్శలకు వెరవకుండా, తొలిసారి ధైర్యం చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే బోర్డులో స్థానం సంపాదించిన కమ్మ వారికి.. పార్టీలో పనిచేస్తున్న కమ్మ వర్గాలు పెద్దగా తెలియకపోవడమే అసంతృప్తికి కారణమవుతోంది. ఏపీలో పనిచేస్తూ, పార్టీ జెండా మోసిన కమ్మవారికి, తాము గుర్తు పట్టే కమ్మవారికి ఒక్కరికీ స్థానం కల్పించకపోవడంపై ఆ వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వారిలో కొందరు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండేవారు కావ డమే దానికి కారణంగా కనిపిస్తోంది. ఇక చంద్రబాబు నాయుడును రాజమండ్రి జైల్లో ఉంచినప్పుడు, బాబు కుటుంబానికి ఆశ్రయం కల్పించిన కోటేశ్వరరావు అనే వ్యక్తికి, బోర్డులో స్థానం కల్పించడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పార్టీ కార్యకర్తల్లో మెజారిటీ వర్గం ఈ నిర్ణయంపై పెదవి విరుస్తుండగా, మరికొందరు మాత్రం స్వాగతిస్తున్నారు.

అటు సోషల్‌మీడియాలో మాత్రం బాబు కుటుంబానికి ఆశ్రయం కల్పించిన కోటేశ్వరరావుకు పార్టీలో పదవి ఇస్తే సరిపోయేదని, బోర్డులో స్థానం కల్పించడం సరైంది కాదన్న చర్చ జరుగుతోంది. పదవికి అదే ప్రాతిపదికయితే పార్టీ కోసం ప్రత్యర్ధుల చేతిలో మరణించిన నేతలు చాలామంది ఉన్నారని, ఆస్తులు పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారని, అప్పుడు వారి కుటుంబాలకు సైతం స్థానం కల్పించాలి కదా అన్న ప్రశ్నలు సోషల్‌మీడియా సైనికులు సంధిస్తున్నారు.

జ్యోతుల నెహ్రు, ఎం.ఎస్.రాజు, నన్నూరి నర్శిరెడ్డి, రాజశేఖర్‌గౌడ్, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మినహా.. మిగిలిన వారిని ఎవరూ గుర్తుపట్టే పరిస్ధితి లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కోటేశ్వరరావు ఎవరో తమకు తెలియదని ఉభయ గోదావరి జిల్లా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

సుదీర్ఘకాలం నుంచీ పార్టీనే నమ్ముకున్న తెలంగాణ నేత నర్శిరెడ్డికి స్థానం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ బోర్డులో ఆయన ఒక్కరి పేరుకే అన్ని వర్గాలు ఆమోదం ప్రకటించడం విశేషం. అయితే ఆయనకు ఫోన్లు తీసే అలవాటు లేదన్నది పార్టీ నేతల ప్రధాన ఫిర్యాదు. ఇక వీరిలో జంగా కృష్ణమూర్తి, ప్రశాంతిరెడ్డి వైసీపీ నుంచి వచ్చినవారేనని, వారిద్దరూ గతంలో టీటీడీలో సభ్యులుగా పనిచేసిన వారేనని గుర్తు చేస్తున్నారు.

లడ్డులో జంతుకళేరాల ఆనవాళ్లు ఉన్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లడ్డు కేసును గుర్తు చేస్తున్నారు. ఆ బోర్డులో ప్రశాంతిరెడ్డి పర్చేజింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్న విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయిందా? రేపు సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిటీ మెను కూడా విచారించాల్సి వస్తే అప్పుడు టీటీడీ పరువు ఏమవుతుంది? అని ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల ముందు పార్టీలో చేరిన జంగా కృష్ణమూర్తికి, టీటీడీలో స్థానం కల్పించడంపై ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్మయం వ్యక్తమవుతోంది. ఇక ఇప్పటికే భర్త ప్రభాకర్‌రెడ్డికి ఎంపిగా, ప్రశాంతిరెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి, మళ్లీ ఆమెకు మరోసారి టీటీడీలో స్థానం కల్పించడంపై టీడీపీ సోషల్‌మీడియా సైనికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

‘పదవుల పంపిణీ విధానం ఒక్కొక్కరి విషయంలో ఒక్కో మాదిరిగా అమలవుతోంది. నచ్చకపోతే దానికి అనేక కారణాలు చెబుతారు. నచ్చితే తమకు అనుకూల వాదన వినిపించడం సమంజసం కాదు. ప్రశాంతిరెడ్డికి బదులు నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో సీటు దక్కని వారికి స్థానం కల్పిస్తే, కార్యకర్తల్లో ఎంత మంచి సంకేతాలు వెళతాయి? ఇలాంటి నిర్ణయాల వల్ల పార్టీ నాయకత్వం, ధనవంతుల కొమ్ము కాస్తుందన్న తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంద’ని టీడీపీ సోషల్‌మీడియా సైనికులు పోస్టింగులు పెడుతున్నారు.

ఏపీలో కూటమికి పనిచేసిన బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, విశ్వ బ్రాహ్మణ నాయకులు ఎంతోమంది ఉన్నప్పటికీ.. వారిని విస్మరించి పార్టీ జెండా మోయని, పరాయి రాష్ట్రాలకు చెందిన అవే కులాలకు చెందిన వ్యక్తులకు స్థానం కల్పించడంపై.. ఆయా కులాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక కమిటీలో ఏపీ నుంచి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, బలిజవర్గాలకు స్థానం కల్పించకపోవడంపై ఆయా వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

రాయలసీమలో 13.2 శాతం ఉండి, రాష్ట్రంలో 72 నియోజకవర్గాల్లో ప్రభావితం ఉన్న బలిజలకు, బోర్డులో స్థానం కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. జనాభాలో 12.78 శాతం ఉన్న కాపులకు ఉన్నప్రాధాన్యం 13.2 శాతం ఉన్న మాకు లేదా అని బలిజలు నిలదీస్తున్నారు. గత ఎన్నికల్లో రాయసీమలో వైసీపీకి ఎదురునిలబడి పోరాడిన తమను విస్మరించడంపై, బలిజ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వైసీపీ హయాంలో నియమించిన బోర్డులో బలిజ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులకు స్థానం కల్పిస్తే, కూటమి ప్రభుత్వం మాత్రం ఈ నాలుగు కులాలను విస్మరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలిజల నుంచి అశోక్‌కుమార్, బ్రాహ్మణుల నుంచి మల్లాది విష్ణు, గోవింద హరి, వైశ్యుల నుంచి శిద్దా సుధీర్, క్షత్రియుల నుంచి సుబ్బరాజును నియమించారని, రెండుసార్లు వేసిన బోర్డులోనూ జగన్.. తమ కులాలకు ప్రాతినిధ్యం కల్పించారని ఆయా కుల సంఘాలు గుర్తు చేస్తున్నాయి.

ఇక ఇటీవలి మంత్రివర్గంలో స్థానం కల్పించని తమకు, ఈసారి బోర్డులో కూడా మొండిచేయి చూపడంపై క్షత్రియ వర్గాలు అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో బ్రాహ్మణ, వైశ్య వర్గాలు జగన్‌కు వ్యతిరేకంగా పనిచేయగా, ఏపీలో ఆ రెండు వర్గాలకూ మొండిచేయి చూపడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక వైసీపీ హయాంలో బోర్డు సభ్యులుగా పనిచేసిన కృష్ణమూర్తి వైద్యనాధ న్, బోరా, కేతన్‌దేశాయ్‌కు బదులు ఆయన తనయుడు ఆదిత్ దేశాయ్‌కు స్థానం కల్పించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పుడు బోర్డులో సగానికిపైగా పాతముఖాలే ఉన్నారని, వారిలో వైసీపీ వాసనలే ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గతంలో బోర్డులో సభ్యుడిగా పనిచేసినబోరా.. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురావడం, ఇతర ఆర్ధిక వ్యవహారాల్లో మొనగాడన్న ఏకైక కారణంతో జగన్ సర్కారు, ఆయనను టీటీడీలోకి తీసుకుంది. ఫలితంగా ఆయన కూడా జగన్ సర్కారుకు అప్పులు తీసుకురావడంలో సహకరించారు. ఇప్పుడు మళ్లీ కూటమి కూడా ఆయననే తీసుకోవడం ద్వారా, జగన్ విధానాలనే కూటమి కొనసాగిస్తుందన్న సంకేతం వెళ్లదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అటు జనసేనలో కూడా పవన్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏపీలో పార్టీకి పనిచేసిన వారు, గత ఎన్నికల్లో పార్టీ జెండా మోసిన వారికి కాకుండా.. హైదరాబాద్‌లో ఉండే ఆడిటర్లకు, ఇతరులకు అవకాశం కల్పించడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయికి.. పార్టీతో ఏం సంబంధం ఉందని ఆయనకు బోర్డు మెంబర్ ఇచ్చారని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.

కుతకుతలాడుతున్న కమలదళం
ఇక కొత్త బోర్డు కూర్పుపై ఏపీ బీజేపీ శ్రేణులు తమ జాతీయ నాయకత్వ తీరును ఎండగడుతున్నారు. తమ స్వార్ధం కోసం ఏపీ పార్టీని బలిపశువు చేశారని, తమకు ఇవ్వాల్సిన పదవుల కోటాను హైజాక్ చేసి.. ఘోరంగా అవమానించారంటూ అవమానంతో రగిలిపోతున్నారు.

‘‘ఢిల్లీ పార్టీ కోటాలో స్థానం సంపాదించుకున్న వారిలో ఏఒక్కరూ మాకు తెలియదు. వాళ్ల ముఖాలు మాకు తెలియవు. మా ముఖాలు వారికి తెలియవు. రేపు టీటీడీ సిఫార్సు లెటర్ల కోసం మేం ఎక్కడికి వెళ్లాలి? వాళ్లు తమ రాష్ట్రంలో వారికి తప్ప ఇక్కడ పార్టీవారికెందుకు లెటర్లు ఇస్తారు? అసలు వాళ్లు పార్టీకి పనిచేసిన వారే కానప్పుడు మమ్మల్ని ఎలా గుర్తుపడతారు? ఢిల్లీ పార్టీకి ఏపీ బీజేపీ మనోభావాలతో పని లేదా?‘ అని బీజేపీలోని అన్ని వ ర్గాలు బీజేపీ జాతీయ నాయకత్వంపై విరుచుకుపడుతున్నారు.

ఇప్పటికే టీటీడీ లెటర్లపై తమపై ఒత్తిడి పెరుగుతోందని, ఎవరికి చెప్పాలో అర్ధం కావడం లేదని జిల్లా నేతలు వాపోతున్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళితే, మేడమ్ లెటర్లన్నీ రాజమండ్రి నియోజకవర్గానికే సరిపోతున్నాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడి పార్టీ నేతలకు అవకాశం కల్పిస్తే, కార్యకర్తల ఇబ్బందులు కూడా తీరేవి కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఎవరి కోటాలు వారివే
కొత్త బోర్డులో పార్టీ అధినేత-సీఎం చంద్రబాబు కోటా కింద కుప్పం టీడీపీ నేత శాంతారామ్, యువనేత-మంత్రి లోకేష్ కోటా కింద టీడీపీ అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, జనసేన దళపతి పవన్ కోటా కింద ఆనందసాయికి అవకాశం కల్పించగా, బీజేపీ ఢిల్లీ నాయకత్వం కోటాలో ఏడుగురికి అవకాశం ఇచ్చినట్లు క నిపిస్తోంది.

LEAVE A RESPONSE